
- వేసవి సెలవులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి
- మై హాలిడేస్’ హ్యాష్‌ట్యాగ్‌తో మీ అనుభవాలు పంచుకోండి
న్యూఢిల్లీ: విద్యార్థులు కొత్త హాబీలను అలవర్చుకొని, స్కిల్స్‌ను పెంచుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మన్‌కీ బాత్ 120వ ఎపిసోడ్ లో ఆదివారం ప్రధాని మోదీ ప్రసంగించారు. చిన్నతనంలో వేసవి సెలవుల వచ్చాయంటే తాను, తన స్నేహితులు ఎంతో అల్లరి చేసేవారమని, అదే సమయంలో నిర్మాణాత్మకంగా ఏదో ఒకటి చేసేవాళ్లమని చెప్పారు. పిల్లలందరూ సెలవులను వృథా చేయకుండా ఏదో స్కిల్నేర్చుకోవాలని చెప్పారు.
ఏవైనా సంస్థలు స్వచ్ఛంద కార్యకలాపాలను నిర్వహిస్తుంటే, దానిని 'మై హాలిడేస్' అనే హ్యాష్‌ట్యాగ్‌తో షేర్ చేయాలని సూచించారు. వేసవి సెలవుల కోసం ప్రభుత్వం రూపొందించిన ‘మై భారత్’ ప్రత్యేక క్యాలెండర్ చిన్నారులకు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ వేసవి సెలవుల అనుభవాలను ‘హాలిడే మెమోరీస్’ హ్యాష్‌ట్యాగ్‌తో షేర్ చేయాలని, వాటిని వచ్చే మన్‌కీ బాత్‌లో ప్రస్తావించేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు.
భిన్నత్వంలో ఏకత్వానికి మన పండుగలు ప్రతీక
మన దేశంలోని పండుగలు భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని మోదీ తెలిపారు. ‘‘ఈ రోజు (ఆదివారం) కర్నాటకతోపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉగాది పండుగను జరుపుకుంటున్నారు. మహారాష్ట్రలో గుడి పడ్వా పేరుతో కొత్త సంవత్సరానికి ప్రజలు ఆహ్వానం పలుకుతున్నారు. మన దేశం భిన్నత్వంతో కూడుకున్నది” అని పేర్కొన్నారు. ఈ నెలంతా పండుగలే ఉన్నాయని, ఈద్కూడా జరుపుకోనున్నారని తెలిపారు. ‘‘మన ఐక్యతను ఇలాంటి ప్రత్యేక సందర్భాలు చూపిస్తాయి’’ అని ఆకాంక్షించారు. ఆయా రాష్ట్రాల ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
నీటిని పొదుపుగా వాడుకోవాలి
వేసవిని దృష్టిలోపెట్టుకొని నీటిని పొదుపుగా వాడుకోవాలని దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ విషయంలో అందరూ ఇప్పటి నుంచే ఒక ప్రణాళికను రూపొందించుకోవాలన్నారు. ‘క్యాచ్‌ది రెయిన్’ కార్యక్రమంలో భాగంగా 11 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీటిని పొదుపు చేసినట్టు చెప్పారు. ఇంటి ముందు ఒక కుండలో చల్లటి నీటిని అందరికీ అందుబాటులో ఉంచాలని ప్రజలను కోరారు.
ఆదిలాబాద్ గిరిజన మహిళలకు ప్రశంస
పూలల్లో కొన్ని ఇంటికి అందాన్ని తెస్తే.. మరికొన్ని పరిమళాలను వెదజల్లుతాయని అన్నారు. మహువా (ఇప్ప) పువ్వులకు చాలా ప్రత్యేకత ఉన్నదని, వీటితో మధ్యప్రదేశ్‌లోని రాజఖో గ్రామ మహిళలు కుకీలు(బిస్కెట్లు) తయారు చేస్తున్నారని చెప్పారు. తెలంగాణలోని ఆదిలాబాద్‌కు చెందిన ఇద్దరు సోదరీమణులు ఇప్పపువ్వు లడ్డూలను తయారు చేస్తున్నారని వివరించారు.