స్పేస్​లో పేరుకుపోతున్న చెత్త..భూ కక్ష్యలో తిరుగుతున్న 14 వేల శాటిలైట్లు

స్పేస్​లో పేరుకుపోతున్న చెత్త..భూ కక్ష్యలో తిరుగుతున్న 14 వేల శాటిలైట్లు
  • మిలియన్ల కొద్దీ చిన్నా పెద్ద వ్యర్థాలు
  • అమెరికాకు చెందిన స్లింగ్ షాట్ ఏరోస్పేస్ కంపెనీ వెల్లడి

బెంగళూరు: అంతరిక్షంలో చెత్త పేరుకుపోతోందని అమెరికాకు చెందిన స్లింగ్ షాట్ ఏరోస్పేస్ కంపెనీ ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా లో ఎర్త్ ఆర్బిట్​లో మొత్తం 14 వేలకు పైగా చిన్నా పెద్దా ఉపగ్రహాలు కక్ష్యలో తిరుగుతున్నాయని చెప్పింది. ఇక వీటితో పాటు అక్కడికి చేరిన శకలాలు, కక్ష్యలో తిరుగుతూ ఒకదానిని మరొకటి ఢీ కొట్టినపుడు ఏర్పడిన వ్యర్థాలు అయితే ఏకంగా కోట్లలోనే ఉన్నాయని పేర్కొంది. ఇందులో కొన్ని మాత్రమే గుర్తించి ట్రాక్ చేసే సైజులో ఉన్నాయని తెలిపింది. ఇదిలాగే కొనసాగితే భవిష్యత్ ప్రయోగాలకు ఇబ్బందికరంగా మారుతుందని హెచ్చరించింది. అంతరిక్షంలో వ్యర్థాలను తొలగించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చిందని అంతరిక్ష నిపుణులు కూడా చెబుతున్నారు. ఉపగ్రహ ప్రయోగాలకు లో ఎర్త్ ఆర్బిట్ చాలా అనుకూలమైందని చెప్పారు. మనం ఉపయోగిస్తున్న గ్లోబల్ నేవిగేషన్, కమ్యూనికేషన్ వ్యవస్థలకు సంబంధించిన ఉపగ్రహాలు ఈ కక్ష్యలోనే తిరుగుతున్నాయని అమెరికాకు చెందిన ఔటర్ స్పేస్ ఆఫైర్స్ ఉద్యోగి ఆర్తి హోలా మియాని చెప్పారు. ఈ ఆర్బిట్​లో ఉపగ్రహాలను ప్రవేశ పెట్టడం ద్వారా తక్కువ ఖర్చుతో మెరుగైన ఫలితాలను రాబట్టుకునే వీలుంటుందని వివరించారు. అయితే, ఈ కక్ష్యలో ట్రాఫిక్ పెరగడం వల్ల ఉపగ్రహాలు ఒకదాన్ని మరొకటి ఢీ కొట్టుకునే ప్రమాదం కూడా పెరుగుతుందని మియాని చెప్పారు. దీనికి అదనంగా చెత్త పేరుకుపోవడం వల్ల ఉపగ్రహ ప్రయోగాలకు సమస్యలు ఎదురవుతాయని అన్నారు. వ్యర్థాలను తొలగించాలంటే ముందు ఏయే దేశాలకు చెందిన ఉపగ్రహాలు, ఏ కక్ష్యలో తిరుగుతున్నాయనే వివరాలను దేశాలన్నీ వెల్లడించాల్సి ఉంటుందన్నారు. అప్పుడే అంతర్జాతీయంగా ఓ వ్యవస్థను ఏర్పాటు చేసి ఆయా ఉపగ్రహాలను ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ కాలం తీరిన వాటిని తప్పించే వీలుంటుందని చెప్పారు. అయితే, కొన్ని ఉపగ్రహాలు ఆయా దేశాలకు చెందిన సైనిక, నిఘా అవసరాల కోసం పంపించిన కారణంగా వాటి వివరాలను వెల్లడించే పరిస్థితి లేదని వివరించారు.

స్పేస్​లో పేలిన చైనా రాకెట్..

ఈ ఏడాది ఆగస్టులో చైనా చేపట్టిన ఉపగ్రహ ప్రయోగం చివరి దశలో ఫెయిలైంది. స్పేస్​లో రాకెట్ పేలిపోయింది. దీంతో వేలాది చిన్నా పెద్ద శకలాలు భూకక్ష్యలోకి చేరాయని అంతరిక్ష నిపుణులు తెలిపారు. జూన్​లో రష్యా ఉపగ్రహం ఒకటి ఇలాగే పేలిపోయిందని, ఆ తీవ్రతకు స్పేస్​లోని వ్యోమగాములు బయటకు రాకుండా అంతరిక్ష కేంద్రంలోనే ఉండాల్సి వచ్చిందన్నారు. ఆ ఉపగ్రహం వేలాది ముక్కలుగా మారి లో ఎర్త్ ఆర్బిట్​లో తిరుగుతోందని చెప్పారు.

3,500 ఉపగ్రహాలు పనిచేయట్లే..

ప్రస్తుతం లో ఎర్త్ ఆర్బిట్​లో తిరుగుతున్న వాటిలో 3,500 ఉపగ్రహాలు ఇనాక్టివ్​లో ఉన్నాయని స్లింగ్ షాట్ కంపెనీ నిపుణులు తెలిపారు. వాటిని పంపించిన ఉద్దేశం నెరవేరడంతో ఇక వాటితో ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. వాటి వివరా లు సేకరించి అంతరిక్షం నుంచి బయటకు తీసుకురావడం సాధ్యమేనని అన్నారు. అయితే, గోప్యత కారణంగా ఆయా వివరాలను ఏ దేశాలూ బయటపెట్టబోవని చెప్పారు.