- నెల రోజులుగా ఖాళీగానే అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టు
- వరంగల్ నుంచి ఆదిలాబాద్‌కు బదిలీ అయిన ఉషారాణి
- విధుల్లో చేరడంపై సందిగ్ధం, ఇన్‌చార్జీకి బాధ్యతలు
- ఏడు మండలాల్లో ఖాళీగా ఏవోల పోస్టులు
ఆదిలాబాద్, వెలుగు : వ్యవసాయమే ప్రధాన జీవనాధారమైన ఆదిలాబాద్జిల్లాలో వ్యవసాయ శాఖలో ఖాళీలు వెక్కిరిస్తున్నాయి. కీలకమైన వ్యవసాయ శాఖను ఇన్చార్జి అధికారితోనే నెట్టుకొస్తున్నారు. రెగ్యులర్ ఆఫీసర్‌తో పోస్టును భర్తీ చేసినప్పటికీ సదరు ఆధికారి ఇంకా విధుల్లో చేరలేదు. దీంతో మళ్లీ ఇన్చార్జీకే బాధ్యతలు అప్పగించారు. గత ఆగస్టులో జిల్లా వ్యవసాయ శాఖ ఇన్చార్జి అధికారిగా ఉన్న ఆదిలాబాద్ ఏడీఏ పుల్లయ్య ఖమ్మం జిల్లాకు బదిలీ అయిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో రెగ్యులర్ డీఏవో వరంగల్‌కు చెందిన ఉషారాణికి పోస్టింగ్ ఇచ్చారు. అయితే నెల రోజులైనా ఆమె ఇంకా విధుల్లో చేరలేదు.
దీంతో బోథ్ ఏడీఏగా పనిచేస్తున్న శ్రీధర్ స్వామికి జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ గా ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. పుల్లయ్యతో పాటు ముగ్గురు ఏడీఏలకు బదిలీ కాగా వారి స్థానంలో కొత్తగా ఎవరినీ నియమించలేదు. దీంతో మొత్తం జిల్లాలోని పలు మండలాల్లో ఏడీఏ, ఏవోలకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ఎన్నో ఏండ్లుగా జిల్లా వ్వయసాయ శాఖ అధికారి పోస్టు ఖాళీగా ఉండగా, తాజాగా రెగ్యులర్ పోస్టును భర్తీ చేసినప్పటికీ సదరు అధికారి ఇంకా చార్జ్ తీసుకోకపోవడంతో ఆమె వస్తారా లేదా అనేదానిపై వ్యవసాయ శాఖలో చర్చ నడుస్తోంది. సదరు ఆఫీసర్ యథాస్థానంలో కొనసాగేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. ఒకవేళ ఆమె విధుల్లో చేరకపోతే మళ్లీ ఇన్చార్జితోనే నెట్టుకురావాల్సిన పరిస్థితి నెలకొంది.
ఆదిలాబాద్ అంటే అనాసక్తి!
వెనుకబడిన ఆదిలాబాద్ జిల్లాకు బదిలీ అయ్యే అధికారులు కొంత మంది విధుల్లో చేరేందుకు అనాసక్తి చూపుతున్నారు. ఓ కీలక శాఖలో జిల్లా అధికారికి రెండు నెలల క్రితం ఆదిలాబాద్‌కు ట్రాన్స్ఫర్ అయినప్పటికీ విధుల్లో చేరేందుకు ఆసక్తి చూపలేదు. ఎట్టకేలకు నెల రోజుల తర్వాత బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడికి రాకుండా ఉండేందుకు పైరవీలు చేసుకున్నా వీలుకాకపోవడంతో ఇష్టం లేకపోయినా తప్పని పరిస్థితుల్లో జాయిన్అయినట్లు ప్రచారం జరిగింది.
తాజాగా జిల్లా వ్యవసాయ అధికారికి సైతం పోస్టింగ్ ఇచ్చి నెల రోజులైనా ఇంకా విధుల్లో చేరకపోవడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో డీఏవోగా ఉన్న ఆశాకుమారికి ఆదిలాబాద్‌లో పోస్టింగ్ ఇచ్చినప్పటికీ ఆమె డ్యూటీలో చేరలేదు. డిప్యూటేషన్‌పై హైదరాబాద్‌లోనే కొనసాగుతూ వచ్చారు. దీంతో ఆమె స్థానంలో ఏడీఏకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలోనే ఆదిలా బాద్ డీఏవోగా ఉషారాణిని నియమించారు. కానీ ఆమె ఇక్కడికి వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదని సొంత శాఖలో ప్రచారం జరుగుతోంది.
కీలక పోస్టులు ఖాళీనే..
వ్యవసాయ శాఖలో ఏడీఏ, ఏవో పోస్టులు ఎంతో కీలకం. రైతుల సమస్యలు పరిష్కరించడం, వారి సందేహాలు తీర్చడంలో వారి పాత్ర ఎంతో ముఖ్యం. అలాంటి పోస్టులు సైతం జిల్లాలో ఖాళీగా ఉండడం, వారి స్థానంలో ఇన్‌చార్జీలకు బాధ్యతలు అప్పగించి పని భారం పెంచడంతో రైతులకు సరైన సేవలు అందడం లేదు. మొన్నటి బదిలీల్లో డీఏవోతో పాటు ముగ్గురు ఏడీఏలు బదిలీ అయ్యారు. సదరు ఏడీఏల స్థానంలో ఎవరికీ పోస్టింగ్ ఇవ్వలేదు. దీంతో ఒక డీఏవో, ముగ్గురు ఏడీఏ పోస్టులు ఖాళీగా ఉండిపోయాయి.
బోథ్, నేరడిగొండ, బజార్హత్నూర్, నార్నూర్, సిరికొండ, బేల ఏవో పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. పక్క మండలాల ఏవోలకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. వానాకాలం పంటలు వేసిన రైతులకు ఈ కీలక సమయంలో పంట ఎదుగుదల, చీడపీడల నుంచి కాపాడుకునే పరిస్థితులపై క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పిస్తూ.. సలహాలు, సూచనలు చేయాల్సి ఉంటుంది. జిల్లా వ్యవసాయ శాఖలో ఉన్నత అధికారి పోస్టులతో పాటు కీలకమైన ఏడీఏ, ఏవో పోస్టులు ఖాళీగా ఏర్పడంతో సరైన సేవలు అందడం లేదని రైతులు వాపోతున్నారు.