- ప్రాధాన్య క్రమంలో పనులు చేపట్టాలి
- ఆఫీసర్లతో జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి
హనుమకొండ, వెలుగు: వరంగల్ నగర అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రతి ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌లను త్వరగా తయారు చేయాలని ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆఫీసర్లను ఆదేశించారు. ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తి చేసేందుకు తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. వరంగల్ నగర అభివృద్ధిపై సచివాలయంలో ఆయన జిల్లా మంత్రి కొండా సురేఖ, సీఎం ప్రధాన సలహాదారు వేం నరేందర్‌రెడ్డితో కలిసి కుడా, హనుమకొండ, వరంగల్జిల్లా అధికారులతో బుధవారం రివ్యూ నిర్వహించారు.
వరంగల్ నగర అభివృద్ధి, ఐఆర్ఆర్, ఓఆర్ఆర్, భద్రకాళి చెరువు, విమానాశ్రయం తదితర అంశాలపై ప్రధానంగా చర్చించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నగర అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించారన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకుని నగర అభివృద్ధి పనులను యుద్ధ ప్రతిపాదికన చేపట్టాలని ఆఫీసర్లను ఆదేశించారు. నగరంలో నిర్మించే రింగ్ రోడ్డు జాతీయ రహదారులకు కనెక్టివిటీ ఉండేలా చూడాలన్నారు.
ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ, భద్రకాళి చెరువు శుద్ధీకరణ పనుల్లో వేగం పెంచాలని సూచించారు. సమావేశంలో మున్సిపల్ శాఖ కార్యదర్శి దాన కిశోర్, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ శ్రీదేవి, మైనింగ్ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, వరంగల్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు సత్య శారదాదేవి, పి.ప్రావీణ్య, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.