వీధి రౌడీల్లా బీఆర్ఎస్ లీడర్లు: రామ్మోహన్ రెడ్డి

వీధి రౌడీల్లా బీఆర్ఎస్ లీడర్లు: రామ్మోహన్ రెడ్డి
  • వీధి రౌడీల్లా బీఆర్ఎస్ లీడర్లు: రామ్మోహన్ రెడ్డి

బీఆర్ఎస్  పార్టీ లీడర్లు వీధి రౌడీల్లా ప్రవర్తిస్తున్నారని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఎమ్మెల్యేలు మందుల సామేల్, మట్ట రాగమయిలతో కలిసి ఆయన మాట్లాడారు. కాంగ్రెస్  ప్రభుత్వం మీద కక్షకట్టి వెయ్యి మందిని సోషల్ మీడియాలో పెట్టుకొని తమ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. ఈ సంక్రాంతి నుంచి రైతు భరోసా ఇవ్వాలని చర్చ పెడితే సభను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. 

వెకిలి చేష్టలను గమనిస్తున్నరు: మందుల సామేల్

పదేండ్ల పాలనలో ప్రజాస్వామ్యాన్ని బీఆర్ఎస్  ఖూనీ చేసిందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్  అన్నారు. వారి వెకిలిచేష్టలు, అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. తన సోదరుడు సంపత్​ను గతంలో సస్పెండ్  చేశారని, ఇప్పుడు బీఆర్ఎస్  నేతలను ఎందుకు సస్పెండ్  చేయకూడదని   ప్రశ్నించారు. ఇలాగే ప్రవర్తిస్తే వారి సభ్యత్వం రద్దు చేయాలన్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే మట్ట రాగమయి మాట్లాడుతూ అధికారం కోల్పోయిన ఫ్రస్టేషన్​లో బీఆర్ఎస్​ లీడర్లు అల్లరి చిల్లరగా ప్రవర్తిస్తున్నారని, వారి చిల్లర చేష్టలపై చర్యలు తీసుకోవాలన్నారు.

శాసనసభ చరిత్రలో చీకటి రోజు: వేముల వీరేశం

శాసనసభ చరిత్రలో శుక్రవారం చీకటి రోజు అని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. బీఆర్ఎస్  నేతలు దళిత స్పీకర్ తో అమర్యాదగా ప్రవర్తించారని ఆయన మండిపడ్డారు. నరనరాన అహంకారం జీర్ణించుకున్నారని, వారి వికృతి చేష్టలు చూస్తుంటే తాగి వచ్చారా అన్న అనుమానం కలుగుతోందన్నారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్  వద్ద ఆయన మాట్లాడారు. కౌశిక్  రెడ్డి వ్యవహార శైలి దళిత వర్గాలను చిన్నచూపు చూసేలా ఉందన్నారు.

అందరినీ హరీశ్ రావు ఉసిగొల్పుతున్నడు: కవ్వంపల్లి

బీఆర్ఎస్  ఎమ్మెల్యే హరీశ్ రావు అందరినీ ఉసిగొల్పి దళిత స్పీకర్ తో చులకనగా  ప్రవర్తించేలా చేస్తున్నారని మానుకొండూరు ఎమ్మెల్యే  కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. బీఆర్ఎస్  నేతల సభ్యత్వం ఎందుకు రద్దుచేయకూడదో చెప్పాలన్నారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్  వద్ద ఆయన మాట్లాడారు. గతంలో దళితుడైన సంపత్ కుమార్ ను అకారణంగా డిస్మిస్  చేశారన్నారు. భూ భారతితో బీఆర్ఎస్  నేతల లెక్కలు తేటతెల్లమవుతాయని, అందుకే వారు పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు.

అట్రాసిటీ కేసు పెట్టాలి: అడ్లూరి

పదేండ్ల పాలనలో ధరణి పేరుతో మాజీ సీఎం కేసీఆర్  కుటుంబం ప్రజల నుంచి గుంజుకున్న భూముల బండారం బయట పడుతుందనే బీఆర్ఎస్​ లీడర్లు అల్లరి చేస్తున్నారని ధర్మిపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్  అన్నారు. స్పీకర్ తో అగౌరవంగా ప్రవర్తించినందుకు వారిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు. రైతుల నుంచి దోచుకున్న లెక్కలు బయట పడతాయని సభలో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారన్నారు.

మూసీకి లక్ష కోట్లు ఎందుకు?: వెంకటరమణారెడ్డి  

మూసీ ప్రక్షాళన మంచిదే, కానీ.. ఆ ప్రాజెక్టుకు రూ.లక్ష కోట్లు ఎందుకని కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి ప్రశ్నించారు.  ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్  బిల్లులు, పోలీసులకు రూ.550 కోట్ల పెండింగ్  బిల్లులు వెంటనే చెల్లించాలన్నారు. గతంలో రేవంత్ రెడ్డిని అరెస్టు చేస్తే తెలంగాణ ప్రజలకు వచ్చిన నష్టం లేదని, ఇప్పుడు కేటీఆర్  అరెస్టయితే వచ్చే నష్టమూ ఏమీ ఉండదన్నారు.