తెగని ఇందిరమ్మ కమిటీల పంచాయితీ!

 తెగని ఇందిరమ్మ కమిటీల పంచాయితీ!
  • భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో ఆఫీసర్లకు తలనొప్పిగా మెంబర్ల సెలెక్షన్

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : జిల్లాలో ఇందిరమ్మ కమిటీల పంచాయితీ ఇంకా తెగలేదు. ‘ఇందిరమ్మ కమిటీల్లో మేము చెప్పిన వాళ్ల పేర్లే ఉండాలి... లేకపోతే తర్వాత మీకు ఇబ్బంది తప్పదు’ అంటూ పలు పార్టీల నాయకులు ఆఫీసర్లపై ఒత్తిడి తెస్తున్నారు. ప్రధానంగా మున్సిపాలిటీల్లో ఈ సమస్య ఎక్కువగా ఉండడంతో మెంబర్ల సెలక్షన్​ ఆఫీసర్లకు తలనొప్పిగా మారింది. 

కమిటీలిలా.. 

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను ఎంపికను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక అంశంగా తీసుకుంది. లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు గ్రామపంచాయతీ, మండల కమిటీ, మున్సిపాలిటీల్లో వార్డు కమిటీలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఒక్కో కమిటీలో ఏడుగురు సభ్యులుంటారు. జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు, 481 గ్రామపంచాయతీలున్నాయి. ఈ క్రమంలో మున్సిపాలిటీల్లో వార్డు కౌన్సిలర్ చైర్మన్​గా, వార్డు ఆఫీసర్​గా, కన్వీనర్​గా,  ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో ఒక్కొక్కరు, మహిళా పొదుపు సంఘాల నుంచి ఇద్దరు చొప్పున కమిటీలో మెంబర్లుగా ఉంటారు.

అర్హులైన లబ్ధిదారుల ఎంపికలో ఈ కమిటీ కీలకంగా వ్యవహరిస్తోంది.  దీంతో ఈ కమిటీల్లో సభ్యులుగా తమ వాళ్లను ఉంచేందుకు అధికార పార్టీ నేతలతో పాటు పలు రాజకీయ పార్టీల నాయకులు ఆఫీసర్లపై ఒత్తిడి తెస్తున్నారు. 

మున్సిపాలిటీల్లో.. 

జిల్లా కేంద్రమైన కొత్తగూడెం మున్సిపాలిటీలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ఏర్పాటు చేయనున్న కమిటీలు కొలిక్కి రావడం లేదు. మున్సిపాలిటీల్లో కమిటీల్లో మెంబర్ల ఎంపిక ఆఫీసర్లకు కత్తిమీద సాములా మారింది. 

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు పేరు చెబుతూ వారి అనుచరులు ఆఫీసర్లపై ఒత్తిడి తెస్తున్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలో సీపీఐ నేతలు, కొన్ని ప్రాంతాల్లో బీఆర్ఎస్ నాయకులు తాము చెప్పిన వాళ్ల పేర్లను కమిటీల్లో ఉంచాలని పట్టుబడుతున్నారు. ఎవరు చెప్పిన మాట వినాలో ఆఫీసర్లకు అర్థం కాకపోవడంతో కమిటీల ఏర్పాటులో జాప్యం జరుగుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

గ్రామ పంచాయతీల్లో..

గ్రామపంచాయతీల్లో సర్పంచులు లేకపోవడంతో స్పెషల్ ఆఫీసర్ల పాలన కొనసాగుతోంది. దీంతో స్పెషల్ ఆఫీసర్ కు ఇందిరమ్మ ఇండ్ల కమిటీలో చోటు కల్పించారు. ఇద్దరు మహిళా సంఘాల సభ్యులు, బీసీ, ఎస్సీ, ఎస్టీల్లో ఒకరు, పంచాయతీ సెక్రటరీ ఈ కమిటీల్లో ఉండనున్నారు. ఇక్కడా కూడా ఆఫీసర్లపై పలు పార్టీల నేతల ఒత్తిడి ఉంది. 

జిల్లా ఇన్​చార్జ్ మంత్రికే వదిలేద్దాం.. 

నాయకులు ఇచ్చిన లిస్టుతోపాటు తాము  తయారు చేసిన ఇందిరమ్మ కమిటీల జాబితాలను జిల్లా ఇన్​చార్జ్ మంత్రి కొమిటిరెడ్డి వెంకటరెడ్డికి ఇవ్వాలని ఆఫీసర్లు భావిస్తున్నారు. కమిటీలను ఫైనల్ చేసేది జిల్లా ఇన్​చార్జ్ మంత్రే కావడంతో ఆయన తీసుకునే నిర్ణయం ప్రకారం తాము నడుచుకుంటామని ఆఫీసర్లు పేర్కొంటున్నారు.