
అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈనెల 21వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు స్వర్ణాంధ్ర ఇంజినీరింగ్ కాలేజీ మైదానంలో సభ జరగనుంది. ప్రపంచ మత్స్య దినోత్సవం రోజున జరగనున్న ఈ బహిరంగ సభలో పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. గతంలో శ్రీకాకుళం జిల్లా కపాసుకుర్ది తీరంలో గంగపూజ చేసి మత్స్యకారుల అభివృద్ధిని కోరుతూ పోరాట యాత్రకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.
ఈ నేపధ్యంలో నరసాపురంలో జరగనున్న బహిరంగ సమావేశం వేదిక నుంచి రాష్ట్రంలో మత్స్యకారులు ఎదుర్కొంటున్న సమస్యలు, వీరి జీవనోపాధికి విఘాతం కలిగించే వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలను ప్రస్తావించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే పలు కీలక సమస్యలను జనసేన పార్టీ శ్రేణులు పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకువచ్చారు. వీటన్నింటిపై చర్చించి పవన్ కళ్యాణ్ తన ప్రసంగంలో ప్రస్తావించి కార్యాచరణ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి.