- స్వల్ప ఉద్రిక్తతలు మినహా ప్రశాంతంగా పోలింగ్
- నిర్వహణ తీరుపై పలు చోట్ల అసంతృప్తి
- సమస్యాత్మక కేంద్రాల్లో భారీ బందోబస్తు
ఆసిఫాబాద్, వెలుగు: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఓటర్లు పోటెత్తారు. స్వల్ప ఉద్రిక్తతలు మినహా అన్ని చోట్ల పోలింగ్ ప్రశాంతంగా సాగింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మొత్తంగా 71.63 శాతం పోలింగ్ నమోదైంది. సిర్పూర్ నియెజక వర్గంలో 71.18 శాతం, ఆసిఫాబాద్ లో 72.08 శాతం ఓటింగ్ జరిగింది. మావోయిస్టుల ప్రాబల్య ప్రాంతంమైన జిల్లాలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. తమ ఓటు హక్కును వినియెగించుకునేందుకు ఓటర్లు ఉదయం నుంచే బారులు తీరారు.
పోలింగ్ కేంద్రాల గేట్లను సాయంత్రం నాలుగు గంటల వరకు మూసేసినా లోపల భారీగా జనం ఉండడంతో పోలింగ్ రాత్రి 8 గంటల వరకు కొనసాగింది. ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో 92 సమస్యాత్మక ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేసి ప్రత్యేక దృష్టి సారించారు. వెబ్ క్యాస్టింగ్, సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పోలింగ్ తీరును అధికారులు పరిశీలించారు. ఎన్నికల నిర్వహణ పక్రియను ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ హేమంత్ సహదేవురావు, పోలీస్ ఎన్నికల అబ్జర్వర్ డాక్టర్ డీకే చౌదరి, ఎస్పీ సురేశ్ కుమార్ ఎప్పటికప్పుడు పరిశీలించారు.
స్లోగా మొదలై భారీగా..
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లాలో ఓటు వినియోగానికి ఓటర్లు ఆసక్తి చూపారు. ఉదయం 7 స్లోగా మొదలైన పోలింగ్రెండు గంటల ఊపందుకోవడంతో పోలింగ్ శాతం పెరుగుతూ పోయింది. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ దంపతులు డైట్ మైదానంలోని పోలింగ్ కేంద్రంలో క్యూలైన్లో వచ్చి ఓటు వేశారు. ఆదిలాబాద్ లో ప్రధాన పార్టీల అభ్యర్థులు జోగురామన్న, పాయల్ శంకర్, కంది శ్రీనివాస్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని పలు కాలనీల్లో రాత్రి 9 గంటల వరకు పోలింగ్ జరిగింది. సాయంత్రం 5 గంటలలోపు పోలింగ్ కేంద్రంలోకి వచ్చిన వారికి పోలింగ్ సిబ్బంది టోకెన్లను జారీ చేసింది. ఆదిలాబాద్నియోజకవర్గంలో మొత్తంగా 77.2 శాతం ఓటింగ్‌నమోదు కాగా.. బోథ్‌లో 82.93 శాతం నమోదైంది. బ్రాహ్మణవాడ కాలనీలో ఓటర్లు ఒక్కసారిగా పెద్ద ఎత్తున లోపలికి రావడంతో గందరగోళం నెలకొంది. బీఆర్ఎస్ వర్గీయులు ఓటర్లను అడ్డుకుంటున్నారని అక్కడే బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో పోలీసులు రంగంలోకి దిగి లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. పోలింగ్ ముగించుకున్న సిబ్బంది ఈవీఏంలను స్ట్రాంగ్ రూంకు తరలించారు. స్ట్రంగ్ రూం ల వద్ద కేంద్ర బలగాలతో భద్రత కట్టుదిట్టం చేశారు.
నిర్మల్‌లో ప్రశాంతం
నిర్మల్: నిర్మల్ జిల్లాలో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. స్వల్ప ఉద్రిక్త ఘటనలు మినహా అన్ని చోట్ల ఎన్నికలు సజావుగా సాగాయి. బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తన సొంత గ్రామమైన ఎల్లాపల్లిలో పార్టీ కండువా వేసుకొని ఓటు వేయడం వివాదాస్పదమైంది. పెంబి మండలం గుమ్మెన ఎంగ్లాపూర్ గ్రామస్తులు తమ గ్రామానికి రోడ్డు నిర్మించే వరకు ఓటు వేయబోమంటూ కొంతసేపు నిరసన తెలిపారు. సమాచారం తెలుసుకున్న నిర్మల్ అడిషనల్ కలెక్టర్ ఆ గ్రామానికి వెళ్లి సమస్య పరిష్కరిస్తామంటూ హామీ ఇవ్వడంతో వారు ఓటింగ్ లో పాల్గొన్నారు.