హైదరాబాద్ సిటీ, వెలుగు: కెమికల్వ్యర్థాలను తెచ్చి మూసీ నదిలో పోస్తున్న రుద్రా టెక్నాలజీస్ కంపెనీని పీసీబీ అధికారులు మంగళవారం సీజ్చేశారు. గత నెల 26న అర్ధరాత్రి ఓ ట్యాంకర్లో వ్యర్థాలను తెచ్చి మూసీలో కలుపుతుండగా లంగర్ హౌస్ వాసులు చూశారు. రాజేంద్రనగర్ ఎస్‌హెచ్‌ఓకు ఫిర్యాదు చేశారు. తర్వాత పీసీబీ అధికారులు వ్యర్థాలు పారబోసిన స్థలాన్ని పరిశీలించారు. బాపు ఘాట్ బ్రిడ్జి సమీపంలో పైప్‌లైన్ ఏర్పాటు చేసి నదిలోకి కెమికల్వ్యర్థాలను వదులుతున్నట్టు గుర్తించారు. ఆ ప్రాంతంలోని నీరు, మట్టి నమూనాలు సేకరించారు.
దర్యాప్తులో వ్యర్థాలను పారబోస్తున్నది పటాన్‌చెరు ప్రాంతంలోని రుద్రా టెక్నాలజీస్ కంపెనీ అని గుర్తించారు. దీంతో మంగళవారం సదరు కంపెనీపై చర్యలు తీసుకున్నారు. గతంలో వికారాబాద్ జిల్లా తాండూరు కరణ్ కోట్ లో ఇదే కంపెనీకి చెందిన రాఘవేంద్ర కెమికల్స్ పరిశ్రమ జిప్సం తయారీలో వాడిన యాసిడ్స్ ఉపయోగించడం, అటవీ ప్రాంతంలోకి వదలడంతో అధికారులు మూసివేశారు. అయినా యాజమాన్యం తీరులో మార్పు రాలేదు.