కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఓపెన్ టెన్త్ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడ్డ వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యార్థులకు బదులు పరీక్షలు రాసిన నలుగురు విద్యార్థులతో సహా మొత్తం 8 మందిపై పోలీసులు కేసు ఫైల్ చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ తుల రవి, చీప్ సూపరెండెంట్ మర్రి శేఖర్ లకు జిల్లా డీఈఓ రాజు మెమోలను జారీ చేశారు.
కామారెడ్డి పట్టణంలో జరుగుతున్న ఓపెన్ టెన్త్ పరీక్షలో కొందరు విద్యార్థులు సరికొత్త మాల్ ప్రాక్టీస్ కు తెరలేపారు. పరీక్షా కేంద్రంలోని సిబ్బంది ప్రోత్సాహంతో పరీక్ష రాసేందుకు తమకు బదులుగా మరో వ్యక్తులను ఎగ్జామ్ సెంటర్ కు పంపించారు. అయితే అబ్జర్వర్ రావడంతో వీరి బండారం బయటపడింది. హడావుడిగా పరీక్ష కేంద్రం నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో ఇన్విజిలేటర్లు అభ్యర్థులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
కామారెడ్డిలో ఓపెన్ 10 పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగినా.. కలెక్టర్ తో పాటు డీఈవో పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి. అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదు చేస్తే కనీసం స్పందించలేని పరిస్థితి నెలకొంది. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మూడు పరీక్షా కేంద్రాల్లో ఇలాంటి అక్రమాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇదంతా పరీక్ష కేంద్రాల్లో ఉండే సిబ్బంది..అభ్యర్థుల నుంచి వేల రూపాయలు తీసుకొని ఓపెన్ టెన్త్ పరీక్షల్లో మాల్ ప్రాక్టీస్ కు పాల్పడుతున్నట్లు సమాచారం. స్వయంగా సిబ్బందే తరగతి బోర్డుపై సమాధానాలు రాస్తున్నట్లు తెలుస్తోంది. ఒకరికి బదులుగా మరొకరు పరీక్ష రాయడం నిబంధనలకు విరుద్ధం అని తెలిసినా అలాగే వ్యవహరిస్తున్నారు.
ఓపెన్ టెన్త్ లో మాల్ ప్రాక్టీస్ ను అరికట్టాల్సిన అవసరముందని పలువురు అభ్యర్థులు చెబుతున్నారు. పరీక్షా కేంద్రాల్లో విద్యాశాఖ అధికారులు తనిఖీలు నిర్వహిస్తే.. డమ్మీ అభ్యర్థుల బాగోతం బయట పడుతుందని కోరుతున్నారు. ఈ వ్యవహరంపై జిల్లా కలెక్టర్ స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ఓపెన్ టెన్త్ మాల్ పరీక్షలతో పరీక్షా కేంద్రాల్లోని సిబ్బంది లక్షల రూపాయలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.