ఓటీటీలపై నియంత్రణేది?..ఓటీటీలను సెన్సార్​ పరిధిలోకి తేవాలి

సాధారణ మానవునికి సినిమా అనేది నేడు సర్వసాధారణ వ్యాపకంగా మారింది. అయితే నేటి ఆధునిక కాలంలో ఓటిటిల రాకతో తీరికలేని మానవునికి ఒక వరంలాగా మారాయి. నేటి స్మార్ట్ యుగంలో యువత ఎక్కువ శాతం ఓటిటిలను వినియోగిస్తుంది. కానీ ప్రస్తుతం ఓ.టి.టిలలో ప్రసారం అవుతున్న కంటెంట్ విషయంలో మాత్రం చాలా వివాదాలు వ్యక్తం అవుతున్నాయి.

అత్యంత వివాదంగా ఓ.టి.టి కంటెంట్లు

2008 సంవత్సరంలోనే ఓటీటీలు మన భారతదేశంలోకి ప్రవేశించాయి. ప్రస్తుతం మన దేశంలో 45 కి పైగా ఓటీటీ సంస్థలు అందుబాటులో ఉన్నాయి. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నెట్లీక్స్, అమేజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్, హాట్ స్టార్ జియో సినిమా వంటివి, ప్రాంతీయంగా ఆహా వంటి ఓటీటీ సంస్థలు ఉన్నాయి. కరోనా వల్ల సినిమా హాళ్లు మూతపడటంతో ఓటీటీల హవా పెరిగి అవి ప్రేక్షకులకు దగ్గర అయ్యాయి. అయితే ఓటీటీలపైన ఎటువంటి నియంత్రణ లేకపోవడంతో అందులో విడుదల అవుతున్న సినిమాలలో, వెబ్ సీరీస్ లలో విపరీతమైన అశ్లీలత, భయోత్పాతం, నియంత్రణ లేని బూతులు, విశృంఖల హింస, కులమతాల మధ్య చిచ్చు పెట్టే సన్నివేశాలు, జాతిసమగ్రత, సమైక్యతను దెబ్బతీసే విధంగా ఉండటం చూస్తున్నాం. రౌడీయిజం, మాఫియాను పెంపొందించే చిత్రాలు, మహిళలపై అశ్లీలత, వారి మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంటున్నాయి. డబ్బులకు ఆశపడుతున్న కొందరు దర్శక నిర్మాతలు విలువల్ని పాటించకుండా సమాజానికి హానికరమైన అంశాలను బాహాటంగానే ప్రదర్శిస్తున్నారు. కుటుంబ సమేతంగా ఓటీటీలు వీక్షించేందుకు వీలుగా లేకుండా చాలా అసౌకర్యంగా ఉంటున్నాయి. పలు సందర్భాల్లో తీవ్రనేరాలు చేసిన నేరస్థులు మేము ఫలానా సినిమా చూసి ఆయా నేరాలకు పాల్పడ్డామని చెబుతున్నారు కూడా.

ఓటీటీలను సెన్సార్​ పరిధిలోకి తేవాలి

ఇటువంటి సంఘటనలు అన్ని వయసుల ప్రజలపై చెడు ప్రభావం చూపే ప్రమాదం ఉంది. దీంతో సినిమాలకు ఉన్న నిబంధనలు ఓటీటీలకు ఎందుకు వర్తించవు అన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. వీటిలో ప్రసారం అయ్యే కార్యక్రమాల్లో అసభ్యతనే ఎక్కువగా కనిపిస్తుంది. దీంతో ఓటీటీలను కూడా సెన్సార్ పరిధిలోకి తేవాలన్న డిమాండ్ పెరుగుతోంది, ప్రస్తుతం ఓటీటీ అంటేనే అశ్లీలతగా మారింది. ఇది సమాజానికి మంచిది కాదు. స్వేచ్చకి విచ్చలవిడితనానికి మధ్య అంతరం చాలా ఉంటుంది. హక్కుల పేరుతో విచ్చలవిడితనాన్ని ప్రోత్సహించడం సరికాదు.

