వీణవంక/హుజూరాబాద్, వెలుగు : రెండు రోజుల క్రితం ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డిని తిడుతూ ఓ వ్యక్తి సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేయగా పోలీసులు శుక్రవారం అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, అతడిని కోర్టులో హాజరు పరచకుండా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిప్పడం, అతడిని కలిసేందుకు అడ్వకేట్ రాగా కలవనీయకపోవడం వివాదాస్పదంగా మారింది. వీణవంక మండలానికి చెందిన గెల్లు రాజేందర్ కొంతకాలంగా హైదరాబాద్ లో ఉంటున్నాడు.
ఇటీవల రాజేందర్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిని తిడుతూ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశాడు. దీంతో ఓ బీఆర్ఎస్ కార్యకర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు హైదరాబాద్ లో ఉన్న అతడిని అదుపులోకి తీసుకుని జమ్మికుంట రూరల్ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న బీజేపీ శ్రేణులు అక్కడికి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వీణవంకకు తరలిస్తున్నట్లు పోలీసులు తెలుపగా కార్యకర్తలు ఫాలో అయ్యారు.
కొంత దూరం వెళ్లాక తిరిగి హుజూరాబాద్ కే తీసుకెళ్లారు. హుజూరాబాద్ లోనూ బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో అర్ధరాత్రి వేళ కోర్టు కాంప్లెక్స్ఆవరణలో ఉంటున్న మెజిస్ట్రేట్ముందు హాజరుపరిచారు.