
- సీఎంతో రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి, పీసీసీ చీఫ్ మహేశ్భేటీ
హైదరాబాద్, వెలుగు: ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికకు పీసీసీ కసరత్తు మొదలెట్టింది. ఇందుకోసం విధి విధానాల రూపకల్పనపై దృష్టిపెట్టింది. ఈ మేరకు బుధవారం హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్మహేశ్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. ఎమ్మెల్యే కోటాలో 4 ఎమ్మెల్సీలకు కనీసం 40 మంది వరకు సీనియర్ నేతలు పోటీ పడుతుండడంతో పీసీసీ నాయకత్వానికి ఇది పరీక్షగా నిలిచింది.
నలుగురిని ఎంపిక చేసేందుకు ఎలాంటి పారదర్శకమైన విధానాన్ని రూపొందించాలనే దానిపై ఈ భేటీలో చర్చించినట్టు తెలిసింది. పదవులు దక్కనివారికి ప్రత్యామ్నాయంగా మరే ఇతర పదవి ఇవ్వాలనే దానిపై చర్చించారు. ఇలా 40 మందిలో 36 మందికి ప్రత్యామ్నాయాలు చూపిన తర్వాతనే నలుగురిని ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఖరారు చేయాలనే నిర్ణయానికి నేతలు వచ్చారు. లోకల్ బాడీ, కార్పొరేషన్ చైర్మన్, పార్టీ పదవుల్లో ఈ 36 మందికి అవకాశాలు కల్పిస్తామనే హామీ ఇచ్చి.. వారి నుంచి ఎలాంటి వ్యతిరేకత రాకుండా బుజ్జగింపు చర్యలు చేపట్టిన తర్వాతనే ఎమ్మెల్సీ అభ్యర్థులను ఖరారు చేయనున్నట్టు సమాచారం.
విధి విధానాలు ఇవే!
గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన వారికి, ప్రస్తుతం కార్పొరేషన్ చైర్మన్లుగా ఉన్న వారికి, ప్రభుత్వ సలహాదారులుగా ఉన్న నేతలకు ఎమ్మెల్సీగా చాన్స్ఇవ్వొద్దని ఈ భేటీలో నేతలు నిర్ణయించినట్టు తెలిసింది. మంత్రి మండలిలో ప్రాతినిథ్యం లేని సామాజిక వర్గాలకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. దీనిపై మరోసారి చర్చించి పేర్లను ఫైనల్ చేసి, హైకమాండ్ కు పంపించాలని డిసైడ్ అయ్యారు. గురువారం దీనిపై మరోసారి భేటీ అయ్యే అవకాశం ఉందని సమాచారం.