వనపర్తి, వెలుగు: వనపర్తి పట్టణంలో తాగునీటికి జనం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. 10 రోజులకు ఒకసారి తాగునీటిని మున్సిపల్ ఆఫీసర్లు సప్లై చేస్తుండగా, పాలకవర్గం జనం గోడు పట్టించుకోవటం లేదు. పట్టణ అవసరాలకు తగ్గట్టుగా ప్రతిరోజు నీటిని సప్లై చేయకపోవడంతోనే ఈ సమస్య ఏర్పడుతోంది. ఇటీవల కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ దృష్టికి ఈ సమస్య తీసుకెళ్లడంతో ఆయన సంబంధిత అధికారులతో రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి గుంపు గట్టు పథకం ద్వారా వనపర్తికి నీరందించేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. దీంతో కొంత మేర నీటి కొరత తీరే అవకాశం ఉందని అంటున్నారు.
జిల్లా కేంద్రం కావడంతో జనాభా వేగంగా పెరుగుతోంది. 80 వేలు ఉన్న జనాభా ప్రస్తుతం లక్ష దాటిపోయింది. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నీటి సప్లై చేయడంపై దృష్టి పెట్టకపోవడంతోనే ఈ సమస్య వస్తోందని అంటున్నారు. 25 ఏండ్ల కింద కొత్తకోట మండలంలోని రామన్ పాడ్ నుంచి వనపర్తికి తాగునీటిని అందించేందుకు పథకం రూపొందించారు. ఇది తరుచూ రిపేర్లకు గురై నీరందించడం లేదు. 30 కాలనీలు కొత్తగా ఏర్పడగా, ఇక్కడి ప్రజలకు పైప్ లైన్లు లేక పవర్ బోర్ల ద్వారా ఉప్పు నీటిని సప్లై చేస్తున్నారు.
మిషన్ భగీరథ నీళ్లు రావట్లే..
రామన్ పాడు స్కీమ్ ఉందన్న సాకుతో పట్టణానికి మిషన్ భగీరథ మంజూరు చేయలేదు. ఆ తర్వాత నీటి కొరత దృష్ట్యా మంత్రి నిరంజన్ రెడ్డి ప్రత్యేక అనుమతితో పట్టణంలో మిషన్ భగీరథ స్కీమ్ తీసుకువచ్చి కాలనీల్లో పైప్ లైన్లు వేశారు. కొత్తకోట సమీపంలోని బుగ్గ పల్లి తండా వద్ద శంకర్ సముద్రం నుంచి నీటిని తీసుకొని అక్కడ ఫిల్టర్ చేసి వనపర్తి పట్టణానికి అందించాల్సి ఉంది. ఇది పూర్తయ్యేందుకు మరో ఏడాది పడుతుందని అధికారులు అంటున్నారు. వనపర్తిలోని కేడీఆర్ నగర్ తో పాటు బసవన్న గడ్డ, రాంనగర్ కాలనీ, బృందావన్ కాలనీ, గాంధీచౌక్, శ్వేతానగర్, పానగల్ రోడ్డు, బండారు నగర్, మారెమ్మకుంట, వెంగళరావు కాలనీ, న్యూ టౌన్ కాలనీ, నాగవరం కొత్త కాలనీ, ఆర్టీసీ కాలనీ, పీర్లగుట్ట, మర్రికుంట తోపాటు పట్టణంలోని ఇతర ప్రాంతాల్లో పరిస్థితి ఇబ్బంది కరంగా మారింది. పట్టణంలోని 160 హ్యాండ్ బోర్లను పవర్ బోర్లుగా మార్చి, నేరుగా ఉప్పునీటిని అందిస్తున్నారని పట్టణవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రామన్ పాడు ద్వారా పది రోజులకు ఒకసారి వచ్చే నీళ్లు రంగు మారి వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పాలకమండలి విఫలం..
వనపర్తి పట్టణ ప్రజలకు తాగునీటిని అందించడంలో మున్సిపల్ పాలకవర్గం పూర్తిగా విఫలమైందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. పదేళ్లుగా కొత్త పథకాలు తీసుకురాకపోవడంతో 30 కిలోమీటర్ల దూరం నుంచి నీటిని తరలించే రామన్ పాడుపైనే ఆధారపడాల్సి వస్తోందని అంటున్నారు. తరుచూ రిపేర్లకు గురవడంతో మెయింటెనెన్స్, కరెంట్ బిల్లులు భారంగా మారుతున్నాయి. ప్రతి నెలా రూ.12 లక్షలు బిల్లు వస్తుండడంతో అధికారులు చెల్లించడం లేదు. మరో పక్క పవర్ బోర్లకు స్ట్రీట్ లైట్లకు మరో రూ.12 లక్షలు బిల్లులు కడుతున్నారు.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం
కొత్తకోట సమీపంలోని గుంపుగట్టు వద్ద ఉన్న మిషన్ భగీరథ పథకం నుంచి నీటిని తరలించాలని నిర్ణయించాం. వనపర్తికి వచ్చే పైప్ లైన్ కు లింక్ చేసి నీటిని అందిస్తాం. 10 రోజుల్లో నీటి కొరతను నివారిస్తాం. వాణిజ్య అవసరాలకు తాగు నీటిని వినియోగించే వారిపై చర్యలు తీసుకుంటాం.
- విక్రమసింహారెడ్డి, మున్సిపల్ కమిషనర్