- మణిపూర్ హింసపై చర్చకూ పట్టు.. అపొజిషన్ ఆందోళనలతో గందరగోళం
- తొలిరోజు ప్రారంభమైన వెంటనే ఉభయసభలు వాయిదా
న్యూఢిల్లీ: పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై అమెరికాలోని న్యూయార్క్ కోర్టులో నమోదైన క్రిమినల్ కేసు, మణిపూర్‌లో హింస వ్యవహారంపై చర్చించాలంటూ అటు లోక్‌సభ, ఇటు రాజ్యసభలో అపొజిషన్ పార్టీల ఎంపీలు పట్టుబట్టారు. దీంతో ఉభయ సభల్లో గందరగోళం ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేశారు. చివరికి ఉభయ సభలు తొలిరోజు ప్రారంభమైన గంట సేపటికే బుధవారానికి వాయిదాపడ్డాయి. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన తర్వాత.. మహారాష్ట్రలోని నాందేడ్ ఎంపీ వసంత్ రావు బల్వంత్ రావు చవాన్, వెస్ట్‌బెంగాల్‌లోని బసిర్హత్ ఎంపీ ఎస్కే నురుల్ ఇస్లామ్ మృతికి సంతాపం తెలిపారు. అదేవిధంగా, ఇటీవల తుదిశ్వాస విడిచిన మాజీ ఎంపీలు ఎంఎం లారెన్స్ (కేరళ), ఎం.పార్వతి (ఆంధ్రప్రదేశ్), హరీశ్చంద్ర దేవరామ్ చవాన్(మహారాష్ట్ర)కు నివాళులర్పించారు. ఆ తర్వాత ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంట్ కమిటీ (జేపీసీ) వేయాలంటూ కాంగ్రెస్ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఇండియాలో వ్యాపార రంగంపై ఆ గ్రూప్ ప్రభావం, ప్రభుత్వ నియంత్రణపై చర్చించాలని డిమాండ్ చేసింది.గౌతమ్ అదానీని కాపాడేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది.
లోక్‌సభ వెల్‌లోకి దూసుకెళ్లిన సభ్యులు
ఏడాదిన్నర నుంచి మణిపూర్‌లో అల్లర్లు కొనసాగుతున్నా ప్రధానమంత్రి మోదీ పట్టించుకోవడం లేదని లోక్‌సభలో అపోజిషన్ పార్టీల ఎంపీలు మండిపడ్డారు. ఇప్పటి వరకు మణిపూర్ బాధితులను పరామర్శించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. యూపీ మసీదు అల్లర్లపై కూడా చర్చించాలని డిమాండ్ చేశారు. అదానీ కేసు వ్యవహారంపై జేపీసీ వేయాల్సిందే అని పట్టుబట్టారు. దేశ సంపద మొత్తాన్ని మోదీ ప్రభుత్వం తన కార్పొరేట్ ఫ్రెండ్స్‌కు దోచిపెడ్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీతో పాటు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చర్చకు సహకరించాలని, ఆందోళనలు చేపట్టొద్దని సభ్యులను స్పీకర్ ఓం బిర్లా కోరారు. అయినప్పటికీ ఎంపీలు వినిపించుకోలేదు. వెల్‌లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో సభ ప్రారంభమైన వెంటనే 15 నిమిషాల పాటు వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. మళ్లీ సభ ప్రారంభమైన తర్వాత సభ్యులు ఆందోళనలు కొనసాగించారు. అదానీ వ్యవహారంపై చర్చించాల్సిందే అని పట్టుబట్టారు. సభలో ఎవరి పేర్లు ప్రత్యేకంగా ప్రస్తావించొద్దని ఎంపీలను స్పీకర్ కోరారు. రాజ్యాంగ సంప్రదాయాన్ని పాటించాలన్నారు. అయినప్పటికీ.. గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో సభను మళ్లీ 12 గంటలకు వాయిదా వేశారు. ఆ తర్వాత తిరిగి సభ ప్రారంభమైనప్పటికీ ప్రతిపక్షాల రగడ కొనసాగడంతో సభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.
