ఆ ప్రాజెక్ట్​ పనులను ఆపేద్దాం.... ఎందుకంటే..

ఆ ప్రాజెక్ట్​ పనులను ఆపేద్దాం.... ఎందుకంటే..
  • 20 ఏండ్లుగా సాగుతున్న ప్రాజెక్టుల పనులు క్లోజ్​ చేద్దాం!
  • 14 ప్రాజెక్టుల్లో 174 పనుల  ప్రీ క్లోజ్​కు సర్కారు నిర్ణయం
  • కేటగిరీ ఏ, బీ, సీలుగా విభజించిన అధికారులు
  • కేటగిరీ బీలోని పనులు చేస్తున్న సంస్థలకు పెనాల్టీ!
  • రాజీవ్​ భీమాకు ఆర్​ అండ్​ ఆర్​ సమస్యలు

హైదరాబాద్, వెలుగు: ఒకటి కాదు.. రెండు కాదు.. దాదాపు రెండు దశాబ్దాలుగా కొనసాగుతున్న వివిధ ప్రాజెక్టుల పనులను క్లోజ్​చేయాలని ఇరిగేషన్​ శాఖ నిర్ణయించింది. కొన్ని ప్రాజెక్టులకు పునరావాస ప్యాకేజీ సమస్యగా మారితే.. మరికొన్ని ప్రాజెక్టులకు భూసేకరణ సమస్యగా మారిందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయా ప్రాజెక్టులకు ఇచ్చిన ఈపీసీ (ఇంజినీరింగ్​ ప్రొక్యూర్​మెంట్​ అండ్​ కన్​స్ట్రక్షన్​) పనులను కాంట్రాక్ట్​ సంస్థల పరస్పర అంగీకారంతో క్లోజ్​ చేయాలని ఇరిగేషన్​ శాఖ నిర్ణయించింది. 14 కీలక ప్రాజెక్టులకు సంబంధించిన 31 ఈపీసీ టెండర్లలోని 174 పనుల్లో ఇప్పటికే కొన్ని పనులను క్లోజ్​ చేయగా.. ఇంకా అసంపూర్తిగా ఉన్న పనులనూ క్లోజ్​ చేయనున్నారు. ఈ మేరకు మంగళవారం జలసౌధలో కాంట్రాక్టు సంస్థలతో సమావేశమైన అధికారులు.. ఆ పనులను క్లోజ్​చేయాల్సిందిగా ఆదేశించారు. ఆయా పనులను మూడు కేటగిరీలుగా విభజించారు. కేటగిరీ బీలోని పనులకు సంబంధించి కాంట్రాక్టు సంస్థలకు పెనాల్టి విధించి క్లోజ్​ చేయనున్నారు. 

క్లోజ్​ చేస్తే పదేండ్ల వరకు నో చాన్స్​

ప్రీ క్లోజ్ చేసే ప్రాజెక్టుల పనులు చేస్తున్న కాంట్రాక్టు సంస్థకు ఐదు నుంచి పదేండ్ల వరకు పనులు అప్పగించకూడదని ఇరిగేషన్​శాఖ నిర్ణయించినట్టు తెలిసింది. అయితే, ఇది కేవలం అన్ని వనరులు సమకూర్చినా.. పెండింగ్​ బిల్లులు చెల్లించినా పనులను పూర్తి చేయకుండా అలసత్వం ప్రదర్శించిన కంపెనీలకు మాత్రమే వర్తింపజేయాలని భావిస్తున్నట్టు తెలిసింది. మూడు కేటగిరీలుగా విభజించిన పనుల్లో.. కేటగిరీ ఏలో 70 నుంచి 80 శాతం వరకు పనులు పూర్తయిపోయి.. అన్ని ఆబ్జెక్టివ్స్​ కంప్లీట్ చేసిన ప్రాజెక్టు పనులను చేర్చనున్నారు. ప్రభుత్వం నుంచి అనుమతులు రాకపోవడం, అటవీ అనుమతులు ఆలస్యం అవుతుండడం వంటి కారణాలతో ఆలస్యమవుతున్న పనుల ఈపీసీలను ఈ కేటగిరీలో చేర్చారు. ఇక, కేటగిరీ బీలో వివాదాలున్న పనులను చేర్చినట్టు తెలిసింది. కోర్టు కేసులు, క్వాలిటీ కంట్రోల్​ రిమార్క్స్, విజిలెన్స్​ రిమార్క్స్, పునరావాస ప్యాకేజీ తేలకపోవడం, ప్రభుత్వం ఆమోదించిన ప్రీ క్లోజర్, భూ సేకరణ సమస్యలున్న ప్రాజెక్టుల పనులను ఈ కేటగిరీ కింద చేర్చి ప్రీ క్లోజ్​ చేయనున్నారు. ఇక, కేటగిరీ సీ కింద చేర్చే పనులపై మరోసారి డిటెయిల్డ్​ స్టడీ చేయించాలని నిర్ణయించారు. 

