హైదరాబాద్, వెలుగు: జనసేన చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తొలిసారిగా సెక్రటేరియెట్ కు వెళ్లారు. భారీ ర్యాలీతో సెక్రటేరియట్ కు చేరుకున్న పవన్‌కు టీడీపీ, జననేత నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడ జనసేన మంత్రులతో ఆయన భేటీ అయ్యారు. మంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత పవన్ మంగళవారం విజయవాడ వచ్చారు. తనకు క్యాంప్ ఆఫీస్‌గా కేటాయించిన ఇరిగేషన్ గెస్ట్ హౌస్ దగ్గర పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. తన మిత్రుడు, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో కలిసి క్యాంప్ ఆఫీసును ఆయన పరిశీలించారు. అనంతరం భారీ ర్యాలీతో సెక్రటేరియట్‌కు బయలుదేరిన పవన్‌కు అభిమానులు, టీడీపీ, జనసేన నేతలు కార్యకర్తలు దారిపొడవునా ఘన స్వాగతం పలికారు. సెక్రటేరియెట్ వెళ్లే సీడ్ యాక్సెస్ దారిలో అమరావతి రాజధాని రైతులు పూలవర్షం కురిపించారు. ఆయనకు గజమాలతో పాటు నాగలి బహుకరించారు.
చంద్రబాబుతో సమావేశం
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలిసారి సెక్రటేరియెట్ చేరుకున్న పవన్ కల్యాణ్ మొదటి ఫ్లోర్ లో సీఎం చంద్రబాబు చాంబర్ లో ఆయనతో గంటన్నర పాటు భేటీ అయ్యారు. పలు అంశాలపై ఆ ఇద్దరూ చర్చలు జరిపారు. తరువాత జనసేన మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ కూడా సీఎంతో భేటీ అయ్యారు.