నార్మల్ డెలివరీల టార్గెట్.. తల్లీబిడ్డలకు శాపం

  • ఉమ్మడి జిల్లాలో 15 రోజుల్లో ముగ్గురు శిశువులు, ఒక బాలింత మృతి
  • టార్గెట్  ‌‌ఉండడంతో సీరియస్ గా ఉన్నా  సిజేరియన్ చేసేందుకు డాక్టర్ల వెనకడుగు 
  •  జగిత్యాలలో ఆరునెలల కింద ఇన్ఫెక్షన్​సోకి 5గురు బాలింతలు మృతి 
  • వరుస ఘటనలు జరుగుతున్నా పట్టించుకోని ఆఫీసర్లు 

కరీంనగర్/జగిత్యాల, వెలుగు: నార్మల్ డెలివరీలు చేయాలన్న సర్కార్ టార్గెట్ తల్లీబిడ్డల మరణాలకు దారితీస్తోంది. ఉమ్మడి ​జిల్లాలోని కరీంనగర్, జగిత్యాల ఎంసీహెచ్  ‌‌ ‌‌లో గత 15 రోజుల్లో ముగ్గురు శిశువులు, ఒక బాలింత చనిపోయారు. మరో ఇద్దరు శిశువులు చనిపోయినా విషయం వెలుగులోకి రానట్లు తెలిసింది.  ఇలాంటి ఘటనలు జరిగినప్పుడల్లా బంధువులు ధర్నాకు దిగడం, హాస్పిటల్ అధికారులు ఎంక్వైరీ కమిటీలు వేయడం, విచారణ పేరిట ఆ కమిటీలు నెలల తరబడి సాగదీయడం పరిపాటిగా మారింది. మాతాశిశు మరణాలన్నీ నార్మల్ డెలివరీకి ప్రయత్నించడంతోనే జరుగుతున్నాయని బంధువులు ఆరోపిస్తుండగా.. తమ నిర్లక్ష్యం ఏమీ లేదని డాక్టర్లు ప్రతిసారీ తప్పించుకుంటున్నారు. 

15 రోజుల్లో ముగ్గురు శిశువులు, బాలింత మృతి.. 

కరీంనగర్ మాతాశిశు సంరక్షణ కేంద్రంలో 15 రోజుల్లో ఇద్దరు శిశువులు, ఒక బాలింత చనిపోయారు. ఈ నెల 2న చొప్పదండి మండలం భూపాలపట్నం గ్రామానికి చెందిన గోగులకొండ శ్వేత డెలివరీ కోసం రాగా డాక్టర్లు నార్మల్ డెలివరీకి ప్రయత్నించారు. బయటికి తీసే క్రమంలో శిశువు చనిపోయింది. కరీంనగర్ సిటీలోని ముకరంపురకు చెందిన నిశత్అఫ్రీన్ 12న డెలివరీ కోసం రాగా,13 తెల్లవారుజామున సిజేరియన్ ద్వారా డాక్టర్ల డెలివరీ చేశారు. అయినప్పటికీ ఆమె ఆరోగ్యం క్షీణించి చనిపోయింది. 

ఆదివారం రాత్రి చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామానికి చెందిన నెల్లి హరిత అడ్మిట్​కాగా ఆమెకు తీవ్ర రక్తస్రావం అయింది. ఆమెను డాక్టర్లు పరిశీలించి.. కడుపులో శిశువు బాగానే ఉందని నార్మల్ డెలివరీ చేస్తామని చెప్పారని హర్షిత భర్త హరీశ్​వెల్లడించారు. అయితే తెల్లవారుజామున శిశువుకు హార్ట్ బీట్ ఎక్కువుందని చెప్పారని, మరికొద్దిసేపటికి కడుపులోనే మగశిశువు చనిపోయాడని డాక్టర్లు చెప్పినట్లు బాధితుడు వాపోయాడు. అడ్మిట్ అయిన వెంటనే సిజేరియన్ చేస్తే బాబు బతికేవాడని కుటుంబసభ్యులు, బంధువులు కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు.  

గంగాధర మండలం మల్లాపూర్ కు చెందిన జమునను డెలివరీ కోసంఈ నెల 11న జగిత్యాల ఎంసీహెచ్  ‌‌ ‌‌లో చేరింది. సిజేరియన్ చేయకుండా డాక్టర్లు నార్మల్ డెలివరీ కోసం చూశారు. బీపీ పెరగడంతో శిశువు చనిపోయింది. డాక్టర్ల నిర్లక్ష్యతోనే శిశువు చనిపోయిందని కుటుంబసభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేశారు.
కమిటీలు వేసి చేతులు దులిపేసుకుంటున్నరు.. 

జగిత్యాల ఎంసీహెచ్ లో ఆరు నెలల కింద కొండ్ర రమ్య, కుర్ర మహేశ్వరి, అయ్యోరి నాగమణి, బాదినేని రజిత, మారంపెల్లి పావని కొద్దిరోజుల వ్యవధిలో ఇన్ఫెక్షన్ తో చనిపోయారు. ఈ ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది. దీంతోపాటు సరైన వైద్యం అందక మల్లాపూర్ మండలం వాల్గొండకు చెందిన లాస్యకు జన్మించిన శిశువు చనిపోవడంతో ఎంసీహెచ్ వైద్య సిబ్బందిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఏప్రిల్18న బాలింత నవ్యశ్రీకి కాన్పు చేసి కడుపులో కర్చీఫ్​ మరిచిపోయారు. ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న కలెక్టర్ యాస్మిన్ బాషా జగిత్యాల గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ రాములు, డీఎంహెచ్ఓ శ్రీధర్, గైనకాలజీ హెచ్ఓడీ అరుణతో విచారణ కోసం త్రీమెన్ కమిటీ వేశారు. ఈ కమిటీ డ్యూటీలో ఉన్న స్టాఫ్ ను ఎంక్వైరీ చేయకుండానే రిపోర్ట్ ఇవ్వడంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇప్పటికీ బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

రిపోర్టు ఉన్నతాధికారులకు పంపించాం

నవ్యశ్రీ కడుపులో మాప్ తీసిన ఘటనతోపాటు బాలింతల మృతిపై త్రీమెన్ కమిటీ ఎంక్వైరీ చేసింది. పూర్తి స్థాయి రిపోర్టు ను ఉన్నతాధికారులకు పంపాం. తదుపరి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం. 
- రాములు, సూపరింటెండెంట్, ఎంసీహెచ్, జగిత్యాల