మహబూబ్ నగర్ రూరల్, వెలుగు: పాలమూరు యూనివర్సిటీలో నేటి నుంచి మూడు రోజుల పాటు న్యాక్ టీం పర్యటించనున్నట్లు పీయూ వీసీ శ్రీనివాస్ తెలిపారు. బుధవారం యూనివర్సిటీలో మీడియాతో మాట్లాడారు. పాలమూరు యూనివర్సిటీ ప్రస్తుతం బి గ్రేడ్లో ఉందని, ఏ ప్లస్ గ్రేడ్ కోసం నాన్ టీచింగ్ సిబ్బంది, విద్యార్థులు సమిష్టిగా కృషి చేస్తున్నారని తెలిపారు.
పీయూలో న్యాక్ సందర్శన కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, అన్ని విభాగాలు, లైబ్రరీ, ల్యాబ్ లలో అన్ని సౌలతులు కల్పించామని చెప్పారు. న్యాక్ లో మంచి గ్రేడ్ వస్తే యూనివర్సిటీ మరింత అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రిజిస్ట్రార్ చెన్నప్ప, ఐక్యూఏసీ డైరెక్టర్ మధుసూదన్ రెడ్డి, రంగం భాస్కర్, పీఆర్వో రవికుమార్ పాల్గొన్నారు.