- త్వరలో కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తా: ఎంపీ వంశీకృష్ణ
- తలాపున గోదావరి ప్రవహిస్తున్న నీటి కొరత ఉండటం బాధాకరం
- కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా.. హామీలు అమలు చేస్తున్నదని వెల్లడి
- ధర్మపురిలో టీయూఎఫ్‌ఐడీసీ నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
జగిత్యాల/కోల్బెల్ట్/బెల్లంపల్లి, వెలుగు : జిగిత్యాల జిల్లా ధర్మపురిలో గోదావరి నదికి కరకట్ట నిర్మాణంపై దృష్టి పెట్టామని, ఈ విషయాన్ని త్వరలో కేంద్ర జల శక్తి మినిస్ట్రీ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరిస్తామని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ధర్మపురి పట్టణంలో వర్షాకాలంలో వరదలు, వేసవిలో నీటి కొరతతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఆయా ప్రాంతాల్లో కరకట్టల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
రూ.15 కోట్ల తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీయూఎఫ్ఐడీసీ) నిధులతో సోమవారం ధర్మపురిలో విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌తో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ, తలాపున గోదావరి ప్రవహిస్తున్న ధర్మపురిలో నీటి సమస్య ఉండడం బాధాకరమన్నారు. తాగు నీటి సమస్య కోసం అమృత్ పథకం కింద రూ.2 కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు. ధర్మపురి ఆలయ అభివృద్ధికి ఎంపీ ల్యాడ్స్ నుంచి నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. గతంలో గోదావరి వరదల వల్ల నష్టపోయిన ప్రజలకు విశాక ట్రస్ట్ ద్వారా ఆదుకున్నామని ఆయన గుర్తుచేశారు. గత ప్రభుత్వంలో మిషన్ భగీరథ, కాకతీయ పథకాలు ఉన్నా నీటి సమస్యను పరిష్కరించడంలో విఫలమయ్యారని మండిపడ్డారు.
తమ ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నా.. ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నదని తెలిపారు. విప్ అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ, గత ప్రభుత్వం అటవీ శాఖ అనుమతుల్లేకుండా రోళ్ల వాగు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడంతో తీవ్ర జాప్యం జరుగుతున్నదని తెలిపారు. ధర్మపురిలో ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలని హెల్త్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. మరో పది రోజుల్లో ధర్మపురి ప్రభుత్వ ఆసుపత్రిలో ఐసీయూ ప్రారంభించేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. ఇప్పటికే ఎంపీ ల్యాడ్స్ నుంచి ధర్మపురి నియోజకవర్గానికి రూ.5 కోట్ల నిధులు వచ్చాయని, ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణకు అడ్లూరి కృతజ్ఞతలు తెలిపారు.
బెల్లంపల్లి రైల్వే సమస్యలు తీరుస్తా: వంశీకృష్ణ
బెల్లంపల్లిలో రైల్వే సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీ వంశీకృష్ణ హామీ ఇచ్చారు. సోమవారం సాయంత్రం ఆయన మంచిర్యాల జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా బెల్లంపల్లికి వచ్చిన ఆయనకు కాంగ్రెస్, మాల మహానాడు లీడర్లు ఘనస్వాగతం పలికారు. బెల్లంపల్లి రైల్వే స్టేషన్‌లో దక్షిణ్, జీటీ ఎక్స్‌ప్రెస్, నవజీవన్, కేరళ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ కల్పించేందుకు కృషి చేయాలని ప్రజలు విన్నవించారు. అలాగే, బెల్లంపల్లి రైల్వే స్టేషన్‌లో మూడో ప్లాట్ ఫాం నుంచి రైళ్లు నడిచేలా, రెండో ప్లాట్ ఫాంకు వెళ్లేందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
బెల్లంపల్లిలోని రైల్వే సమస్యలను రైల్వే జీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారించేందుకు కృషి చేస్తానని ఈ సందర్భంగా వంశీకృష్ణ హామీ ఇచ్చారు. ఎంపీని కలిసిన వారిలో కాంగ్రెస్ లీడర్లు మునిమంద రమేశ్, కొలిపాక శ్రీనివాస్, దూడపాక బలరాం, ఎలిగేటి శ్రీనివాస్ ఉన్నారు. వంశీకృష్ణను మాల సంఘం లీడర్లు శాలువా కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాల సంఘం లీడర్లు కాసర్ల యాదగిరి, కుంబాల రాజేశ్, సబ్బని రాజనర్సు, ఎరుకల శ్రీనివాస్, పోచంపల్లి హరికృష్ణ, పీక లక్ష్మణ్, సునీల్ పాల్గొన్నారు.