
- భౌతికదేహాన్ని సందర్శించి నివాళులర్పించిన మంత్రి తుమ్మల, ఎంపీ రఘురాంరెడ్డి
- సంతాపాన్ని ప్రకటించిన డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొంగులేటి, ఎంపీ వద్దిరాజు
- కడసారి చూపు కోసం పెద్ద సంఖ్యలో తరలివస్తున్న ప్రముఖులు, ప్రజలు
ఖమ్మం రూరల్, వెలుగు : ప్రకృతి ప్రేమికుడు, కుటుంబంతో పాటు మొక్కలను కూడా తన జీవితంలో భాగంగా చేసుకున్న వనజీవి రామయ్య ఇక లేరు. ‘వృక్షో రక్షతి రక్షిత:’ నినాదంతో కోటి మొక్కలు నాటడమే జీవిత లక్ష్యంగా మలుచుకుని దాన్ని నెరవేర్చుకున్న పద్మశ్రీ దరిపల్లి రామయ్య (88) గుండెపోటుతో కన్నుమూశారు. శుక్రవారం రాత్రి ఇంట్లో నిద్రపోయిన అతడిని శనివారం తెల్లవారుజామున కుటుంబ సభ్యులు పిలిస్తే పలకకపోవడంతో వెంటనే ఖమ్మం సిటీలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి తలించారు.
అప్పటికే అతడు చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. అక్కడి నుంచి మృతదేహాన్ని వెంటనే ఇంటికి తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావు, ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి, వైరా ఎమ్మెల్యే మాలోత్ రామదాసు నాయక్, మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ తాతా మధు,మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్చార్జి తుంబూరు దయాకర్‌రెడ్డి, బీజేపీ కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, పద్మశ్రీ భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
రామయ్య మనుమళ్లు దూరం నుంచి రావాల్సి ఉన్నందున ఆదివారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అడిషనల్ కలెక్టర్లు శ్రీనివాసరెడ్డి, శ్రీజ, జిల్లా ఫారెస్ట్ ఆఫీసర్ సిద్దార్ధ విక్రమ్ సింగ్, జిల్లా కాంగ్రెస్అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్, బీఆర్ఎస్, బీజేపీ, సీపీఎం, సీపీఐ నాయకులు కూడా రామయ్య భౌతికదేహాన్ని సందర్శించారు. కాగా ఏదులాపురం మున్సిపల్ కమిషనర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి, ఖమ్మం రూరల్ తహసీల్దార్ రాంప్రసాద్ రామయ్య అంతక్రియల ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.
వనజీవి సేవలు గుర్తు చేసుకుంటూ..
వనజీవి రామయ్య పర్యవరణవేత్తగా, సామాజిక కార్యకర్తగా జీవితాంతం మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం కోసం అంకితమయ్యారు. ఖాళీ భూములు, రోడ్ల పక్కన, ప్రభుత్వ, ప్రైవేట్స్థలాల్లో కోటికి పైగా మొక్కలు నాటి చరిత్ర సృష్టించారు. పర్యావరణ పరిరక్షణ పట్ల ఆయనుకున్న నిబద్ధతతకు గుర్తింపుగా 2017లో భారత ప్రభుత్వం ఆయనను పదర్మశ్రీ పుస్కారంతో సత్కరించింది. కాగా పలువురు
వనజీవి రామయ్య సేవలను యాది చేసుకుంటూ కుటుంబ సభ్యులకు సంతాపం, ప్రగాఢ సానుభూతి లెలిపారు.
వనజీవి జీవితం భవిష్యత్ తరాలకు స్ఫూర్తి : డిప్యూటీ సీఎం భట్టి
వనజీవి రామయ్య జీవితం భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకం. తన ఇంటి పేరును వనజీవిగా మార్చుకొని, కోటికి పైగా మొక్కలు నాటి రికార్డులు సృష్టించారు. అనారోగ్య సమస్యలు వేధించినా మొక్కలు నాటే ఉద్యమాన్ని మాత్రం ఆపలేదు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి.
రామయ్య మృతి దేశానికి తీరనిలోటు : మంత్రి తుమ్మల
ఇంటి పేరునే వనజీవిగా మార్చుకున్న పద్మశ్రీ దరిపల్లి రామయ్య మృతి దేశానికి తీరనిలోటు. చెట్లనే ప్రాణంగా ప్రేమించిన గొప్ప వ్యక్తి రామయ్య. కోటికి పైగా మొక్కలు నాటి, పద్మశ్రీ అవార్డు దక్కించుకుని ఖమ్మం ఖ్యాతిని ఖండాంతరాలకు చాటి చెప్పారు.
మహనీయుడిని కోల్పోవండం బాధాకరం : మంత్రి పొంగులేటి
కోటి మొక్కల ప్రదాత పద్మశ్రీ పురస్కార గ్రహీత వనజీవి రామయ్య మృతి ప్రకృతి ప్రేమికులకు తీరని లోటు. పర్యావరణ పరిరక్షణకు దశాబ్దాల కాలంగా ఆయన కృషి చేశారు. కోటికి పైగా మొక్కలు నాటి పర్యావరణ ప్రేమికులకు ఎందరికో ఆయన స్ఫూర్తిగా నిలిచారు. ఇలాంటి మహనీయుడి ఆత్మకు శాంతి కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను.
గొప్ప పర్యావరణ ప్రేమికుడిని కోల్పోయాం : ఎంపీ రఘురాం రెడ్డి
తన జీవితం మొత్తం పర్యావరణ పరిరక్షణ కోసం తపిస్తూ కోటి మొక్కలు నాటిన వనజీవి రామయ్య లాంటి గొప్ప పర్యావరణ ప్రేమికుడిని కోల్పోవడం చాలా బాధాకరం. రామయ్య తపనంతా మొక్కలు పెంచడం, సంరక్షించడమే. మరణించేంత వరకు వన సంరక్షణే ధ్యేయంగా శ్రమించిన ఆయన భావితరాలకు స్ఫూర్తి.
చెట్లే ప్రాణంగా బతికారు : ఎంపీ వద్దిరాజు
ఇంటిపేరునే వనజీవి గా మార్చుకున్న పద్మశ్రీ దరిపల్లి చెట్లే తన ప్రాణంగా బతికారు. ఆయన మరణం ధరిత్రికి తీరని లోటు. కోటికి పైగా మొక్కలు నాటి, పద్మశ్రీ అవార్డు దక్కించుకున్న రామయ్య ఖమ్మం జిల్లా పేరును ఖండాంతరాలకు తెలిసేలా చేశారు.
జీవితాన్ని పచ్చదనానికి అంకితం చేశారు : మాజీ ఎంపీ నామ
పర్యావరణ పరిరక్షణకు తన జీవితాన్ని అంకితమిచ్చిన గొప్ప వ్యక్తి పద్మశ్రీ వనజీవి రామయ్య. ఆయన సేవలు చరిత్ర లో చిరస్మరణీయంగా నిలిచిపోతాయి. యావత్తు ప్రపంచానికే ఆయన స్ఫూర్తిదాయకం.