రాజ్యసభలోనూ గందరగోళం
న్యూయార్క్‌లో అదానీపై కేసు నమోదు, మణిపూర్ లో హింస, యూపీ మసీదు అల్లర్లపై రాజ్యసభలోనూ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. అపోజిషన్ పార్టీల ఎంపీల ఆందోళనతో రాజ్యసభ కార్యకలాపాలకు కొద్దిసేపు అంతరాయం ఏర్పడింది. సభ్యులు శాంతించాలని చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ ఎంత రిక్వెస్ట్ చేసినా సభ్యులు పట్టించుకోలేదు. దీంతో సభను చైర్మన్ 11.45 గంటలకు వాయిదా వేశారు. ఆ తర్వాత తిరిగి సభ ప్రారంభమైంది. ఖర్గే సహా పలువురు అపోజిషన్ పార్టీ సభ్యులు అదానీ వ్యవహారంపై పార్లమెంట్ ఉభయ సభల్లో వాయిదా నోటీసులిచ్చారు. శాంతియుతంగా చర్చలు కొనసాగించాలని చైర్మన్ ప్రతిపక్షాలను కోరారు. అయినప్పటికీ అదానీ కేసుపై చర్చ కోసం అపోజిషన్ పార్టీ సభ్యులు పట్టుబట్టడంతో చివరికి రాజ్యసభను చైర్మన్ బుధవారానికి వాయిదా వేశారు. కాగా, ఈ సమావేశాల్లో పార్లమెంట్ ముందుకు మొత్తం 16 బిల్లులు రానున్నాయి. మంగళవారం రాజ్యాంగ దినోత్సవం కావడంతో ఉభయ సభలు బుధవారానికి వాయిదా పడ్డాయి.
సమావేశాలకు ముందు ప్రతిపక్షాల భేటీ
ఉభయ సభలు ప్రారంభానికి ముందే అపోజిషన్ పార్టీల నేతలు కాంగ్రెస్ ప్రెసిడెంట్ పార్లమెంట్ హౌస్ ఆఫీస్‌లో సమావేశం అయ్యారు. సభ వ్యూహాలపై చర్చించారు. అదానీ వ్యవహారంపై జేపీసీకి డిమాండ్ చేయాలని నిర్ణయించారు. మంగళవారం జరిగే రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో మాట్లాడేందుకు ఉభయ సభల్లోని ప్రతిపక్ష నేతలకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ స్పీకర్‌కు లేఖ రాసేందుకు నేతలు నిర్ణయించారు. ప్రధాని మాట్లాడుతుంటే.. ప్రతిపక్ష నేతలకు ఎందుకు చాన్స్ ఇవ్వరని లేఖలో ప్రస్తావించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
వక్ఫ్ బిల్లుపై జేపీసీ పదవీ కాలం పెంచండి
వక్ఫ్ (సవరణ) బిల్లు, 2024పై ఏర్పాటు చేసిన జేపీసీ పదవీ కాలాన్ని పొడిగించాలని లోక్ స్పీకర్ ఓం బిర్లాకు ప్రతిపక్ష ఎంపీలు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బిర్లాకు సోమవారం లేఖ రాశారు. నివేదిక రూపొందించేందుకు 3 నెలల టైమ్ సరిపోదని తెలిపారు. సరైన సిఫార్సులు కూడా చేయలేకపోవచ్చునని వివరించారు. 30 మంది ఎంపీల సంతకాలతో కూడిన లేఖను బిర్లాకు పంపారు. అదేవిధంగా, ప్యానెల్ చైర్మన్ జగదాంబికా పాల్‌పై స్పీకర్ ఓం బిర్లాకు సభ్యులు ఫిర్యాదు చేశారు.
ట్యాబ్, డిజిటల్ పెన్‌తో ఎంపీల అటెండెన్స్
శీతాకాల సమావేశాలకు హాజరయ్యే సభ్యులు ఎలక్ట్రానిక్ ట్యాబ్‌లో డిజిటల్ పెన్ ఉపయోగించి అటెండెన్స్ వేసుకోవచ్చు. పార్లమెంట్‌ను పేపర్‌లెస్‌గా మార్చేందుకు ఈ పద్ధతిని అమలు చేస్తున్నారు. లోక్‌సభ చాంబర్ లాబీలోని నాలుగు కౌంటర్లలో ఎలక్ట్రానిక్ ట్యాబ్‌లు ఉంచారు. ఫిజికల్ హాజరు రిజిస్టర్లు కూడా కౌంటర్లలో అందుబాటులో ఉంటాయి. అయితే సభ్యులు ట్యాబ్‌లో అటెండెన్స్ వేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలని లోక్‌సభ సెక్రటరీ కోరారు. పార్లమెంట్‌ను పేపర్‌లెస్‌గా మార్చడానికి సహాయపడాలన్నారు. ఎంపీలు ముందుగా ట్యాబ్‌లోని డ్రాప్-డౌన్ మెనూలో తమ పేర్లను సెలక్ట్ చేసుకోవాలి. డిజిటల్ పెన్ సాయంతో సంతకం చేయాలి. తర్వాత సబ్మిట్ బటన్‌పై నొక్కాలి. దీంతో అటెండెన్స్ రిజిస్టర్ అవుతుంది.