ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తాం : యశస్విని రెడ్డి

  •     పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

తొర్రూరు, వెలుగు : ఇచ్చిన హామీలతో పేదలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని  పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. శుక్రవారం పాలకుర్తి లో మహిళదినోత్సవ వేడుకలు ముగించుకొని పాలకుర్తి  నుంచి తొర్రూరు వరకు ఎమ్మెల్యే యశస్విని ఝాన్సి రెడ్డి, కాంగ్రెస్​  ఇన్​చార్జి ఝాన్సి రెడ్డి  ఆర్టీసీ బస్సులో మహిళలతో ప్రయాణం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తుందన్నారు. మహిళల అభ్యున్నతి కోసం అనేక సంక్షేమ పథకాలను అందిస్తుందని తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని కొనియాడారు. వందశాతం ఆరు గ్యారంటీలను అమలు చేస్తామాన్నారు. సీఎం రేవంత్​రెడ్డి దేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా  నిలుపుతాడన్నారు. వచ్చే ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్​ గెలుపు ఖాయమన్నారు. దుబారా ఖర్చు తగ్గించుకుని  ఆర్థిక నియంత్రణ పాటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలకు, అభివృద్ధికి క్రమపద్ధతిలో నిధులు కేటాయిస్తుందని తెలిపారు.

ఆరు గ్యారెంటీల్లో భాగంగా మహాలక్ష్మి పథకం కింద రూ.500కే గ్యాస్‌సిలిండర్‌, గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడానికి తమ ప్రభుత్వం వందశాతం కట్టుబడి ఉందన్నారు.