బుల్లెట్‌‌‌‌ దిగేనా! ఇండియా​ షూటర్లపై భారీ అంచనాలు

బుల్లెట్‌‌‌‌ దిగేనా!  ఇండియా​ షూటర్లపై భారీ అంచనాలు
  • ఈసారి 21 మందితో బరిలోకి
  • హైదరాబాదీ ఇషా సింగ్​పై ఆశలు
  • మరో 6 రోజుల్లో పారిస్‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌

ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌లో ఇండియా షూటింగ్‌‌‌‌‌‌‌‌కు 72 ఏండ్ల చరిత్ర ఉంది. కానీ గెలిచిన పతకాల సంఖ్య మాత్రం నాలుగే..!   2004 నుంచి వరుసగా మూడు ఎడిషన్లలో మెప్పించిన మన షూటర్లు రియో, టోక్యో ఒలింపిక్స్‌‌లో పతకానికి గురి పెట్టలేకపోయారు. పారిస్‌లో 21 మంది  12 మెడల్ ఈవెంట్లలో బరిలో నిలిచారు. ఈ సారైనా మన షూటర్ల బుల్లెట్లు పతకాలు తెస్తాయా? 

వెలుగు స్పోర్ట్స్‌‌‌‌ డెస్క్‌‌‌‌

ఒకప్పుడు మహారాజుల వేటగా మొదలైన షూటింగ్​ క్రమంగా ఒలింపిక్స్ గేమ్‌‌‌‌గా మారిపోయింది. ఆనాటి బికనీర్‌‌‌‌ మహారాజు కర్నీ సింగ్‌‌‌‌ మొట్టమొదటిసారిగా ఇండియా తరఫున షూటింగ్‌‌‌‌కు బీజం వేశాడు. కానీ దశాబ్దాలు గడిచినా ఇందులో పెద్దగా పేరు వచ్చిన దాఖలాలైతే లేవు. అయితే 2004 ఏథెన్స్‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌లో రాజ్యవర్ధన్‌‌‌‌ సింగ్‌‌‌‌ రాథోడ్​ డబుల్‌‌‌‌ ట్రాప్‌‌‌‌లో  సిల్వర్ ​మెడల్ ​నెగ్గడంతో దేశంలో షూటింగ్‌‌‌‌ హవా  మొదలైంది. ఆ తర్వాత 2008 బీజింగ్​ ఒలింపిక్స్‌‌‌‌లో ఎవరూ ఊహించని రీతిలో అభినవ్​ బింద్రా ఏకంగా గోల్డ్‌‌‌‌ మెడల్‌‌‌‌ గెలిచి వరల్డ్‌‌‌‌ షూటింగ్‌‌‌‌ను ఆశ్చర్యపరిచాడు. 

పెద్దగా అంచనాల్లేకుండానే బరిలోకి దిగిన అతను మెన్స్‌‌‌‌10 మీటర్ల ఎయిర్​ రైఫిల్‌‌‌‌లో అద్భుతం చేశాడు. ఇక 2012 లండన్‌‌‌‌ మెగా గేమ్స్‌‌‌‌లో హైదరాబాదీ గగన్ నారంగ్‌‌‌‌ మెన్స్‌‌‌‌ 10 మీటర్ల ఎయిర్‌‌‌‌ రైఫిల్‌‌‌‌లో బ్రాంజ్‌‌‌‌ గెలిస్తే, విజయ్‌‌‌‌ కుమార్‌‌‌‌ మెన్స్‌‌‌‌ 25 మీటర్ల ర్యాపిడ్‌‌‌‌ ఫైర్‌‌‌‌ పిస్టల్‌‌‌‌లో సిల్వర్‌‌‌‌ మెడల్‌‌‌‌తో డబుల్‌‌‌‌ జోష్‌‌‌‌ నింపాడు. ఈ రెండు విజయాలతో ఇండియాలో షూటింగ్‌‌‌‌ ఒక్కసారిగా ఊపందుకుంది. అయితే భారీ అంచనాలతో పెద్ద బలగంతో 2016 రియో, 2020 టోక్యో ఒలింపిక్స్‌‌‌‌లో బరిలోకి దిగిన ఇండియన్‌‌‌‌ షూటర్లు ఘోరంగా నిరాశపర్చారు. ఒక్కరు కూడా పతకం సాధించలేకపోయారు.  

