మాజీ ఎమ్మెల్యే బిరుదుకు కన్నీటి వీడ్కోలు

  •     ఎమ్మెల్యేలు,  ప్రముఖుల నివాళులు
  •     భారీగా తరలివచ్చిన జనం
  •     పాడె మోసిన కాంగ్రెస్​ యువనేత గడ్డం వంశీకృష్ణ 

పెద్దపల్లి/సుల్తానాబాద్, వెలుగు:  గుండెపోటుతో మరణించిన పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లుకు ప్రజలు కన్నీటి వీడ్కోలు పలికారు. సుల్తానాబాద్ పట్టణంలోని రాజమల్లు ఇంటి నుంచి మంగళవారం అంతిమయాత్ర ప్రారంభమైంది. చివరిసారి తమ నేతను చూడడానికి  ప్రజలు  పెద్ద సంఖ్యలో  తరలివచ్చారు. అంతకుముందు ఆయన భౌతికకాయానికి చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ జి. వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు, రామగుండం ఎమ్మెల్యే ఠాకూర్​మక్కాన్​సింగ్,ఎమ్మెల్సీ టి.భాను ప్రసాదరావు, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, కాంగ్రెస్​ యువనేత గడ్డం వంశీకృష్ణ, మాజీ ఎమ్మెల్యేలు ఆరెపల్లి మోహన్, చందుపట్ల రామ్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 

కుటుంబ సభ్యులను పరామర్శించారు. అంతిమయాత్రలో పాల్గొన్న  కాంగ్రెస్  యువ నేత గడ్డం వంశీకృష్ణ  రాజమల్లు పాడె మోశారు. దివంగత వెంకటస్వామి(కాకా) తో రాజమల్లుకు ఉన్న అనుబంధాన్ని వివేక్ ​వెంకటస్వామి గుర్తు చేసుకున్నారు. రాజకీయాల్లో అజాత శత్రువుగా కొనసాగారని, ఆయన మృతి నియోజకవర్గ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీకి తీరని లోటన్నారు.  బిరుదు రాజమల్లు మృతికి సంతాపంగా వ్యాపారులు స్వచ్ఛందంగా సుల్తానాబాద్ బంద్ పాటించారు.