పీయూలో ఒక్క ప్రొఫెసర్​ లేడు

పీయూలో ఒక్క ప్రొఫెసర్​ లేడు
  • అసోసియేట్, అసిస్టెంట్  ప్రొఫెసర్​ పోస్టులూ ఖాళీనే
  • ఔట్​ సోర్సింగ్​ సిబ్బందితో స్టూడెంట్లకు క్లాసులు
  • పీహెచ్​డీ చేసే వీలు లేక ఇబ్బందులు

మహబూబ్​నగర్, వెలుగు: పాలమూరు యూనివర్సిటీ(పీయూ) రెగ్యులర్​ పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఒక్క రెగ్యులర్​ ప్రొఫెసర్​ను నియమించలేదు. కేడర్​ స్ట్రెంత్​కు అనుగుణంగా నియామకాలు చేపట్టలేదు. అసిస్టెంట్​ ప్రొఫెసర్లు, అసోసియేట్​ ప్రొఫెసర్​ పోస్టులన్నీ దాదాపు ఖాళీగా ఉన్నాయి. దీంతో ఔట్​ సోర్సింగ్​ ఎంప్లాయిస్​ ద్వారా స్టూడెంట్లకు క్లాసులు చెప్పిస్తున్నారు. అయితే రెగ్యులర్  ప్రొఫెసర్లు లేక స్టూడెంట్లకు గైడ్​లు కరువయ్యారు. దీంతో వారు పీహెచ్​డీలు చేసేందుకు దూరం అవుతున్నారు. 

95 పోస్టులకు 77 ఖాళీలు..

పీయూకు 95 మంజూరయ్యాయి. ఇందులో 18 పోస్టులను మాత్రమే భర్తీ చేయగా.. మిగతా 77 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 13 ప్రొఫెసర్​ పోస్టులు శాంక్షన్​ చేయగా.. ఇప్పటి వరకు ఒక్క పోస్టును కూడా భర్తీ చేయలేదు. అసోసియేట్​ ప్రొఫెసర్​ పోస్టులు 24 శాక్షన్​ కాగా.. రెండు పోస్టులను భర్తీ చేసి మిగతా 22 పోస్టులు ఖాళీగానే ఉంచారు. అసిస్టెంట్​ ప్రొఫెసర్​ పోస్టులు 58 శాంక్షన్​ కాగా.. ఇందులో 16 పోస్టులను భర్తీ చేసి, 42 పోస్టులను ఖాళీగానే ఉంచారు. వీరి స్థానంలో ఔట్​ సోర్సింగ్​ పద్ధతిలో 94 మంది అసిస్టెంట్​ ప్రొఫెసర్లను తీసుకున్నారు. వీరు పీయూతో పాటు ఈ వర్సిటీ పరిధిలోని గద్వాల, వనపర్తి పీజీ కాలేజీల్లో డ్యూటీలు చేస్తున్నారు.

పీహెచ్​డీకి ఇబ్బందులు..

వర్సిటీలో ఆయా సబ్జెక్టుల్లో పీహెచ్​డీలు చేసేందుకు స్టూడెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. గైడ్​ షిప్​ ఉండటం వల్ల రెగ్యులర్​ ప్రొఫెసర్లు కింద వారి కోటాలో ఆరుగురికి, అసిస్టెంట్​ ప్రొఫెసర్​ కోటాలో నలుగురికి పీహెచ్​డీలు చేసే అవకాశం ఉండేది. అయితే ఔట్​ సోర్సింగ్   సిబ్బంది ద్వారా సబ్జెక్టులు చెప్పిస్తుండడంతో వీరికి గైడ్​ షిప్​ వర్తించదు. దీంతో స్టూడెంట్లు పీహెచ్​డీలు, ఆయా సబ్జెక్టుల్లో పరిశోధనలు చేయడానికి వీలు లేకుండాపోయింది. ఈ క్రమంలో కొందరు స్టూడెంట్లు ఇక్కడ మానేసి, ఇతర రాష్ర్టాల్లో, వేరే జిల్లాల్లోని వర్సిటీల్లో చేరుతున్నారు. అక్కడే పీహెచ్​డీలు, పరిశోధనలు చేస్తున్నారు.

జీతాలకు తప్ప అభివృద్ధికి నిధులియ్యలె..

వెనుకబడిన పాలమూరు జిల్లాలో పేద విద్యార్థులకు ఉన్న విద్యను అందించాలనే ఉద్దేశంతో 2008లో అప్పటి కాంగ్రెస్​ ప్రభుత్వం 170 ఎకరాల విస్తీర్ణంలో పీయూను ప్రారంభించింది. కొత్త బిల్డింగులు, ఇతర అధునాతన సౌకర్యాలతో వర్సిటీని అందుబాటులోకి తెచ్చింది. ఆ తర్వాత కొద్ది నెలలకే తెలంగాణ ఉద్యమం ప్రారంభం కావడం.. 2014లో స్వరాష్ట్రం ఏర్పాటు కావడంతో ఈ వర్సిటీకి అన్ని మంచి రోజులొస్తాయని భావించారు. కానీ, గత బీఆర్ఎస్​ ప్రభుత్వం ఈ వర్సిటీని పట్టించుకోలేదు. డెవలప్​మెంట్​ కోసం పదేండ్లు రాష్ట్ర బడ్జెట్​లో నిధులు కేటాయించలేదు. 2017లో కేంద్రం మంజూరు చేసిన రూసా ద్వారా వచ్చిన ఫండ్స్​తో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, ఆ తర్వాత చేతులు దులుపుకుంది. చివరి ఐదేండ్లలో కేవలం పీయూలో పని చేస్తున్న సిబ్బందికి జీతభత్యాలకు తప్ప డెవలప్​మెంట్​ కోసం నిధులు ఇవ్వలేదు. 

కాంగ్రెస్​ స్పెషల్​ ఫోకస్..​

కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక పీయూపై స్పెషల్​ ఫోకస్​ పెట్టింది. సీఎం రేవంత్​ రెడ్డితో పాటు స్థానిక ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పీయూకు కేంద్రం నుంచి రూ.వంద కోట్ల నిధులను మంజూరు చేయించుకున్నారు. అలాగే లా, ఇంజనీరింగ్​ కాలేజీలకు పీయూకు  మంజూరు చేయించారు. వచ్చే అకడమిక్​ ఇయర్​ నుంచి ఈ కాలేజీలను అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే లా, ఇంజనీరింగ్​ కాలేజీ​బిల్డింగుల నిర్మాణం కోసం పీయూలో స్థలాలను కూడా పరిశీలించారు. అయితే వర్సిటీలో ప్రధానంగా వేధిస్తున్న ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్​ ప్రొఫెసర్​ పోస్టులను కూడా భర్తీ చేస్తే వర్సిటీ మరింత డెవలప్​ అయ్యే అవకాశం ఉంది.