- మనువాదాన్ని అమలు చేయాలని చూస్తున్నది: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
- ఇందిరమ్మను సంజయ్ అవమానించారని ఫైర్
- గాంధీ భవన్లో ఘనంగా గణతంత్ర వేడుకలు
హైదరాబాద్, వెలుగు: రాజ్యాంగాన్ని మార్చేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ కుట్ర చేస్తున్నదని పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. రాజ్యాంగాన్ని మార్చి మనువాద సిద్ధాంతాన్ని అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నదని మండిపడ్డారు. ఆదివారం గాంధీభవన్లో రిపబ్లిక్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, మాట్లాడారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్ సాక్షిగా అంబేద్కర్ ను అవమానించారని మండిపడ్డారు.
ఇది దేశానికి జరిగిన అవమానమని అన్నారు. ‘‘ఇందిరమ్మను కేంద్ర మంత్రి బండి సంజయ్ అవమానించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన త్యాగశీలి ఇందిరమ్మ. మీరు (సంజయ్) దేశం కోసం ఏం త్యాగం చేశారు?” అని ప్రశ్నించారు. ‘‘బీఆర్ఎస్ పదేండ్లలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు. ఒక్క ఇల్లు కట్టలేదు. మా ప్రభుత్వం ఏడాదిలోనే అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా అమలు చేస్తున్నం” అని చెప్పారు. ‘‘కాంగ్రెస్ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన ఉంటుంది. అందుకే జై గాంధీ, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని చేపట్టింది. మా ప్రభుత్వానికి ప్రజలు మద్దతు ప్రకటించాలి” అని కోరారు.
జై సంవిధాన్ ర్యాలీ..
సేవాదల్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన జై సంవిధాన్ ర్యాలీని మహేశ్ గౌడ్ ప్రారంభించారు. ఈ ర్యాలీ గాంధీభవన్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు కొనసాగింది. దీనికి వందలాది మంది సేవాదల్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు. కార్యక్రమంలో పార్టీ నేతలు జగ్గారెడ్డి, అనిల్ యాదవ్, శివసేనారెడ్డి, చల్లా నర్సింహారెడ్డి, కుసుమ కుమార్ పాల్గొన్నారు.