ఈ ప్రాజెక్టుల పనులే పెండింగ్​

కేటగిరీ ఏ: నీల్వాయి ప్రాజెక్టుకు సంబంధించి పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా అటవీ భూములు ముంపుకు గురవుతుండడంతో అటవీ అనుమతులు ఆలస్యమవుతున్నాయి. పాలెం వాగు పనులు కొనసాగుతున్నాయి. మత్తడివాగు పనులు పూర్తయ్యాయి. ఎస్సారెస్పీ స్టేజ్ 2లో 52వ ప్యాకేజీకి సంబంధించిన పనులు అర్ధంతరంగా ఆగిపోయాయి. దీంతో ఆ పనులను ప్రీ క్లోజ్​ చేశారు. 53, 54, 58 ప్యాకేజీల పనులు నడుస్తున్నాయి. 55వ ప్యాకేజీ పనులు ఆగిపోగా.. 57వ ప్యాకేజీ పనులను నిలిపేశారు. సదర్మట్, పిప్రి లిఫ్ట్​ స్కీమ్​ పనులను ప్రీ క్లోజ్​ చేయనున్నారు. 

కేటగిరీ బీ: మోడికుంట వాగు, దేవాదుల లిఫ్ట్​ స్కీమ్​లోని 46వ ప్యాకేజీ, ఎస్​ఎల్​బీసీ 79వ ప్యాకేజీ పనులు కోర్టు కేసుల్లో ఉన్నాయి. దీంతో వాటినీ ప్రీ క్లోజ్​ చేయనున్నారు. దేవాదులలోని తపాస్​పల్లి, అశ్వారావుపేట, డిస్ట్రిబ్యూటరీ, ప్యాకేజీ 3 నుంచి ప్యాకేజీ 8 వరకు పనులు ఇంకా కొనసాగుతున్నాయి. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోని కెనాల్​ నెట్​వర్క్, గ్రావిటీ కెనాల్, స్టేజ్​2 ఫేజ్​1 పనులు నడుస్తున్నాయి. డిస్ట్రిబ్యూటరీ ప్యాకేజీ 3 పనులు ఆగిపోవడంతో ప్రీ క్లోజర్​కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కల్వకుర్తి లిఫ్ట్​ స్కీమ్​లోని 28, 29, 30 ప్యాకేజీల పనులు నడుస్తున్నాయి. కోయిల్​సాగర్​ పనులు ఆగిపోయాయి. రాజీవ్​ భీమా లిఫ్ట్​ స్కీమ్​లోని 18వ ప్యాకేజీలో పునరావాస ప్యాకేజీ సమస్య ఏర్పడింది. 13, 14, 21, 22 ప్యాకేజీల పనులు నిలిచిపోయాయి.

నెట్టెంపాడుకు  భూసేకరణ సమస్య

కేటగిరీ బీలో చేర్చిన జవహర్​ నెట్టెంపాడు లిఫ్ట్​ ఇరిగేషన్​ స్కీమ్​ పనులకు భూ సేకరణ సమస్యగా మారింది. 98, 99, 100వ ప్యాకేజీల్లో భూసేకరణ ఆలస్యమవుతున్నది. మరో 9 ప్యాకేజీల పనులు ఇంకా కొనసాగుతున్నాయి. ఎస్​ఎల్​బీసీ ప్రాజెక్టులో 77 నుంచి 80వ ప్యాకేజీ వరకు, పెండ్లిపాకల పనులు ఆగాయి. మరికొన్ని పనులు ఇంకా నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ 14 ప్రాజెక్టులకు సంబంధించిన పనులను ప్రీ క్లోజ్​చేయాలని ఇరిగేషన్​ శాఖ భావిస్తున్నది. ఇప్పటి వరకు చేసిన పనులకు బిల్లులు చెల్లించి ఈపీసీ టెండర్లను ప్రీ క్లోజ్ చేయాలని యోచిస్తున్నది. అయితే, వీటిలో కొన్ని పనులను కొనసాగించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.