
సుల్తానాబాద్, వెలుగు: దేశంలోనే మొదటిసారిగా నాడు దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ పేదల కోసం రూ.2కే కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టగా, ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి సన్నబియ్యం పంపిణీ చేస్తూ చరిత్ర సృష్టించారని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు ప్రశంసించారు. సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి, శాస్త్రినగర్‌లలోని రేషన్ షాపుల్లో గురువారం లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీని ఆయన ప్రారంభించారు. అనంతరం సన్న బియ్యంతో వండిన భోజనాన్ని వడ్డించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా పాలనలో ఇచ్చినదరఖాస్తుల ఆధారంగా త్వరలో అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులను అందించనున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో జిల్లా లైబ్రరీ సంస్థ చైర్మన్ అన్నయ్య గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాశ్‌రావు, సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్, కాంగ్రెస్ లీడర్లు పాల్గొన్నారు.