శ్రీరాంపూర్​ మండలంలో పాండవుల గుట్టను  పొతం పెడుతుండ్రు

శ్రీరాంపూర్​ మండలంలో పాండవుల గుట్టను  పొతం పెడుతుండ్రు
  • యథేచ్ఛగా గుట్టును తవ్వి మొరం అమ్ముకుంటున్నరు 
  • గుట్టను ఆక్రమించి సాగు చేస్తున్నా పట్టించుకోని అధికారులు 
  • పాత రికార్డుల్లో 600 ఎకరాలుండగా.. ప్రస్తుతం 200 ఎకరాలే అంటున్న ఆఫీసర్లు

పెద్దపల్లి, వెలుగు:  పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్​ మండల కేంద్రంలోని పాండవులగుట్ట కబ్జాకు గురవుతుంది. 597 సర్వే నంబర్​ పాత రికార్డుల ప్రకారం దాదాపు 600 ఎకరాలు ఉండేది.  ఇటీవల రెవెన్యూ అధికారులు సర్వే చేసి సుమారు 200 ఎకరాలే ఉన్నట్లు గుర్తించారు. దీనిని బట్టి మిగిలిన భూమి, గుట్ట పరిసరాలు ఇప్పటికే కబ్జా అయినట్లు తెలుస్తోంది. గతంలో ఉన్న అధికారులతో స్థానిక లీడర్లు కుమ్మక్కై భూమిని కబ్జా చేసి సాగుచేసుకుంటున్నట్లు సమాచారం. కబ్జా అయిన భూములు ఒకవైపు సాగు అవుతుంటే, మరోవైపు అక్రమార్కులు గుట్టను యథేచ్ఛగా మొరం తరలిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు. 

సాగులో కబ్జా భూములు 

గుట్ట సమీపంలోని భూములను కబ్జా చేసి సాగు చేస్తున్నారు. 597 సర్వే నంబర్​ను ఆనుకొని ఉన్న భూ యజమానులు హద్దులు దాటి పక్కనే ఉన్న భూములను సాగు చేసుకుంటున్నారని చెప్తున్నారు. వాటిని తిరిగి స్వాధీనం చేసుకుంటామని చెబుతున్నా.. ఇప్పటిదాకా పట్టించుకోలేదు. గతంలో ఉన్న  ఓ తహసీల్దార్​ కబ్జాదారులతో కుమ్మక్కై ఈ భూములను పట్టాలు ఇచ్చాడు. పాత రికార్డుల ప్రకారం 600 ఎకరాలు ఉండాల్సి ఉండగా 200 ఎకరాలకు తగ్గిపోవడంతో ఆఫీసర్ల తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

గతంలో జరిగిన తప్పులు బయటకు రాకుండా ఉండటానికే అధికారులు కొత్త రికార్డుల ప్రకారం పాండవుల గుట్ట 597 సర్వే నంబర్​లో 200 ఎకరాలు మాత్రమే అని చూపే ప్రయత్నాలు చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపితే నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. మరోవైపు పాండవుల గుట్టను పబ్లిక్‌గానే తవ్వి మొరం అమ్ముకుంటున్నారు. ఇక్కడి మొరంను కొందరు అక్రమార్కులు ప్లాట్లను చదును చేయడానికి తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. 

ప్రభుత్వ అవసరాలకు పోను 500 ఎకరాలుండాలి
 
పాండవులగుట్టలో సుమారు 100 ఎకరాలను సర్కార్‌‌ వివిధ అవసరాలకు వినియోగించుకుంది. వైఎస్​ హయాంలో పేదలకు 30 ఎకరాలు కేటాయించారు. గౌడ సామాజిక వర్గానికి 5 ఎకరాలు, పోలీస్‌స్టేషన్​, విద్యుత్​ సబ్​స్టేషన్లకు కలిపి 10 ఎకరాలు, రిటైర్డ్​ ఆర్మీ జవానుకు 5 ఎకరాలు, వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయానికి 18 ఎకరాలు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత అదే పాండవుల గుట్ట సమీపంలో కస్తూర్బా పాఠశాలకు 5ఎకరాలు, డబుల్​బెడ్​రూం ఇళ్లకు 10, జూనియర్​ కాలేజీకి 6, వ్యవసాయమార్కెట్​కు 6, బీఎస్‌ఎన్‌ సంస్థకు 2 ఎకరాలు ఇచ్చారు. మిగిలిన భూమి దాదాపు 500 ఎకరాలు ఉండాలి. ఆఫీసర్లు మాత్రం 597 సర్వే నంబర్​లో 200 ఎకరాలుగానే చెప్తున్నారు. గుట్ట భూములు కబ్జా అవుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

అక్రమార్కులపై చర్యలు తీసుకుంటాం 

పాండవుల గుట్ట భూములపై వస్తున్న ఫిర్యాదులతో ఇటీవల సర్వే చేశాం. పూర్తి వివరాలు ఆర్డీవోకు అందజేశాం. గుట్ట భూములు ఎవరైనా ఎంక్రోచ్​ చేసినా, మొరం తరలించినా కఠిన చర్యలు తీసుకుంటాం.

జాహిద్​ పాషా, తహసీల్దార్​, కాల్వ శ్రీరాంపూర్​