
- నేడు విచారణకు హాజరుకానున్న ఫోన్ ట్యాపింగ్ నిందితుడు
- సిట్ విచారణలో కీలకంగా మారిన ఆ రెండు సెల్ ఫోన్లు
- గత అసెంబ్లీ ఎన్నికల్లో శ్రవణ్ రావు వినియోగించినట్టు అనుమానం
హైదరాబాద్, వెలుగు: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రస్తుతం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) దర్యాప్తు అంతా శ్రవణ్‌రావు వినియోగించిన సెల్‌ఫోన్ల చుట్టే తిరుగుతున్నది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ఎస్‌ఐబీ, ఎస్‌ఓటీ మాజీ చీఫ్ ప్రణీత్ రావుకు చేరవేసిన సమాచారం రాబట్టేందుకు సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది.
ఈ మేరకు శ్రవణ్‌రావుvను మంగళవారం మరోసారి విచారించనున్నది. నిరుడు మార్చి10న పంజాగుట్ట పీఎస్‌లో కేసు నమోదైన తర్వాత శ్రవణ్‌రావు అమెరికాకు పారిపోయిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆయన గత నెల 29న సిట్‌ముందు హాజరయ్యాడు. మొదటి రోజు విచారణలో భాగంగా శ్రవణ్‌రావును సిట్‌అధికారులు దాదాపు 6 గంటల పాటు ప్రశ్నించారు. 2023, గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వినియోగించిన 2 సెల్ ఫోన్లను తమకు అప్పగించాలని ఆదేశించారు. ఈ క్రమంలో ఈ నెల 2న శ్రవణ్‌రావు రెండోసారి సిట్ ముందు హాజరయ్యాడు. కేసుతో సంబంధం లేని ఫోన్‌ను అందించాడు. గుర్తించిన సిట్ అధికారులు..తాము నోటీసుల్లో పేర్కొన్న ఐఎంఈఐ నంబర్లకు సంబంధించిన రెండు సెల్‌ఫోన్లతో ఈ నెల 8న హాజరుకావాలని ఆదేశించారు.
కీలకంగా మారిన ఫోన్లు..
సిట్‌ఆదేశాల మేరకు తన 2 ఫోన్లతో శ్రవణ్‌రావు హాజరుకావాల్సి ఉంది. కానీ తాను సర్వేలో అందించిన సమాచారం మినహా వాట్సప్ చాటింగ్స్, ఇతర ఆధారాలు లభించకుండా ఉండేందుకే తన సెల్‌ఫోన్లను శ్రవణ్‌రావు అప్పగించడం లేదని సిట్ అనుమానిస్తున్నది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఫోన్‌ట్యాపింగ్ కేసులో స్మార్ట్‌ఫోన్లు కీలకంగా మారాయి. మొదట్లో సిట్‌దర్యాప్తుకు కొంత మేర సహకరించినట్లు నటించిన శ్రవణ్‌రావు..గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వినియోగించిన సెల్‌ఫోన్లను అప్పగించేందుకు ఎత్తులు వేస్తున్నాడు.
దీంతో అప్పట్లో శ్రవణ్ వినియోగించిన స్మార్ట్‌ఫోన్లతోనే ప్రస్తుతం ఆయన చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్లు తెలుస్తున్నది. నాటి అధికారపార్టీ నేతల సూచనల మేరకే శ్రవణ్‌రావు పొలిటికల్ సర్వే నిర్వహించినట్లు సిట్‌ఆధారాలు సేకరించింది. ఒకవేళ శ్రవణ్‌రావు వినియోగించిన సెల్‌ఫోన్లు సిట్ చేతికి చిక్కితే.. గత ప్రభుత్వ పెద్దల గుట్టురట్టు అయ్యే అవకాశాలు ఉన్నట్టు సమాచారం.