
పారిస్: తన కెరీర్‌లో అతి పెద్ద త్రో కోసం ఎదురుచూస్తున్నానని ఇండియా స్టార్ జావెలిన్ త్రోయర్, పారిస్ గేమ్స్ రజత విజేత నీరజ్ చోప్రా అన్నాడు. 90 మీటర్ల మార్క్‌ను నేరుగా ప్రస్తావించకపోయినా.. ఆ స్థాయి పెర్ఫామెన్స్ చేయాల్సి ఉందన్నాడు. 2022లో సాధించిన 89.94 మీటర్లే ఇప్పటి వరకు అతని కెరీర్ బెస్ట్‌గా ఉంది. దీన్ని అధిగమించేందుకు చాలాసార్లు ప్రయత్నించి ఫెయిలయ్యాడు. ‘2016 తర్వాత 2018 ఆసియా గేమ్స్‌లో నేను 88 మీటర్ల దూరం విసిరినప్పుడు నాలో ఇంకా సత్తా ఉందని భావించా. చాలా పెద్ద త్రోలు ఇంకా మిగిలే ఉన్నాయనుకున్నా. వాటిని అందుకునే వరకు నాకు ప్రశాంతత ఉండదు. ఏదో ఓ టైమ్‌లో కచ్చితంగా సాధిస్తా. భవిష్యత్ టోర్నీల కోసం నా మనసును సిద్ధంగా ఉంచుకుంటా. ఆ విషయాలపై దృష్టి పెడుతూనే ఫిట్‌గా ఉండేందుకు కృషి చేస్తా’ అని నీరజ్ పారిస్‌లో మీడియాతో పేర్కొన్నాడు.
రనప్‌తో ఇబ్బందిపడ్డా..
ఒలింపిక్స్ కోసమే తొడ కండరాల గాయానికి సర్జరీ చేయించుకోలేదని నీరజ్ వెల్లడించాడు. మెగా గేమ్స్‌లో కొన్నిసార్లు రనప్‌తో చాలా ఇబ్బందిపడ్డానని చెప్పాడు. సర్జరీపై నిర్ణయం తీసుకోవాని చోప్రా చెప్పుకొచ్చాడు. ఇక, ఇండియా, పాక్ మధ్యలాగా నదీమ్‌కు, తనకు ఉన్న మధ్య పోటీ గురించి వివరించమన్న ప్రశ్నకు తెలివిగా సమాధానం ఇచ్చాడు. ‘నిజంగా ఇది గొప్ప పోటీ. బహుశా చరిత్రలో ఉన్న గొప్ప పోటీల్లో ఇది ఒకటి. అర్షద్ చాలా బాగా విసిరాడు. నేను కూడా మంచి స్థితిలో ఉన్నా. కానీ ఈ రోజు నాది కాదు’ అని నీరజ్ వెల్లడించాడు.
నదీమ్ కూడా బిడ్డలాంటోడే..
నీరజ్ సిల్వర్ నెగ్గడంపై సంతోషం వ్యక్తం చేసిన అతని తల్లి సరోజ్ దేవి.. నదీమ్‌పై కూడా ప్రశంసలు కురిపించింది. ‘రజతం గెలిచినందుకు మేం సంతోషంగానే ఉన్నాం. గోల్డ్ నెగ్గిన నదీమ్ కూడా నా కొడుకులాంటి వాడే. అందరూ అథ్లెట్లే. పతకం చాలా కఠినంగా శ్రమిస్తారు. నీరజ్, నదీమ్‌లో పెద్ద తేడాలేదు’ అని చెప్పింది.
చందాలతో జావెలిన్ కొని..
ఒలింపిక్స్ జావెలిన్ త్రోలో గోల్డ్ నెగ్గిన అర్షద్ నదీమ్ చరిత్ర ఓ సినిమాకు ఏమాత్రం తీసిపోదు. ఏడాదిలో ఒకే ఒక్కసారి నాన్ వెజ్ వండుకునేంత పేదరికంలో నుంచి వచ్చిన అతను విశ్వక్రీడల వేదికపై పాక్ పతాకాన్ని సగర్వంగా ఎగరవేశాడు. అతను సాధించిన విజయానికి పంజాబ్ ప్రావిన్స్ సీఎం మర్యామ్ నవాజ్ రూ. 10 కోట్ల ప్రైజ్‌మనీ ప్రకటించాడు. ఓ దశలో క్రికెటర్ అవుదామనుకుని ప్రయత్నించి ఫెయిలైన నదీమ్ జావెలిన్‌పై దృష్టి పెట్టినా.. సామాగ్రిని సమకూర్చుకోలేని దుస్థితి. దీంతో తన గ్రామస్తులందరూ చందాలు వేసుకుని అతనికి శిక్షణ, అవసరమైన సామాగ్రి ఇప్పించారు. గేమ్స్‌కు రావడానికి నాలుగు నెలల ముందు కొత్త జావెలిన్‌ను కొనడానికి క్రౌడ్ ఫండింగ్‌ను ఆశ్రయించాడంటే అతని పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అలా ఒక్కో గండాన్ని దాటి ఇప్పుడు పారిస్ గడ్డపై పాక్ చరిత్రను ఇనుమడింప చేశాడు. ప్రస్తుతం అతనిపై ప్రశంసలు, రివార్డుల వర్షం కురుస్తోంది.