- హిందీ మాట్లాడే వారే సైబర్ ముఠాల టార్గెట్
- ఢిల్లీ, యూపీ, బెంగాల్లో పలు సిటీలు కేంద్రంగా కాల్ సెంటర్లు
- పార్ట్ టైం జాబ్ లు, వర్క్ ఫ్రం హోం పేరుతో మోసాలు
హైదరాబాద్, వెలుగు: టెలిగ్రాం, వాట్సాప్ అడ్డాగా రూ.712 కోట్లు దోచేసిన చైనీస్ ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్ కేసులో హైదరాబాద్ సిటీ సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కేసుల డేటాను సేకరిస్తున్నారు. సిటీ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది ఆరు నెలల్లో 782 ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్ కేసులు నమోదైనట్లు గుర్తించారు. వాటిలో సైబర్ నేరస్తులు రూ.48 కోట్లకు పైగా కొల్లగొట్టారు. ఈ క్రమంలోనే రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్లు పరిధిలో రోజూ 30 పైగా కేసులు రిపోర్ట్ అవుతున్నాయని గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రాడ్స్, పార్ట్ టైమ్ జాబ్స్, వర్క్ ఫ్రం హోం పేరుతో జరిగిన సైబర్ మోసాలకు సంబంధించిన కేసుల డేటాను పోలీసులు సేకరిస్తున్నారు. సైబర్ నేరాల్లో బాధితుల ఫిర్యాదుల ఆధారంగా వారి డబ్బు ట్రాన్స్‌ఫర్ అయిన బ్యాంకు ఖాతాల వివరాలు రాబడుతున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ప్రకాశ్ ప్రజాపతి ఆపరేట్ చేస్తున్న అకౌంట్ల లింకులను గుర్తించారు. షెల్ కంపెనీల పేర్లతో ఓపెన్ చేసిన113 ఖాతాల్లో అకౌంట్స్‌లో జరిగిన ట్రాన్సాక్షన్ సేకరిస్తున్నారు.ఇందుకోసం సంబంధిత బ్యాంకులకు లెటర్లు రాశారు. చైనీస్, దుబాయ్ గ్యాంగ్స్‌ను అరెస్టు చేసేందుకు కేంద్ర ఏజెన్సీలకు సమాచారం అందించారు.
మెట్రో సిటీల్లో కాల్ సెంటర్లు
హిందీ మాట్లాడేవారు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలనే సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేశారు. ఢిల్లీ, బెంగాల్, యూపీల్లో పలు నగరాలను కేంద్రంగా చేసుకొని కాల్ సెంటర్లు ఏర్పాటు చేశారు. నిరుద్యోగ యువతకు కమీషన్లు, గిఫ్ట్‌లతో ఆఫర్లు ఇస్తున్నారు. వారితో లింక్స్ పంపించి ఇన్వెస్ట్‌మెంట్, జాబ్ ఫ్రాడ్స్‌తో అందిన కాడికి దోచేస్తున్నారు. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం తెలిస్తే చాలు కాల్ సెంటర్ ఉద్యోగులకు ఇచ్చినట్లు ప్రొఫెషనల్ వర్క్ ఇస్తున్నారు.
ప్రజల్లో అవగాహన రావాలి
సైబర్ నేరగాళ్లు అమాయకుల ఆశను క్యాష్ చేసుకుంటున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు, కమీషన్ ఇస్తామంటూ ట్రాప్ చేస్తున్నారు. ఇలాంటివి రోజూ 15 నుంచి 20 కేసులు నమోదు అవుతున్నాయి. బాధితులు రూ.కోట్లలో నష్టపోతున్నారు. పోగొట్టున్న డబ్బు రికవరీ అయ్యే అవకాశాలు లేవు. ప్రజల్లో అవగాహనతోనే సైబర్ నేరాలను నివారించగలం.
- సీవీ ఆనంద్, సీపీ, హైదరాబాద్