
- మహేశ్వర్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి మధ్య టగ్ ఆఫ్ వార్
- ఇరువురు నేతల మధ్య పోటాపోటీ ఆరోపణలు, విమర్శలు
- సైలెంట్ గా ఉండిపోయిన కాంగ్రెస్ పార్టీ నేతలు
నిర్మల్, వెలుగు: ఆయిల్ పామ్ ఫ్యాక్టరీపై నిర్మల్ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మధ్య టగ్ ఆఫ్ వార్ నడుస్తోంది. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అడ్డుకుంటున్నారని మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆరోపణలు చేయడమే కాకుండా రైతులతో కలిసి ధర్నా కూడా చేశారు. దీనిపై ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి స్పందిస్తూ.. ఎస్సారెస్పీ డ్యామ్ కింద ఫ్యాక్టరీ నిర్మాణం అనుకూలం కాదని ఇరిగేషన్ శాఖ రిపోర్ట్ ఇచ్చిందని కౌంటర్ ఇచ్చారు.
మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తన భూముల విలువను పెంచుకునేందుకే ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని చేపట్టేందు కు చర్యలు తీసుకున్నారన్నారని ఆరోపణలు చేశారు. ఇలా పది రోజులుగా ఇద్దరు నేతల మధ్య పొలిటికల్ ఫైట్ నడుస్తుండగా.. ఇది కాస్త హాట్ టాపిక్ గా మారింది. అయితే.. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఎక్కడ కూడా కాంగ్రెస్ పేరు ఎత్తడంలేదు. మాజీ మంత్రి హోదాలోనే ఎమ్మెల్యేపై విమర్శలు, ధర్నాలు చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది.
బీఆర్ఎస్ హయాంలోనే శంకుస్థాపన
గత బీఆర్ఎస్ హయాంలో మంత్రిగా చేసిన ఇంద్రకరణ్ రెడ్డి నిర్మల్ జిల్లాలోని సోన్ మండలం పాక్ పట్ల వద్ద ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి 2023లో శంకుస్థాపన చేశారు. మలేషియాకు చెందిన ప్రీ యూనిక్ కంపెనీకి 40 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించారు. అందుకు కంపెనీ ఎకరానికి రూ. 6 లక్షల చొప్పున ప్రభుత్వానికి చెల్లించింది. అయితే ఫ్యాక్టరీ నిర్మాణానికి అన్ని అనుమతులు లభించాయి.
కానీ.. గోదావరి నది బేసిన్ లోని బఫర్ జోన్ లో ఫ్యాక్టరీ నిర్మాణ ప్రాంతం ఉందని, అక్కడ కడితే.. ఎస్సారెస్పీ డ్యామ్ కు భవిష్యత్ లో ముప్పు తలెత్తుతుందని ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు అభ్యంతరాలు తెలిపారు. దీంతో ఎన్ ఓసీ జారీ చేయలేదు. ఏడాదిన్నర అయితున్నా ఫ్యాక్టరీ నిర్మాణ పనులు ఇంకా షురూ కాలేదు. మరో రెండు నెలల్లో ఆయిల్ పామ్ పంట చేతికి రానుండగా కొనుగోలు ప్రశ్నార్థకంగా మారింది.
దాదాపు 4 వేల ఎకరాల్లో రైతులు ఆయిల్ పామ్ సాగు చేయగా పంట వచ్చే సమయం సమీపిస్తుండగా ప్రి యునిక్ కంపెనీ ఇప్పటివరకు కొనుగోలుపై స్పష్టత ఇవ్వలేదు. దీంతో రైతుల్లో ఆందోళన నెలకొంది. మరోవైపు ఫ్యాక్టరీ నిర్మాణంపైనా, పంట కొనుగోలుపైనా మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి స్వయంగా గళమెత్తడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.
మాజీ మంత్రి హోదాతోనా..? కాంగ్రెస్ పార్టీ నేతగానా..?
ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేపట్టిన ధర్నా సమాచారాన్ని డీసీసీ అధ్యక్షుడికి, పార్టీ సీనియర్ నేతలకు ముందస్తుగా ఇవ్వకపోవడం చర్చకు దారితీసింది. ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డికి వ్యతిరేకంగా రైతులతో కలిసి నిర్వహించిన ధర్నాను మాజీ మంత్రి హోదాతో చేపట్టా రా..? లేక కాంగ్రెస్ నేతగా చేపట్టారా..? అనే ప్రశ్నలు సొంత పార్టీ నేతల నుంచే వస్తున్నాయి. డీసీసీ అధ్యక్షుడికి కనీస సమాచారం ఇవ్వకుండా ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డికి వ్యతిరేకంగా మాజీమంత్రి చేసిన ధర్నాపై ప్రస్తుతం కాంగ్రెస్ నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కమీషన్ల కోసమే అడ్డుకుంటున్నాడని అల్లోల ఆరోపణ
బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కమీషన్ల కోసమే ఫ్యాక్టరీ నిర్మాణాన్ని అడ్డుకుంటున్నాడని మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేసిన ఆరోపణలు రాజకీయంగా దుమారం రేపాయి. ఫ్యాక్టరీ తో పాటు చెక్ డ్యాముల నిర్మాణాలు, అమృత్ –2 పనుల ప్రారంభానికి ఎమ్మెల్యే ఉద్దేశపూర్వకంగా అడ్డుపడుతున్నారని తీవ్ర విమర్శలు చేశారు. వీటిని మహేశ్వర్ రెడ్డి సీరియస్ గా తీసుకున్నారు. ఇంద్రకరణ్ రెడ్డి మతిభ్రమించి మాట్లాడుతున్నారని ప్రస్తుతం ఆయన ఏ పార్టీలో ఉన్నారంటూ ఎదురు దాడికి దిగారు. కాంగ్రెస్ లో ఉంటూ ఆ పార్టీకి చెప్పకుండా ఆందోళన ఎలా చేస్తాడంటూ ప్రశ్నిస్తున్నారు.
గోదావరి నదితో పాటు ఎస్సారెస్పీ డ్యామ్ కు దిగువన పామాయిల్ ఫ్యాక్టరీ నిర్మించవద్దంటూ ఉన్నతాధికారులు నివేదిక ఇచ్చినప్పటికీ దానిని పక్కన పెట్టి ఇంద్రకరణ్ రెడ్డి తన భూముల విలువను పెంచుకునేందుకు ఇప్పటికే నిర్మాణానికి శంకుస్థాపన చేశారని మహేశ్వర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ పంటను కొనుగోలు చేయనట్లయితే తాను రైతులతో కలిసి ఆందోళన చేస్తానంటూ ఎమ్మెల్యే హెచ్చరించారు. ఇలా ఇద్దరు నేతల మధ్య రాజకీయంగా ఆరోపణలు, విమర్శలు నడుస్తున్నాయి.