పెంచిన గ్యాస్, పెట్రోల్ ధరలు తగ్గించాలి : ఓపీడీఆర్ లీడర్లు

పెంచిన గ్యాస్, పెట్రోల్ ధరలు తగ్గించాలి : ఓపీడీఆర్ లీడర్లు

బెల్లంపల్లి, వెలుగు: కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని గురువారం బెల్లంపల్లిలో ఓపీడీఆర్ లీడర్లు ఆందోళన చేపట్టారు. గ్యాస్ సిలిండర్, కట్టెల పొయ్యితో అంబేద్కర్ చౌరస్తాలో నిరసన తెలిపారు. ఓపీడీఆర్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మహేందర్ మాట్లాడుతూ.. పదేండ్లుగా దేశాన్ని పాలిస్తున్న కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పేదల కోసం ఎలాంటి పని చేయలేదని మండిపడ్డారు. కార్మిక వ్యతిరేక విధానాలు, పరిశ్రమల మూసివేత, వాటాల విక్రయం, కార్పొరేట్ 

కంపెనీలకు లాభాల పంపిణీ కోసమే కేంద్రం పనిచేస్తోందని విమర్శించారు. బొగ్గు పరిశ్రమలో వందశాతం పెట్టుబడులకు అనుమతివ్వడం దుర్మార్గమైన చర్య అన్నారు. పెంచిన ధరలు తగ్గించకపోతే ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. గ్రామీణ పేదల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎన్నం శంకర్, బంక నారాయణ, వెంకటేశ్వర గౌడ్, మాణిక్, యాదగిరి, మల్లయ్య, కనకరాజు, సునీత, లలిత పాల్గొన్నారు.