కష్టపడ్డ కార్యకర్తలకు పదవులు .. స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థులపై సర్వేలు చేస్తున్నాం: పీసీసీ చీఫ్​ మహేశ్​గౌడ్​

కష్టపడ్డ కార్యకర్తలకు పదవులు .. స్థానిక సంస్థల ఎన్నికల అభ్యర్థులపై సర్వేలు చేస్తున్నాం: పీసీసీ చీఫ్​ మహేశ్​గౌడ్​
  • ఆదిలాబాద్ పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి.. త్వరలో ఎయిర్ పోర్ట్​, కాటన్ పరిశ్రమలు
  • అధికారం లేకపోతే బీఆర్ఎస్ లీడర్లు బతకలేకపోతున్నరు
  • బీజేపీ ఇంకా మతం పేరుతోనే ఓట్లు అడుగుతున్నదని కామెంట్​

ఆదిలాబాద్, వెలుగు: కార్యకర్తల వల్లే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని పీసీసీ చీఫ్​ మహేశ్​కుమార్​గౌడ్​ పేర్కొన్నారు. కష్టపడ్డ కార్యకర్తలందరికీ పదవులు ఇస్తామని చెప్పారు. సంక్రాంతి పండుగ తర్వాత నామినేటెడ్ పోస్టులు ఇస్తామని తెలిపారు.  సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మహేశ్​కుమార్​గౌడ్​ ఆధ్వర్యంలో నిర్వహించిన పార్లమెంట్​ విస్తృత స్థాయి సమావేశానికి ఏఐసీసీ జనరల్ సెక్రటరీ దీపాదాస్ మున్షి, సెక్రటరీ విశ్వనాథ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ 90 శాతం సీట్లు గెలవాలని, నియోజకవర్గాల ఇన్​చార్జీలు ఇందుకు బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారు. 

ఎవరు ప్రజల్లో ఉంటున్నారు?  ఎవరు పేదలకు స్కీమ్స్​ అందేలా కృషి చేస్తున్నారు? అనే విషయాలపై సర్వే చేస్తున్నాం. సర్వేల్లో తేలిన వారికే టికెట్లు ఇచ్చి గెలిపించుకుంటాం” అని వెల్లడించారు. ఆదిలాబాద్ జిల్లాపై ప్రభుత్వానికి ప్రత్యేక దృష్టి ఉందని, ఇక్కడ కాటన్ పరిశ్రమ ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఎయిర్ పోర్ట్, టెక్స్ టైల్ పరిశ్రమలు రావాల్సి ఉందన్నారు. ఒక్కసారిగా అధికారం కోల్పోవడంతో బీఆర్ఎస్  లీడర్లు బతకలేకపోతున్నారని మహేశ్ కుమార్ గౌడ్ ఎద్దేవా చేశారు. పదేండ్లలో ఎప్పుడూ పేదలను పట్టించుకోని ఎమ్మెల్సీ కవిత.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ఆదిలాబాద్ కు వచ్చిందో ప్రజలు ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్నారు.   

బీజేపీపై ప్రజలు తిరగబడాలి: దీపాదాస్​ మున్షీ

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్​ను పార్లమెంట్​లో అమిత్​షా అవమానించారని దీపాదాస్​మున్షి పేర్కొన్నారు.  ప్రతిసారి అంబేద్కర్​పై అక్కసు వెళ్లగక్కుతున్న కాషాయ పార్టీపై ప్రజలు తిరగబడాలని పిలుపునిచ్చారు.  అవినీతి, అక్రమాల్లో కేటీఆర్ ను ఏసీబీ పిలుస్తుంది కాబట్టే.. రైతులు, ప్రజా సమస్యల ముసుగేసుకుంటూ రాజకీయాలు చేస్తున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు.  పార్టీలో పనిచేసినవాళ్లకే బాధ్యతలు ఇస్తామని, లోకల్​బాడీ ఎలక్షన్స్​లో గ్రామ గ్రామాన కాంగ్రెస్​ప్రజాప్రతినిధి ఉండాలని అన్నారు. గత పార్లమెంట్​ ఎన్నికల్లో ఆదిలాబాద్ స్థానంలో కాంగ్రెస్​​ఓటమిపై సమీక్షించాలని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు కోరారు. 

కేసీఆర్​కు ప్రతిపక్ష హోదా అవసరమా?: మహేశ్​ గౌడ్​

ప్రజాక్షేత్రంలో ఉండకుండా.. ఫాం హౌస్​కే పరిమితమైన కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా అవసరమా? అని  పీసీసీ చీఫ్​ మహేశ్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. సోమవారం జిల్లా కేంద్రంలో  విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్​నేతలు పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.  బీఆర్ఎస్ లో ఒక కుర్చీ కోసం ముగ్గురు పోటీ పడుతున్నారని ఆరోపించారు.  ఫార్ములా– ఈ కారు రేసులో కేటీఆర్​ అడ్డంగా దొరికిపోయారని అన్నారు.  మొన్నటివరకూ తనను అరెస్ట్​ చేసుకోవాలని సవాల్​ చేసిన కేటీఆర్​.. ఈడీ రంగ ప్రవేశంతో కోర్టును ఎందుకు ఆశ్రయించారో చెప్పాలని డిమాండ్​ చేశారు. ఇది పనికి రాని కేసు అంటూనే ఎందుకు భయపడుతున్నారని కేటీఆర్​ను నిలదీశారు.