అశ్లీలతను నియంత్రించటం కోసం చేపట్టాల్సిన చర్యలు 

అశ్లీల కంటెంట్ విషయంలో స్వీయ నియంత్రణ పాటించాలని కేంద్రప్రభుత్వం కోరినప్పటికీ అయా సంస్థలు పాటించడం లేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వమే కట్టుదిట్టమైన నిబంధనలు రూపొందించాలి. అవసరమైతే వాటిని కూడా సెన్సార్ పరిధిలోకి తెచ్చి A, U, U/A వంటి సెన్సార్ సర్టిఫికెట్లను ఓటీటీ కార్యక్రమాలకు కూడా వర్తింపజేయాలి. పై సర్టిఫికేట్ల వల్లనే ఒక సగటు ప్రేక్షకుడు సినిమాపై ఒక అవగాహనకి వస్తాడు. అనేక సందర్భాల్లో సినిమాలు థియేటర్లలో విడుదల అయిన తర్వాత ఓటీటీలో మళ్లీ విడుదల చేసే సమయంలో తెలివిగా సెన్సార్ బోర్డ్ వారు తొలగించిన సన్నివేశాలు సైతం జోడించి ఓటీటీలలో విడుదల చేస్తున్నారు. అంతేగాక కొన్నిసార్లు సెన్సార్ పరిశీలనకు పంపని సన్నివేశాలు కూడా నేరుగా ఓటీటీలో మిగతా కథకి జోడించి ప్రసారం చేస్తున్నారు. ఓటీటీలను సెన్సార్ పరిధిలోకి తేవడమే కాకుండా, 'సినిమాటోగ్రఫీ చట్టం-1952' కిందకు ఓటీటీలను జోడించాలి. అలాగే 'మహిళల అసభ్య ప్రాతినిధ్య చట్టం-1986' ను వర్తింప చేయడం ద్వారా మహిళలపై అశ్లీలతను అరికట్టవచ్చు. అంతేగాక క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 95 ను అన్వయించడం ద్వారా మతవిద్వేషాలు, దేశ ద్రోహం, వ్యక్తులను కించపరచడం వంటి వాటిని నియంత్రించవచ్చు. ఇదిలా ఉంటే ఎక్కువ శాతం మంది ఓటీటీలపైన నియంత్రణ తప్పకుండా అమలు చేయాలని కోరుతుంటే, కొంత మంది మాత్రం టీవీ కార్యక్రమాలకు లేని సెన్సార్షిప్ ఓటీటీలపైన అవసరం ఏంటని వాదిస్తున్నారు. ప్రభుత్వ పరంగానే కాకుండా ఆయా ఓటీటీ సంస్థలు, బాధ్యతగా స్వీయనియంత్రణను పాటించి, వారి వారి సంస్థలలో ప్రత్యేక నియమ వ్యవస్థలూ ఏర్పరచుకోవాలి.

ఓటీటీలవల్ల ప్రయోజనాలూ లేకపోలేదు

ఓటీటీల వల్ల ఎక్కువ శాతం నష్టమే ఉన్నప్పటికీ, కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఓటీటీల రాకతో నూతన నటీనటులకు, టెక్నీషియన్లకు అవకాశాలు విపరీతంగా పెరిగాయి. అంతేగాక కొన్నిసార్లు చిన్న సినిమాలు విడుదల చేయడానికి సినిమా థియేటర్లు దొరకనప్పుడు ఓటీటీలలో విడుదల చేసి పెద్ద విజయాలను సొంతం చేసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తక్కువ బడ్జెట్ సినిమాల కి ఓటీటీలు ఒక గొప్ప వరంగా మారాయి. రెవెన్యూ పరంగా కూడా మంచి ఆదాయాన్నే రాబడుతుంది. ప్రస్తుతం మన భారత దేశంలో 4.5 మిలియన్ల ఓటీటీ వినియోగదారులు ఉన్నారు. వీటివల్ల కోట్లల్లో ఆదాయం లభిస్తుంది.

సుప్రీం కోర్టు సూచనలు, కేంద్రం చర్యలు ఏవి?

పలు సందర్భాల్లో ఓటీటీలోని కంటెంట్ పైన వివాదాలు వ్యక్తం అయినప్పుడు పలువురు సుప్రీంను ఆశ్రయించారు. అయితే ఈ సందర్భంలో సుప్రీం కోర్టు కేంద్రప్రభుత్వానికి ఓటీటీ లోని అశ్లీలత నియంత్రణకు పలు మార్గదర్శకాలను రూపొందించాలని సూచనలు చేసింది. అంతేకాక గతంలో 21 మంది పార్లమెంట్ సభ్యులు కేంద్ర ప్రభుత్వానికి ఇదే విషయం పైన ఫిర్యాదు కూడా చేశారు. గతంలో కర్ణాటక హైకోర్టు ఓటీటీలలో విడుదలయ్యే సినిమాలు, వెబ్ సీరీస్​లపై మానిటరింగ్ ఉండాలని కేంద్ర సమాచార శాఖకు ఆదేశాలు జారీ చేసింది. కానీ కేంద్ర ప్రభుత్వం ఓటీటీ సంస్థలకు స్వీయ నియంత్రణ పాటించాలని మాత్రమే సూచించింది.


- నేరడిగొండ సచిన్,ఎంఏ జర్నలిజం