- త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు
- ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైన లీడర్లు
- ఒకరికి మించి మరొకరు గణేశ్ మండపాల ఏర్పాటుకు ఆర్థిక చేయూత
వినాయక చవితికి మండపాల ఏర్పాటు చేయాలంటే చందాల కోసం ఇంటింటికి తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు గణపతి మండపాలు ఎక్కడ ఏర్పాటు చేశారని వెతు క్కుంటూ వచ్చి మరి చందాలు ఇస్తున్నారు. చందాలు ఇవ్వటం, విగ్రహాలు కొనివ్వటం, మండపాల వద్ద అన్నదానాలు, డెకరేషన్ ఏర్పాటుకు పోటీ పడ్డారు. ఈ పోటీకి ప్రధాన కారణం రానున్న స్థానిక సంస్థల ఎన్నికలే. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహులు కామారెడ్డి జిల్లాలోని గ్రామాలు, టౌన్లలో వినాయక మండపా ల ఏర్పాటుకు పోటీపడి చందాలు ఇచ్చారు.
కామారెడ్డి, వెలుగు: వాడవాడలా ఏర్పాటుచేసిన మండపాల్లో గణపతి విగ్రహాలను ప్రతిష్ఠించారు. కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు, బాన్స్వాడ, ఎల్లారెడ్డి మున్సిపాలిటీల పరిధిలో, గ్రామాల్లో భారీగా వినాయక విగ్రహాలను నెలకొల్పారు. యూత్ సంఘాలు , గల్లీ సంఘాలు, కుల సంఘాల ప్రతినిధులు చందాలు పోగుచేసి మండపాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ మండపాలే పోటీచేసేవారికి వేదికలయ్యాయి.
వచ్చే ఎన్నికల దృష్ట్యా..
త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశముంది. ఇప్పటికే సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీల పదవీ కాలం ముగిసింది. మరో నాలుగు నెలల్లో మున్సిపల్‌పాలక వర్గాల పదవీ కాలం ముగియనుంది. ఈ తరుణంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్న నేతలు తమ కార్యకలాపాలను షురూ చేశారు. వివిధ మార్గాల ద్వారా ప్రజల్ని ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు గణేశ్ఉత్సవాలను వేదికగా చేసుకుంటున్నారు. వినాయక ఉత్సవాల్ని ప్రతీ వాడలో నిర్వహిస్తారు. ఈ వేడుకలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సపోర్టు చేస్తే స్థానిక ఓటర్ల దృష్టిలో పడొచ్చనే ఆలోచనలో ఉన్నారు.
దీన్ని దృష్టిలో ఉంచుకొని సిట్టింగ్, కౌన్సిలర్లు, కొత్తగా ఆయా పార్టీల తరపున, ఇండిపెండెంట్లుగా పోటీకి సిద్ధమవుతున్న లీడర్లు పోటీపడి మరీ చందాలు ఇస్తున్నారు. మండపాల నిర్వాహకులు వారి వద్దకు వెళ్లకున్నా, మండపాలను వెతుక్కుంటూట వెళ్లి మరీ వేడుకల ఖర్చుల్లో తమ వంతు చేయూతనందిస్తామంటూ హామీ ఇస్తున్నారు.
పరిస్థితి ఇదీ..
కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో ప్రస్తుత సిట్టింగ్కౌన్సిలర్లతో పాటు, ఆయా వార్డుల్లో కొత్తగా పోటీకి ఉత్సాహం చూపుతున్న వాళ్లు ఉత్సవాల నిర్వాహకులకు పోటీపడి చందాలు ఇచ్చారు. మండపం స్థాయి, స్థానిక పరిస్థితులను బట్టి ఒక్కో మండపానికి రూ.10 వేల నుంచి రూ. 25వేల వరకు ఇచ్చినట్లు తెలిసింది. కొందరు మండపం సెట్టింగ్ ఖర్చు భరిస్తే, మరికొందరు విగ్రహాలను అందజేశారు. ఇంకొందరు అన్నప్రసాద వితరణ ఖర్చులు భరిస్తున్నారు.
- కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లిలోని ఓ వార్డులో పోటీకి ఉత్సాహం చూపుతున్న వారిలో ఒకరు స్థానికులతో మాట్లాడి విగ్రహాలు ఏర్పాటు చేయించారు.
- అశోక్‌నగర్, విద్యానగర్, వివేకానంద కాలనీ, తదితర కాలనీలు, వార్డుల్లోనూ ఇదే పరిస్థితి.
- ఎల్లారెడ్డి, బాన్స్వాడ మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల్లో పలువురు చందాలు ఇచ్చాడు.
- మారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామంలో సర్పంచ్‌గా పోటీ చేయటానికి ఆసక్తి చూపుతున్న ఓ వ్యక్తి 40 విగ్రహాలకు చందాలు ఇచ్చారు. ఒక్కో విగ్రహానికి రూ.5 వేలకు తగ్గకుండా ఇచ్చారు.
- భిక్కనూరు, రాజంపేట, బీబీపేట, తాడ్వాయి, సదాశివనగర్, గాంధారి, లింగంపేట, ఎల్లారెడ్డి, తదితర ఏరియాల్లోని గ్రామాల్లో స్థానిక ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపుతున్న లీడర్లు వినాయక విగ్రహాలు కొనిచ్చారు.