మనుపై ఆశలు..

పారిస్‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌లో ఇండియా నుంచి 21 మంది షూటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇందులో ఎక్కువగా మను భాకర్ పై అంచనాలు, ఆశలు ఉన్నాయి. టోక్యోలో నిరాశపర్చిన ఆమె ఈసారి కచ్చితంగా మెడల్‌‌‌‌ గెలుస్తుందని అంచనా వేస్తున్నారు. 10 మీ. ఎయిర్‌‌‌‌ పిస్టల్‌‌‌‌, 25 మీ. ఎయిర్‌‌‌‌ పిస్టల్‌‌‌‌లో ఆమె బరిలోకి దిగుతున్నారు.

 ఈ ఏడాది సూపర్‌‌‌‌ ఫామ్‌‌‌‌లో ఉన్న మను వరల్డ్‌‌‌‌ వైడ్‌‌‌‌గా జరిగిన ప్రతి ఈవెంట్‌‌‌‌లో మెడల్‌‌‌‌ గెలిచింది. ఇక గత ఒలింపిక్స్‌‌‌‌ అనుభవం కలిగిన ఎలవెనిల్‌‌‌‌ వలారివన్ (10 మీ. ఎయిర్‌‌‌‌ రైఫిల్‌‌‌‌), అంజుమ్‌‌‌‌ మౌద్గిల్‌‌‌‌ (50 మీ. రైఫిల్‌‌‌‌ త్రీ పొజిషన్‌‌‌‌), ఐశ్వరీ ప్రతాప్‌‌‌‌ సింగ్‌‌‌‌ తోమర్‌‌‌‌ (50 మీ. రైఫిల్‌‌‌‌ త్రీ పొజిషన్‌‌‌‌)పై కూడా అంచనాలున్నాయి. వీళ్ల నుంచి కూడా పతకాలను ఆశిస్తున్నారు. కాకపోతే వీళ్లలో నిలకడలేమి ప్రతికూలాంశం. 

మన ఇషా మెప్పిస్తుందా?

ఈసారి కొత్తగా 17 మంది షూటర్లు మెగా గేమ్స్‌‌‌‌లో బరిలోకి దిగుతున్నారు. ఇందులో తెలంగాణ స్టార్‌‌‌‌ షూటర్‌‌‌‌ ఇషా సింగ్‌‌‌‌ (25 మీ. పిస్టల్‌‌‌‌) కూడా ఉంది. అవకాశం, అదృష్టం కలిసొస్తే కచ్చితంగా అద్భుతం చేసే సత్తా ఇషాకు ఉంది. ఇటీవల వరల్డ్‌‌‌‌ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌, ఆసియా గేమ్స్‌‌‌‌లో తెలంగాణ షూటర్‌‌‌‌ గోల్డ్ మెడల్స్ సాధించి మంచి ఫామ్‌‌‌‌లో ఉంది. 

ఇక 23 ఏండ్ల పంజాబ్‌‌‌‌ షూటర్‌‌‌‌ సిఫ్ట్‌‌‌‌ కౌర్‌‌‌‌ సమ్రా.. 2022 ఆసియా గేమ్స్‌‌‌‌లో వరల్డ్‌‌‌‌ రికార్డుతో గోల్డ్‌‌‌‌ గెలిచింది. అదే ఫామ్‌‌‌‌ను కొనసాగిస్తే ఈమె నుంచి కూడా మెడల్‌‌‌‌ను ఆశించొచ్చు. కొత్త వాళ్లలో సందీప్‌‌‌‌ సింగ్, అర్జున్‌‌‌‌ బబూటా, సరబ్‌‌‌‌జోత్‌‌‌‌, అర్జున్‌‌‌‌ సింగ్‌‌‌‌, స్వప్నిల్‌‌‌‌ కుశాలె, అనీశ్‌‌‌‌ భన్వాలా, విజయ్‌‌‌‌వీర్‌‌‌‌, పృథ్వీ రాజ్‌‌‌‌, అనంత్‌‌‌‌జీత్‌‌‌‌ సింగ్‌‌‌‌, రమిత జిందాల్‌‌‌‌, రిథమ్‌‌‌‌ సంగ్వాన్‌‌‌‌, శ్రేయాసి సింగ్‌‌‌‌, రైజా థిల్లాన్‌‌‌‌ ఎంతవరకు వెళ్తారో చూడాలి.