
సమాఖ్య విధానాన్ని అనుసరిస్తున్నందు వల్ల పార్లమెంట్లోని ఎగువ సభ అయిన రాజ్యసభ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది. అమెరికన్ సెనేట్ మాదిరి రాజ్యసభ రాష్ట్రాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించలేదు. రాజ్యసభ గరిష్ట సభ్యుల సంఖ్య 250గా నిర్ణయించినప్పటికీ ప్రస్తుతం 245 మందే ఉన్నారు. రాష్ట్రపతి కళలు, సాహిత్యం, సైన్స్, సామాజిక సేవలు మొదలైన రంగాల్లో విశిష్ట సేవలందించిన 12 మంది సభ్యులను రాజ్యసభకు నామినేట్ చేస్తారు. దేశంలో కొత్తగా అఖిల భారత సర్వీసులు ఏర్పాటు చేయాలంటే 312 అధికరణ ప్రకారం రాజ్యసభ ప్రత్యేక తీర్మానం అవసరం. అలాగే, రాష్ట్ర జాబితాలో పేర్కొన్న ఏదైనా అంశం జాతీయ ప్రాముఖ్యం సంతరించుకుందని రాజ్యసభ భావిస్తే 249 అధికరణను అనుసరించి ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించినప్పుడు ఆ అంశంపై శాసనం చేసే అధికారం రాష్ట్రం నుంచి కేంద్రానికి బదిలీ అవుతుంది. అయితే, ఇది ఏడాది వరకు అమల్లో ఉంటుంది. అవసరమనుకుంటే మరో తీర్మానం ద్వారా పొడిగించవచ్చు.
దేశంలో అత్యవసర పరిస్థితి విధించినప్పుడు లోక్సభ రద్దయితే, రాష్ట్రపతి ప్రకటనను రాజ్యసభ తప్పనిసరిగా ఆమోదించాలి. లేకుంటే అత్యవసర పరిస్థితి రద్దవుతుంది. రాజ్యాంగంలోని 99వ అధికరణ ప్రకారం రాజ్యసభ సభ్యులు రాష్ట్రపతి సమక్షంలో లేదా వారి అనుమతి పొందిన అధికారిసమక్షంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఉపరాష్ట్రపతి రాజ్యసభలో సభ్యుడు కానప్పటికీ, రాజ్యసభకు అధ్యక్షత వహిస్తారని 89వ అధికరణ పేర్కొంటుంది. అందువల్లే ఉపరాష్ట్రపతి పై అవిశ్వాస తీర్మానం మొదటగా రాజ్యసభలో ప్రవేశపెట్టాలి.
249వ అధికరణ: రాష్ట్ర జాబితాలోని ఏదో ఒక అంశం జాతీయ ప్రాముఖ్యతను కలిగి ఉన్నది అని రాజ్యసభ 2/3 వ వంతు మెజార్టీతో ఆమోదిస్తే ఆ అంశంపై అధికారం కేంద్రానికి బదిలీ అవుతుంది. ఇలా రూపొందించిన శాసనం ఏడాది కాలం పాటు అమలులో ఉంటుంది. ఒకవేళ రాజ్యసభ మరో తీర్మానాన్ని ఆమోదిస్తే మరో సంవత్సరం ఇలా ఎంత కాలమైనా పొడిగించవచ్చు.
ఉదా: 1965లో ఆహార ధాన్యాల విషయంలో రాజ్యసభ తీర్మానాన్ని అనుసరించి కేంద్రం శాసనాన్ని రూపొందించింది.
312వ అధికరణ: భారత్లో నూతన అఖిల భారత సర్వీసులను ఏర్పాటు చేయాలంటే రాజ్యసభ ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించాలి. రాజ్యసభ తీర్మానాన్ని అనుసరించి పార్లమెంట్ మరో ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించడం ద్వారా మన దేశంలో నూతన అఖిల భారత సర్వీసులను కేంద్రం ఏర్పాటు చేస్తుంది.
ఉదా: సర్కారియా కమిషన్ సూచనల ద్వారా ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీసెస్, ఇండియన్ హెల్త్ అండ్ మెడిసిన్ సర్వీసెస్ లను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల మధ్య అఖిల భారత సర్వీస్ అధికారుల కేటాయింపుపై ప్రత్యుష్ సిన్హా కమిటీ సిఫారసులను 2014, డిసెంబర్లో కేంద్రం సూత్రప్రాయంగా ఆమోదించింది.
90వ అధికరణ: రాజ్యసభ చైర్మన్గా వ్యవహరించే ఉపరాష్ట్రపతిని పదవి నుంచి తొలగించే అభిశంసన తీర్మానాన్ని మొదటగా రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెట్టాలి. రాజ్యసభ సాధారణ మెజారిటీతో ఆమోదించిన తర్వాత మాత్రమే ఆ తీర్మానాన్ని లోక్సభకు పంపుతారు. లోక్సభ కూడా సాధారణ మెజారిటీతో ఆమోదిస్తే వారు పదవి నుంచి తొలగిపోతారు.
దేశంలో ఎలాంటి అత్యవసర పరిస్థితి విధించినా ఒకవేళ ఆ సమయంలో లోక్సభ రద్దయి ఉన్నట్లయితే రాజ్యసభ రాష్ట్రపతి ప్రకటనను తప్పనిసరిగా ఆమోదించాలి. రాజ్యసభ ఆమోదించకపోతే అత్యవసర పరిస్థితి రద్దవుతుంది.
ప్రతి శుక్రవారం రాజ్యసభలో రెండున్నర గంటలపాటు ప్రైవేట్ మెంబర్ బిల్లుపై చర్చించడానికి అవకాశం కల్పిస్తారు.