‘ఆగట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా?’ తేల్చుకొమ్మని భారత ఎన్నికల ‘రంగస్థలం’ మీద, రాజకీయ పార్టీలకు ఓటరు సవాల్ విసిరిన సందర్భం నెలకొంది! సార్వత్రిక ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో రాజకీయ పునరేకీకరణల పర్వం దేశంలో మొగ్గ తొడుగుతోంది. నిన్నటి ఎన్నికల ఫలితాల ప్రభావం, రేపటి అసెంబ్లీల ఎన్నికల అవసరాలు దీన్ని మరింత వేగవంతం చేస్తున్నాయి. హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీలకు త్వరలో జరిగే ఎన్నికల సందర్భంగా దృశ్యం ఇంకింత స్పష్టమౌతోంది. కూటమి రాజకీయాలు ద్విధృవ కేంద్రకంగా బలపడుతున్నాయి. ఏకూటమికి చెందని తటస్థులను జనమే తిరస్కరిస్తున్నారు. అందుకే, రెండు తెలుగు రాష్ట్రాల్లో బలమైన ప్రాంతీయ రాజకీయ శక్తులు ఎదో ఒక కూటమి వైపు మొగ్గాల్సిన పరిస్థితి ముంచుకొస్తోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన వైఎస్సార్సీపీకి అనివార్యంగా ఇండియా కూటమి వైపు అడుగులేయాల్సిన పరిస్థితి! తెలంగాణలో ఓడిన బీఆర్ఎస్కు కూడా దాదాపు అలా దారి తేల్చుకోవాల్సిన తరుణం ఇది!
జాతీయ స్థాయిలో ఓడి గెలిచిన విపక్షాలు మరింత సంఘటితమవుతున్నాయి. సర్వేలకు అందని రీతిలో ‘ఇండియా’ కూటమికి మద్దతిచ్చిన భారత పౌరులు దేశంలో బలమైన ప్రతిపక్షాన్ని కోరుకున్నారు. ఫలితంగా, కేవలం 60 సీట్ల తేడాతో పాలక-, విపక్ష కూటములు ఎన్డీయే, ఇండియాలు 18వ లోక్‌సభలో కొలువు దీరాయి. జనాకాంక్షకు అనుగుణంగానే ఓ ఆరోగ్యకరమైన స్పర్ధ, సంఘర్షణ సంకేతాలు వెలువడుతున్నాయి. సంప్రదాయాన్ని తోసిరాజన్న అధికారపక్షంతో స్పీకర్ పదవి పోటీకి విపక్షాలు సిద్ధపడ్డాయి. ఓడిపోయినా సరే అని, 48 ఏండ్ల తర్వాత స్వాతంత్య్ర భారతంలో నాలుగోసారి మాత్రమే స్పీకర్ పదవికి ఎన్నిక జరిగేలా చేశారు. ప్రతిపక్షమే లేకుండా చేద్దామనుకునే పాలకపక్షాలకు ప్రజలే బుద్ధి చెప్పారు. అది నిన్నటి సార్వత్రిక ఎన్నికల గుప్తసారాంశంగా బోధపడింది. తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, ఒడిశా తదితర రాష్ట్రాల్లో ప్రజలిచ్చిన తీర్పు ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. వీలయిన అన్ని అపసవ్య పద్ధతుల్లో ప్రతిపక్షమే లేకుండా చేయాలని పాలకపక్షాలు వేసిన ఎత్తులు, చేసిన జిత్తులను ఓటర్లు చిత్తు చేశారు.
తీర్పుతోనే పాఠాలు
మహారాష్ట్రలో మహాఘట్ బంధన్ ప్రభుత్వం పడిపోయినపుడు,శివసేనను చీల్చి బీజేపీ కొత్త సంకీర్ణ ప్రభుత్వం ఏర్పర్చింది. చీలికవర్గం నేత ఏక్నాథ్ షిండేను ఏకంగా ముఖ్యమంత్రిని చేసింది. ఎన్సీపీని నిలువునా చీల్చి అజిత్ పవార్‌ను ఉప ముఖ్యమంత్రి చేసింది. కేంద్రం కనుసన్నల్లో పనిచేసిన ఎన్నికల సంఘం ఆ రెండు చీలిక వర్గాల్నే అసలు పార్టీలుగా గుర్తించింది. బాధితులుగా ఉద్ధవ్ థాకరే, శరద్‌పవార్ తలుపు తట్టినపుడు, న్యాయస్థానాలూ ఈసీ నిర్ణయాలనే ఖరారు చేశాయి. ఈ పరిణామాలకు ప్రజలెలా స్పందిస్తున్నారో ఆలోచించని బీజేపీ నాయకత్వానికి, నిన్నటి ఫలితాలు వెలువడే వరకూ జనాభిప్రాయం తెలిసిరాలేదు. విస్పష్టంగా బీజేపీ (9) కన్నా కాంగ్రెస్ (13)కు, ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే గ్రూప్ (7) కన్నా థాకరే గ్రూప్ (9) శివసేనకు, చీలికవీరుడు అజిత్ పవార్ గుంపు (1) కన్నా శరద్‌పవార్ గ్రూప్ (8) ఎన్సీపీకి ఎక్కువ స్థానాలు కట్టబెట్టి తమ మనోగతాన్ని మరాఠాలు వెల్లడించారు.
విపక్షమే ఉండొద్దంటే ఎలా?
ప్రతిపక్షాల మనుగడ పాలకపక్షాల ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉండదు, ఉండొద్దు! ‘కాంగ్రెస్ రహిత భారత్’ కలలు కన్న బీజేపీకి చెంపపెట్టుగా వంద స్థానాలిచ్చి హస్తంపార్టీ నేత రాహుల్ గాంధీకి లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడి హోదాను ప్రజలే కట్టబెట్టారు. గట్టి విపక్ష నిర్మాణం ద్వారా.. ప్రజాస్వామ్యం బలోపేతం చేసుకునే తలంపును జనం ప్రకటించారు. ఎందుకంటే, చట్టసభలో కనీసం పదిశాతం (అంటే 54) స్థానాలైనా లేకుండా ‘ప్రతిపక్ష నాయకుడి’ హోదా ఇవ్వడానికి సంప్రదాయం ఒప్పుకోదని 2014 (44), 2019 (52) కాంగ్రెస్‌పార్టీకి ఆ హోదా ఇవ్వడానికి పాలకపక్షం నిరాకరించింది. ఫలితంగా, కీలకమైన ఎన్నికల కమిషన్ కూర్పు, కమిషనర్ల నియామకం, విజిలెన్స్ కమిషనర్, లోక్‌పాల్, సమాచార ముఖ్య కమిషనర్, సీబీఐ డైరెక్టర్ జనరల్ వంటి కీలక పదవుల నియామకాల్లో ప్రధానితోపాటు మూడో వంతు నిర్ణాయక పాత్ర పోషించాల్సిన ‘ప్రతిపక్ష నాయకుడి’ స్థానం పదేండ్లు ఖాళీగా ఉంది. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని జనం గ్రహించారు కనుకే తమ విలక్షణ తీర్పుతో స్పందించారు.
‘నేనూ తప్పు చేస్తాను’ అంటే గొప్పా?
విపక్షమే లేకుండా చేయాలనే రాజకీయ పంథాను గర్హించి, తెలంగాణ ఓటరూ పాలకులకు గుణపాఠమే చెప్పారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనేకాక నిన్నటి పార్లమెంట్ ఎన్నికల్లోనూ అది స్పష్టమైంది. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీని ఖాళీ చేసేందుకు వలసల్ని ప్రోత్సహించి, ఆ పార్టీ గుర్తుతో ఎన్నికైన 14/19 మందిని, కనీసం ఎమ్మెల్యేగిరికి రాజీనామా చేయకున్నా బీఆర్ఎస్లో చేర్చుకున్నారు. ఎన్నికల్లో తమకు ప్రజలిచ్చిన 88 ఎమ్మెల్యే స్థానాలను, వలసల ద్వారా 105కు పెంచుకున్నారు. ఏడుగురు సభ్యుల మజ్లిస్ (ఎంఐఎం) ఎలాగూ మిత్రపక్షమే కనుక... 119లో మిగిలింది ఏడుగురు సభ్యుల ప్రతిపక్షమే! ప్రజలకిది రుచించలేదు. చివరకు సభలో మిగిలిన భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, సీతక్క, వీరయ్య, జగ్గారెడ్డిలతోనే బరిలోకి దిగిన కాంగ్రెస్ పార్టీకి, మెజారిటీకి అవసరమైన స్థానాలు కట్టబెట్టి, వారిని ఏకంగా అధికారంలోకి తెచ్చుకున్నది ప్రజలే! ఇది గ్రహించని కాంగ్రెస్, గద్దెనెక్కి అదే తప్పు తానూ చేస్తోంది. ప్రజలు గత పాలక బీఆర్ఎస్ను ఎంత నిరసించినా, 39 స్థానాలిచ్చి తెలంగాణ అసెంబ్లీలో గట్టి ప్రతిపక్ష స్థానం కల్పించారు. కానీ, ఒక్క లోక్‌సభ సీటూ ఇవ్వలేదు. పార్టీ పుట్టి ఎన్నికల రాజకీయాల్లోకి (2004) వచ్చిన నుంచి... లోక్‌సభలో పార్టీకి ప్రాతినిధ్యం లేనిది ఇప్పుడే! అటు పాలక ‘ఎన్డీయే’లో, ఇటు విపక్ష ‘ఇండియా కూటమి’లోనూ చేరని బీఆర్ఎస్ (తెలంగాణ), వైసీపీ (ఆంధ్రప్రదేశ్), బీజేడీ (ఒడిశా)లను ఈసారి ప్రజలు ఘోరంగా ఓడించారు. వారు ఇక ఏదో ఒక కూటమిలో చేరడం అనివార్యమేమో!
విధిలేని పరిస్థితిలో నడక ఎటో?
‘మా పాలన నచ్చితే ఓటేయండి’ అని అడిగారే తప్ప, ‘నచ్చకపోతే కనీసం ప్రతిపక్ష నాయకుడి హోదానైనా ఇవ్వండి’ అని మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి ఎన్నికల ముందు ఏపీ ప్రజల్ని కోరలేదు. ప్రజలే ఇవ్వనపుడు తాము మాత్రం ఎలా ఇవ్వగలం? అని ఓ సభా సంప్రదాయాన్ని ప్రస్తావిస్తూ ఎన్డీయే కూటమి, ఆయనకు ప్రతిపక్ష నాయకుడి హోదాను తిరస్కరిస్తోంది. తనకా హోదా ఇవ్వాలని లేఖ ద్వారా ఆయన స్పీకర్‌ను కోరారు. స్వీయ ఆలోచనో, ఎవరిదైనా సలహానో తెలియదు కానీ, ఆ లేఖ....అంత మర్యాదపూర్వకంగా లేదు. వారు గెలిచింది 11/175 స్థానాల్లో! కనీసం పది శాతం స్థానాలైనా ఉంటేనే ప్రతిపక్ష నాయకుడి హోదా ఇచ్చే సంప్రదాయమొకటి చట్టసభల్లో నడుస్తోంది. దానికి ప్రత్యేకంగా రాజ్యాంగ, చట్టపరమైన నిర్దేశం లేకపోయినా..ప్రతిపక్ష నాయకుడి జీతభత్యాల ఖరారు చట్టం రూపొందించే క్రమంలో 1977 జనతా ప్రభుత్వ కాలంలో ఒకసారి, ఇటీవలి ఎన్డీయే హయాంలో మరోసారి నిబంధన చేశారు. 2014, 2019 లో లోక్‌సభలో కాంగ్రెస్‌కు ఈ హోదా నిరాకరిస్తూ బిల్లు తెచ్చినపుడు.. ఎన్డీయే భాగస్వామి కాకపోయినా మద్దతిచ్చిన పార్టీల్లో వైసీపీ కూడా ఉంది. తటస్థంగా ఉండి సందర్భాన్ని బట్టి బిల్లులకు మద్దతివ్వడమో, వ్యతిరేకించడమో చేసేటప్పుడు ఏది ప్రజాస్వామ్మాన్ని బలోపేతం చేస్తుంది? మరేది స్ఫూర్తికి భంగం కలిగిస్తుందని చూసుకోవద్దా? అందుకే, ప్రజలడుగుతున్నారు.. ‘ఆ గట్టునుంటావా? ఈ గట్టుకొస్తావా?’ అని.
- దిలీప్‌రెడ్డి,,
పొలిటికల్ అనలిస్ట్
పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