
ప్రతిపక్షాలు నేతన్నల పేరిట శవరాజకీయాలు చేస్తున్నయ్
చేనేతపై 12శాతం జీఎస్టీ వేసింది బీజేపీనే
బతుకమ్మ చీరల బకాయిల పాపం బీఆర్ఎస్దే
సిరిసిల్ల నేతన్నలకు ఆర్డర్లు ఏడాదంతా పని మంత్రి పొన్నం ప్రభాకర్
రాజన్న సిరిసిల్ల,వెలుగు : సిరిసిల్ల నేతన్నలు అధైర్యపడొద్దని రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. సోమవారం సిరిసిల్ల డీసీసీ ఆఫీసులో మాట్లాడుతూ బీఆర్ఎస్, బీజేపీలు సిరిసిల్ల కేంద్రంగా నేతన్నల పేరుమీద శవరాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. బీజేపీ.. చేనేత మీద 12 శాతం జీఎస్టీ విధించిందన్నారు. జాతీయ చేనేత బోర్డును, జాతీయ టెక్స్ టైల్ బోర్డును రద్దు చేసిందన్నారు. మహాత్మాగాందీ గుణకర్ బీమా యోజన, ఐసీఐసీఐ లాంబార్డ్ ఆరోగ్య బీమాలను కూడా రద్దు చేసిందన్నారు. కేంద్రం స్పెషల్ ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ ప్రమోషన్ కింద రూ.వేల కోట్ల నిధులను దేశవ్యాప్తంగా ఇచ్చిందని, కరీంనగర్ అసమర్థ ఎంపీ బండి సంజయ్ తెలంగాణకు ఎన్ని నిధులు తెచ్చాడో, తమిళనాడుకు ఎన్ని తరలిపోయాయో చెప్పాలన్నారు. కాకతీయ మెగా టెక్స్టైల్పార్క్ఎందుకు వరంగల్ తీసుకెళ్లారో బీజేపీ, బీఆర్ఎస్ సమాధానం చెప్పాలన్నారు.
రూ. 300 కోట్ల బకాయిల పాపం బీఆర్ఎస్దే..
రూ.300 కోట్ల బతుకమ్మ చీరల బకాయిలను నేతన్నలకు ఇవ్వకుండా పెండింగ్లో పెట్టిన పాపం బీఆర్ఎస్ దే అని పొన్నం అన్నారు. 396 స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ యూనిట్లు ఉంటే ఇప్పుడు 105 మాత్రమే పని చేస్తున్నాయన్నారు. తమ ప్రభుత్వం అన్ని మాక్స్ సంఘాలకు పని కల్పించేలా ఆర్డర్లు ఇస్తుందన్నారు. ఈనెల11న జీవో నంబర్ఒకటి తీసుకువస్తున్నామని, రాష్ట్రంలో ఉత్పత్తి అయిన అన్ని వస్త్రాలు టెస్కో ద్వారా కొనుగోలు చేసేలా చూడడమే ఈ జీవో ఉద్దేశమన్నారు. రాజీవ్ విద్యా మిషన్ కింద స్కూల్ యూనిఫామ్స్ కోసం ఇప్పటికే సిరిసిల్లకు రూ.120 కోట్ల ఆర్డర్లు ఇచ్చామన్నారు. గత బీఆర్ఎస్ సర్కార్ కంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదంతా పని కల్పించేలా ఆర్డర్లు ఇస్తుందన్నారు. నేతన్నలను ఆన్ని విధాలుగా ఆదుకుంటామని, ధైర్యంగా ఉండాలన్నారు. ఏ అధికారి పని చేయకున్నా ప్రజలు తనకు చెప్పాలన్నారు. తనను, ఇతర ప్రజాప్రతినిధులను ప్రజలు స్వేచ్ఛగా కలవచ్చన్నారు.
ఆసాములతో మంత్రి చర్చలు సక్సెస్
మంత్రి పొన్నం సోమవారం సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమ ఆసాములతో సమావేశమయ్యారు. బతుకమ్మ చీరల బకాయిలను త్వరలోనే చెల్లిస్తామని, ఇతర డిమాండ్లను కూడా పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో దీక్షలు విరమిస్తున్నట్లు ప్రకటించారు. మూతపడ్డ వస్త్ర పరిశ్రమలను తెరిచేందుకు అంగీకరించారు. చర్చల్లో బతుకమ్మ చీరల బకాయిలు రూ.270 కోట్లు చెల్లించాలని, కొత్త ఆర్డర్లు ఇవ్వాలని, విద్యుత్ బిల్లులపై 50 శాతం సబ్సిడీ ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది.