- అసంపూర్తిగా ఆగిపోయిన పనులు
స్టేషన్‌ఘన్‌పూర్, వెలుగు : గిరిజన తండాలు, కొత్తగా ఏర్పడిన గ్రామాల్లో పంచాయతీ భవన నిర్మాణ పనులు పూర్తి కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సకాలంలో బిల్లులు అందకపోవడంతో నిర్మాణ పనులు దక్కించుకున్న సర్పంచ్‌లు సతమతం అవుతున్నారు. 2017లో అప్పటి ప్రభుత్వం గిరిజన తండాలు, శివారు పల్లెలను గ్రామపంచాతీలుగా ఏర్పాటు చేసింది.
అప్పటి నుంచి గ్రామ పంచాయతీల కార్యకలాపాలన్నీ అద్దె భవనాల్లో, స్కూల్ బిల్డింగ్స్‌లో కొనసాగుతున్నాయి. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలంలోని అక్కపల్లిగూడెం, జిట్టెగూడెం తండా, నమిలిగొండ, రంగరాయగూడెం, చంద్రుతండాల్లో పక్కా బిల్డింగ్‌ల నిర్మాణానికి 2023 మార్చిలో నిధులు మంజూరు అయ్యాయి. ఎన్‌ఆర్‌ఈజీఎస్, ఐటీడీఏ స్కీమ్‌ల కింద ఒక్కో బిల్డింగ్ నిర్మాణానికి రూ. 20 లక్షల చొప్పున విడుదల అయ్యాయి.
దీంతో బిల్డింగ్‌ల నిర్మాణానికి అప్పటి ఎమ్మెల్యే రాజయ్య శంకుస్థాపన చేశారు. నామినేషన్ పద్ధతిలో సర్పంచ్‌లు, ఉప సర్పంచులు బిల్డింగ్ నిర్మాణ పనులను ప్రారంభించారు. కానీ సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. అక్కపల్లిగూడెంలో నర్సరీ పక్కన గ్రామపంచాయతీ బిల్డింగ్‌ను సర్పంచ్కడుదుల జ్యోతి నర్సిరెడ్డి నిర్మిస్తున్నారు.
ఇప్పటివరకు స్లాబ్ పూర్తి కాగా ఫ్లోరింగ్, కరెంట్ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇప్పటివరకు రూ.15 లక్షలకు పైగా ఖర్చు చేసినా ప్రభుత్వం రూపాయి కూడా విడుదల చేయలేదు. దీంతో అప్పులు తెచ్చి పనులు చేశామని, వాటిని వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే జిట్టెగూడెంతండాలో దుర్గమ్మ గుడి పక్కన గ్రామపంచాయతీ బిల్డింగ్ నిర్మించారు.
2023 డిసెంబర్‌లోనే పనులు పూర్తి కావడంతో ప్రస్తుతం బిల్డింగ్ ప్రారంభానికి సిద్ధంగా ఉంది. కానీ ఇప్పటివరకు ఒక్క రూపాయి బిల్లు కూడా రాలేదని, ఈ విషయంపై ఆఫీసర్లను అడిగితే ప్రభుత్వం నుంచి మంజూరు కావాల్సి ఉందని చెబుతున్నారని కాంట్రాక్టర్ వాపోయారు. చంద్రుతండాలో గ్రామపంచాయతీ బిల్డింగ్ నిర్మాణానికి అనువైన స్థలం దొరకకపోవడంతో పనులే ప్రారంభించలేదు. తండాలోని ప్రైమరీ స్కూల్ క్లాస్ రూంలో గ్రామపంచాయతీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
చెట్ల కిందే ప్రజాపాలన
అక్కపల్లిగూడెంలో గ్రామ పంచాయతీ బిల్డింగ్ అసంపూర్తిగా ఉండడంతో ఇటీవల చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమాన్ని ఆఫీసర్లు చెట్ల కిందే నిర్వహించారు. అలాగే చంద్రు తండాలో స్కూల్ బిల్డింగ్‌లో, జిట్టెగూడెంతండాలో ఆరు బయటే గ్రామసభ జరిపారు. ప్రభుత్వం స్పందించి సకాలంలో బిల్లులు మంజూరు చేయాలని ప్రజలు కోరుతున్నారు.