పవన్​ వ్యాఖ్యలు సరికాదు : అద్దంకి దయాకర్​

పవన్​ వ్యాఖ్యలు సరికాదు : అద్దంకి దయాకర్​
  • దేశం విడిచి వెళ్లాలనడం ఏంది?
  • ఏపీ డిప్యూటీ సీఎంపై అద్దంకి దయాకర్​ ఫైర్
  • అంబేద్కర్​ను అమిత్ షా అవమానించినపుడు ఎందుకు మాట్లాడలేదని నిలదీత

మహబూబాబాద్, వెలుగు: కాంగ్రెస్  నాయకులు దేశం విడిచి వెళ్లిపోవాలని ఏపీ డిప్యూటీ సీఎం పవ న్  కల్యాణ్  వ్యాఖ్యానించడం, తనపైనా విమర్శలు చేయడం సరికాదని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు, కాంగ్రెస్​ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్​  అన్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా అవమానిస్తూ మాట్లాడినప్పుడు పవన్  కల్యాణ్  ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన రాజ్యాంగ పరిరక్ష ణ సదస్సులో అద్దంకి మాట్లాడారు.  

దేశంలో సెక్యులరిజానికి సంబంధించి గతంలో తాను చేసిన వ్యాఖ్యల ఆధారంగా తనను పాకిస్తాన్  అభిమానిగా చిత్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక్కడ పుట్టిన వారందరికీ రాజ్యాంగం ప్రకారం సమాన హక్కులు ఉన్నాయన్నారు. హిందువుల సంస్కృతి సంప్రదాయాలను కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా గౌరవిస్తుందన్నారు. ప్రజాప్రతినిధిగా తాను ప్రజా సంఘాలు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పిల్లి సుధాకర్, జిల్లా అధ్యక్షుడు చిట్టి మల్ల మహేశ్​ తదితరులు పాల్గొన్నారు