త్వరలో రెండు సభలు నిర్వహిస్తాం : పీసీసీ చీఫ్​మహేశ్ కుమార్ గౌడ్

త్వరలో రెండు సభలు నిర్వహిస్తాం : పీసీసీ చీఫ్​మహేశ్ కుమార్ గౌడ్
  • కులగణనపై సూర్యాపేటలో రాహుల్ సభ
  • ఎస్సీ వర్గీకరణపై మెదక్​లో ఖర్గే సభ
  • రెండు, మూడు రోజుల్లో పీసీసీ కార్యవర్గం
  • పీసీసీ చీఫ్​ మహేశ్​గౌడ్​ వెల్లడి
  • ఢిల్లీకి వెళ్లిన సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్​

కుల గణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపై ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలను జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు రాష్ట్రంలో రెండు కృతజ్ఞత సభలు నిర్వహించాలని సీఎల్పీ మీటింగ్​లో నిర్ణయించినట్లు పీసీసీ చీఫ్​మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని సూర్యాపేటలో కులగణనపై సభ నిర్వహిస్తామని, దీనికి రాహుల్ గాంధీని ఆహ్వానిస్తామని చెప్పారు. ఎస్సీ వర్గీకరణపై మెదక్ లో మరో సభ ఉంటుందని, దీనికి చీఫ్ గెస్టుగా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను ఆహ్వానిస్తామని తెలిపారు.

 ఈ రెండు సభలకు రాహుల్, ఖర్గేను ఆహ్వానించేందుకే తాము ఢిల్లీకి వెళ్తున్నట్లు చెప్పారు సీఎల్పీ సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. రెండు, మూడు రోజుల్లో పీసీసీ కార్యవర్గాన్ని ప్రకటిస్తామన్నారు. సీఎల్పీ మీటింగులో ఎమ్మెల్యేలు వారి, వారి అభిప్రాయాలను చెప్పారని తెలిపారు. పలు విషయాల్లో ఎమ్మెల్యేలకు వచ్చిన అనుమానాలను నివృత్తి చేశామన్నారు. కాగా, బీజేపీతో లోపాయికారి ఒప్పందం కోసమే బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ ఢిల్లీకి వెళ్లారని ఆయన విమర్శించారు. 

ఢిల్లీకి సీఎం, డిప్యూటీ సీఎం..

సీఎల్పీ మీటింగ్ ముగియగానే అక్కడి నుంచి బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్న సీఎం రేవంత్​రెడ్డి..  పార్టీ ముఖ్య నేతలతో కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు. సీఎం వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​ దీపాదాస్ మున్షీ, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. వీరంతా శుక్రవారం మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీతో భేటీ కానున్నారు. సూర్యాపేట, మెదక్ లో నిర్వహించనున్న కృతజ్ఞత సభలకు ఈ ఇద్దరినీ ఆహ్వానించనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఇదే సమయంలో మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గం ఏర్పాటు, మిగిలిన నామినేటెడ్ పోస్టుల భర్తీపై ఇందులో చర్చించనున్నట్లు సమాచారం.