తెలుగు రాష్ట్రాల్లో గిరిజన వర్సిటీల ఏర్పాటు బాధ్యత కేంద్రానిదే

  • పార్లమెంటులో తెలుగు ఎంపీల ప్రశ్నలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమాధానం
  • తెలంగాణలో యూనివర్సిటీ ఏర్పాటు పనులు పురోగతిలో ఉన్నాయి
  • ఏపీలో యూనివర్సిటీ ఏర్పాటు స్థలంపై ప్రభుత్వం నుంచి సూచన అందింది

ఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో గిరిజన యూనివర్సిటీల ఏర్పాటుకు కేంద్రం కట్టుబడి ఉందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పార్లమెంటు సాక్షిగా స్పష్టం చేశారు. పార్లమెంటులో తెలుగు రాష్ట్రాల ఎంపీలు సెంట్రల్ యూనివర్సిటీస్ (సవరణ) బిల్లుపై ప్రస్తావించి వేసిన ప్రశ్నలకు వెంటనే బదులిచ్చారు కేంద్ర విద్యా శాఖ మంత్రి. తెలంగాణలో విభజన చట్టం ప్రకారం గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు పనులు పురోగతిలో ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యతతో విశ్వవిద్యాలయాన్ని నిర్మిస్తుందని తెలిపారు. 
అలాగే రిజర్వేషన్ల అమలు విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని ఆయన వివరించారు. ఇన్నేళ్ల పాటు కేంద్ర ఉన్నత విద్యా సంస్థల్లో ఓబీసీ, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (EWS) రిజర్వేషన్లు అమలు కాలేదని ఆయన గుర్తు చేస్తూ.. మా ప్రభుత్వం ఈ రిజర్వేషన్లను అమలు చేస్తోందని తెలిపారు. సామాజిక న్యాయం అమలుకు కట్టుబడి ఉన్నామని, రిజర్వేషన్ల విషయంలో ఎలాంటి రాజీ లేదని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్పష్టం చేశారు. 
ఏపీ యూనివర్సిటీపై ప్రభుత్వం నుంచి సూచన అందింది
ఆంధ్రప్రదేశ్ లో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసే స్థలం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక సూచన అందిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి వెల్లడించారు. తనకు ఆప్తమిత్రుడైన ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ విషయంపై లేఖ రాశారని ఆయన తెలిపారు. ఏపీలో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసే ప్రాంతం ఒడిశా రాష్ట్రానికి సమీపంలో ఉందని, తద్వారా ఒడిసా రాష్ట్రంలోని గిరిజన విద్యార్థులకు సైతం ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే యూనివర్సిటీ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని సమకూర్చాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. రోడ్లు, విద్యుత్తు సదుపాయాలు కల్పించమని ముఖ్యమంత్రి అన్నారు, ఈ హామీని కూడా కేంద్రం పూర్తి చేస్తుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.