కాళేశ్వరంలో అవినీతి జరిగిందని.. కాగ్ రిపోర్టే చెప్పింది: పొంగులేటి శ్రీనివాస రెడ్డి

ఖమ్మం,  వెలుగు:  కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని కాగ్ రిపోర్టే చెప్పిందని ఖమ్మం మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస రెడ్డి చెప్పారు.  సోమవారం ఖమ్మం ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో  ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు..  బహిరంగ సభకు భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ క్యాడర్​కు, నాయకులకు, తన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.  వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 కి 10 మాత్రమే కాదు, రాష్ట్రవ్యాప్తంగా 100 సీట్లు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, బీఆర్ఎస్ ను బొంద పెడుతామని ధీమా వ్యక్తం చేశారు.  

హిట్లర్ లాగా పాలించే ప్రభుత్వాలను ప్రజలు  కోరుకోవడం లేదని చెప్పారు.  జాతీయ పార్టీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వస్తుంటే  పోలీసులు సభ వద్ద ఉండకుండా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి కాపలాగా ఉన్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ కొడుకు రాహుల్ గాంధీ సభకు వస్తుంటే ముఖ్యమంత్రి, డీజీపీ, సీపీ ఇచ్చే మర్యాద ఇదేనా అంటూ దుయ్యబట్టారు. ఈ   సమావేశంలో కోరం కనకయ్య, పాయం వెంకటేశ్వర్లు, మద్దినేని బేబీ స్వర్ణ కుమారి, మువ్వా విజయ బాబు, తుళ్లూరి బ్రహ్మయ్య, బొర్రా రాజశేఖర్, డాక్టర్ రాజా రమేశ్​, ఎన్నారై ఝాన్సీ రెడ్డి, జారె ఆది నారాయణ, కొండూరు సుధాకర్, వూకంటి గోపాల్ రావు తదితరులు పాల్గొన్నారు.