న్యూఢిల్లీ: ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో మహారాష్ట్ర సీఎం ప్రమాణ స్వీకారోత్సవానికి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. సీఎంతో పాటు ఇద్దరు డిప్యూటీ సీఎంలు గురువారం ప్రమాణం చేయనున్నారు. అయితే, వాళ్లు ఎవరనేది మాత్రం ఇంకా తేలలేదు. మహాయూతి ప్రభుత్వం ఏర్పాటయ్యేందుకు ఒక రోజే గడువు ఉన్నప్పటికీ.. సీఎం, డిప్యూటీ సీఎంలపై సస్పెన్స్ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు బీజేపీ, శివసేన, ఎన్సీపీ కీలక నేతలు భేటీ కాలేదు. వర్చువల్ గానే సమావేశం అవుతున్నారే తప్ప.. కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించలేదు.
మంగళవారం బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ ముంబైలో ఉంటే.. శివసేన చీఫ్ ఏక్‌నాథ్ షిండే థానేలో ఉన్నారు. ఇక ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ ఏమో అమిత్ షాను కలిసేందుకు ఢిల్లీ వెళ్లారు. మూడు పార్టీల.. ముగ్గురు నేతలు వేర్వేరు చోట్ల ఉండటంతో.. అసలేం జరుగుతుందో తెలియక కేడర్ అయోమయంలో పడింది. కాగా, సీఎం పదవి కోసం షిండే పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. సీఎం ఎవరనేది బీజేపీ నిర్ణయిస్తదంటూనే.. ఆ సీటు వదులుకునేందుకు ఇష్టపడట్లేదని సమాచారం.
నేడు గవర్నర్‌తో కీలక నేతల భేటీ
బుధవారం ఉదయం 10 గంటలకు విధాన్ భవన్లో బీజేపీ ఎమ్మెల్యేలు కలిసి ఆ పార్టీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకుంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం బీజేపీ, శివసేన, ఎన్సీపీ ఎమ్మెల్యేలు భేటీ అయి సీఎంను ఎన్నుకుంటారు. ఆ తర్వాత సాయంత్రం కూటమి నేతలు గవర్నర్‌తో భేటీ అయి ఎమ్మెల్యేల బలాన్ని తెలియజేసి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని కోరనున్నారు.
ఏక్‌నాథ్ షిండేను గౌరవించాల్సిందే..: శివసేన
సీఎం పదవి వదులుకునేందుకు ఏక్‌నాథ్ షిండే సుముఖంగా లేనట్లు శివసేన వర్గాలు చెప్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికలను ముందుండి నడిపింది ఏక్‌నాథ్ షిండే అని, ఢిల్లీ అధిష్టానం ఆయన్ను గౌరవించాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వ ఏర్పాటులో ఆలస్యానికి శివసేన కారణం కాదని అంటున్నాయి. ‘‘శివసేనకు ఎవరు ప్రాతినిథ్యం వహిస్తున్నారో మా నేత ఇప్పటికే స్పష్టం చేశారు. ఇప్పుడు ఆయన స్థాయిని కాపాడాలో.. లేదో.. ఢిల్లీ (బీజేపీ అధిష్టానం) నిర్ణయించుకోవాలి. మహాయూతి కూటమిలో విభేదాల్లేవు’’అని శివసేన వర్గీయులు అంటున్నారు. కూటమిలో ఉండాలో.. వద్దో.. బుధవారం షిండే నిర్ణయిస్తారని సేన లీడర్ సంజయ్ సిరాసత్ కామెంట్ చేశారు.
మంత్రి పదవుల కోసం ఢిల్లీకి అజిత్ పవార్
ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ ఢిల్లీకి వెళ్లారు. డిప్యూటీ సీఎం పదవితో ఆయన హ్యాపీగానే ఉన్నప్పటికీ.. ఎక్కువ మొత్తంలో తమకు మంత్రి పదవులు కేటాయించాలని అమిత్‌షాను కోరినట్లు తెలుస్తున్నది. కేబినెట్ లో కీలక శాఖలు తమకే కేటాయించాలని విన్నవించినట్లు సమాచారం. మంత్రి పదవుల కోసం అమిత్ షాతో చర్చించేందుకు అజిత్ పవార్ ఢిల్లీకి వచ్చినట్లు ఆ పార్టీ మహారాష్ట్ర చీఫ్ సునీల్ స్పష్టం చేశారు. మూడు పార్టీల నేతలు కూర్చొని పోర్ట్‌ఫోలియోలపై చర్చిస్తారని తెలిపారు.
నా ఆరోగ్యం బాగానే ఉంది: ఏక్‌నాథ్ షిండే
తన ఆరోగ్యం బాగానే ఉందని, రెగ్యులర్ చెకప్ కోసం హాస్పిటల్‌కు వచ్చినట్లు ఏక్‌నాథ్ షిండే తెలిపారు. థానేలోని జుపిటర్ హాస్పిటల్ నుంచి మలబార్‌హిల్స్‌లోని తన అధికారిక నివాసానికి బయల్దేరే ముందు ఆయన మీడియాతో మాట్లాడారు. కొద్దిగా నీరసంగా ఉందన్నారు. షిండే.. గొంతు నొప్పితో బాధపడుతున్నారని, ఎంఆర్ఐ స్కాన్ కోసం హాస్పిటల్‌కు వచ్చారని డాక్టర్ తెలిపారు. డెంగ్యూ నెగిటివ్ వచ్చిందన్నారు.