దొరలకు, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు మధ్య ఎన్నికల యుద్ధం జరుగుతుందని.. ఈ పోరులో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని.. ఇంద్ర లోకాన్ని చూపిస్తూ మభ్యా పెట్టేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తడని పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. 2023, నవంబర్ 14వ తేదీ మంగళవారం ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏంతో మంది కవులు, కళాకారులు, ఉద్యమకారులు, విద్యార్థుల బలిదానం ఫలితంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిందన్నారు. కానీ కేవలం ఒకే ఒక్క కుటుంబం తమ ప్రయోజనాల కోసం ప్రజలను వాడుకుంటుందని ఆరోపించారు. 2014 కు ముందు కేసీఆర్ ఆర్థిక పరిస్థితి ఏంటి?.. గడిచిన తొమ్మిదిన్నర సంవత్సరాల్లో కేసీఆర్ ఆర్ధిక పరిస్థితి ఏంటో ప్రజలు ఆలోచించాలన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా.. కేసీఆర్ ఇంద్ర లోకాన్ని చూపిస్తూ తెలంగాణ యాసలో మాట్లాడుతూ ప్రజలను మభ్య పెడుతుంటాడని.. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ను కాదని రెండు సార్లు కేసీఆర్ కు అధికారం అప్పగిస్తే.. ధనిక రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని రూ.5 లక్షల కోట్ల అప్పుల పాలు చేశాడని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కాళేశ్వరం పేరుతో రూ.5 లక్షల కోట్లలో ప్రజల సొమ్ము రూ.లక్ష కోట్లు కల్వకుంట్ల కుటుంబం దొంగిలించిందని ఆయన ఆరోపించారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ఇచ్చిన హామీలను ఏ ఒక్కటీ నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ రాజ్యం వస్తేనే ప్రజల కష్టాలు తీరుతాయని... ప్రజలు హస్తం గుర్తుపై ఓటు తనను గెలిపించాలని పొంగులేటి కోరారు.