నిర్మల్ జిల్లా : బాసర జ్ఞానసరస్వతి అమ్మవారిని రాష్ట్ర ఎన్నికల కమీషనర్ పార్థసారథి కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి సన్నిధిలో తన మనమరాలికి అక్షరాభ్యాసం, తన పేరున కుంకుమార్చన చేయించారు. అనంతరం ఆలయ కమిటీ ఆయనను శాలువతో సన్మానించింది. తర్వాత అలయ అధికారులు అమ్మవారి ప్రసాదాలను వారికి అందజేశారు.
మరోవైపు బాసరలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆలయ అర్చకులు, వేదపండితులు అమ్మవారికి అభిషేకం, పుష్పార్చన, కుంకుమార్చన, విశేష పూజలను నిర్వహించారు. భారీ సంఖ్యలో ఆలయానికి చేరుకుంటున్న భక్తులు గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. నది ఒడ్డున ఉన్న శివాలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. దాంతోపాటు ఆలయంలో చిన్నారులకు అక్షరాభ్యాసం, కుంకుమార్చన పూజలు జరుగుతున్నాయి. భక్తుల రద్దీ అధికం కావడంతో అమ్మవారి దర్శనం కోసం ఎక్కువ టైం క్యూలైన్లలో వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.