ఆస్పత్రిలో బాలుడు కిడ్నాప్ .. గంటల్లోనే చేదించిన పోలీసులు

ఆస్పత్రిలో  బాలుడు  కిడ్నాప్ .. గంటల్లోనే చేదించిన పోలీసులు

నిజామాబాద్ జిల్లాలోని జనరల్ ఆస్పత్రిలో  కిడ్నాప్ కు గురైన మూడేళ్ల బాలుడి ఆచూకిని పోలీసులు కనుగొన్నారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో కిడ్నాపర్లను పోలీసులు పట్టుకున్నారు. సిసిటీవీ ఫుటేజ్ ఆధారంగా కేసును చేధించారు పోలీసులు. 

నిజామాబాద్  జిల్లా కేంద్రంలోని ఆస్పత్రికి డెలివరి కోసం వచ్చింది ఓ కుటుంబం. డాక్టర్లు భార్యకు మరుసటి రోజు డెలివరీ చేస్తామనగా.. భర్త తన మూడేళ్ల బాబుతో కలిసి ఆస్పత్రి కారిడార్ లో నిద్రించాడు. ఇదే అదునుగా చూసిన కొందరు కేటుగాళ్లు ఆ బాబును ఎత్తుకెళ్లారు. ఉదయం భర్త లేచి చూడగా బాబు లేకపోవవడంతో కంగారుకు గురయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. 

విషయం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకుని విచారణ చేపట్టారు. సీసీ కెమెరాలో బాలున్ని ఎత్తుకెళ్లిన దృశ్యాలు రికార్డ్ కావడంతో వాటిని రివైండ్ చేసి చూశారు. అందులో ఇద్దరు వ్యక్తులు బాబును ఎత్తుకెళ్లినట్టు కనిపించింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. నిందితుల ఫోటోలను అన్ని పోలీస్ స్టేషన్లకు పంపించారు. కిడ్నాప్ కేసును సవాల్ గా తీసుకున్న పోలీసులు  సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా  బాలుడి ఆచూకిని కనిపెట్టి తల్లిదండ్రులకు అప్పగించారు.