మెరుపు సెంచరీలు చేసినా నిరాశే.. ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడిని పట్టించుకోని ఫ్రాంచైజీలు

మెరుపు సెంచరీలు చేసినా నిరాశే.. ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడిని పట్టించుకోని ఫ్రాంచైజీలు

దుబాయ్ వేదికగా నిన్న(డిసెంబర్ 19) జరిగిన ఐపీఎల్ 2023 మినీ ఆక్షన్ ముగిసింది. ఈ ఆక్షన్ లో విదేశీ ఆటగాళ్లు పండగ చేసుకున్నారు. ఆసీస్ స్టార్ పేసర్లకు ఈ వేలంలో భారీ ధర దక్కింది. కంగారూల కెప్టెన్ కమిన్స్ కు 20.50కోట్లు పెట్టి సన్ రైజర్స్ సొంతం చేసుకోగా.. మిచెల్ స్టార్క్ ను 24.75 కోట్లతో కోల్ కత్తా నైట్ రైడర్స్ చేజిక్కించుకుంది. ఇక డారిల్ మిచెల్ కు సైతం 14 కోట్లు దక్కాయి. చెన్నై సూపర్ కింగ్స్ ఈ స్టార్ ప్లేయర్ ను దక్కించుకుంది. అంతా బాగానే ఉన్నా.. ఇంగ్లాండ్ స్టార్ ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ పై ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపించకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
 
ప్రస్తుత టీ20 క్రికెట్ లో సాల్ట్ చెలరేగి ఆడుతున్నాడు. తాజాగా వెస్టిండీస్ తో వరుసగా రెండు అంతర్జాతీయ సెంచరీలు చేసి టాప్ ఫామ్ లో ఉన్నాడు. 5టీ20 ల సిరీస్ లో భాగంగా మూడో టీ20లో 56 బంతుల్లో 109 పరుగులు చేసిన సాల్ట్ ఇన్నింగ్స్ లో 4 ఫోర్లు, 9 సిక్సులున్నాయి. నిన్న(డిసెంబర్ 19) జరిగిన నాలుగో టీ20 లో అంతకు మించి రెచ్చిపోయిన ఈ స్టార్ ఆటగాడు 57 బంతుల్లో 10 సిక్సులు, 7 ఫోర్లతో 119 పరుగులు చేసి ఇంగ్లాండ్ ను ఒంటి చేత్తో గెలిపించాడు. అంతమందు జరిగిన తొలి రెండు టీ20 ల్లో సైతం సాల్ట్ 150 కి పైగా స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేసాడు. 

అంతర్జాతీయ క్రికెట్ లో ఒక వరుసగా రెండు సెంచరీలు చేసినా ఐపీఎల్ 2023 మినీ వేలంలో అన్ సోల్డ్ గా మిగిలిపోయాడు. ఐపీఎల్ 2023 లో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడిన సాల్ట్.. ఒక్క మ్యాచ్ లో మినహా పెద్దగా రాణించలేదు. దీంతో సాల్ట్ ఐపీఎల్ ఫామ్ నే పరిగణలోకి తీసుకున్నారేమో అనే అభిప్రాయలు వినిపిస్తున్నాయి. కనీసం బేస్ ప్రైజ్ కు కూడా ఎవరూ ఆసక్తి చూపించకపోవడం షాక్ కు గురు చేసింది. సాల్ట్ సైతం తనను భారీ ధరకు కొంటారని అనుకున్నాడట. 

ఇంగ్లాండ్ ఆటగాళ్లు హ్యారీ బ్రూక్, క్రిస్ వోక్స్,గుస్ అట్కిన్సన్ వేలంలో మంచి ధరకు అమ్ముడుపోయారు. బ్రూక్‌ ను ఢిల్లీ క్యాపిటల్స్ 4 కోట్లకు, వోక్స్‌ను 4.2 కోట్లకు పంజాబ్ కింగ్స్‌ తీసుకుంది. యువ బౌలర్ అట్కిన్‌సన్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ బేస్ ప్రైజ్ కోటి రూపాయలకు దక్కించుకుంది. ఐపీఎల్ 2024 కు ఇంగ్లాండ్ స్టార్ ఆటగాళ్లు బెన్ స్టోక్స్, రూట్ తప్పుకున్న సంగతి తెలిసిందే.