వయనాడ్ బరిలో  ప్రియాంక?

వయనాడ్ బరిలో  ప్రియాంక?

 

  •  ప్రత్యక్ష పోరులోకి యువనేత

  • రాయబరేలీలోనే రాహుల్ గాంధీ

  •  బలం చేకూర్చుతున్న కేపీసీసీ చీఫ్ కామెంట్స్

  • అసెంబ్లీ ఎన్నికల నాటికి యూపీ, కేరళలో పాగా వేయడమే లక్ష్యం

  •  త్వరలో నిర్ణయం ప్రకటించే చాన్స్

ఢిల్లీ: ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వయనాడ్ పార్లమెంటరీ స్థానం నుంచి ఎన్నికల బరిలోకి దిగుతారని తెలుస్తోంది. ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఆమె సోదరుడు, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ రాహుల్ గాంధీ ఉత్తర ప్రదేశ్ లోని రాయ్ బరేలీ, కేరళలోని వయనాడ్  నుంచి  పోటీ చేసి రెండు చోట్ల ఘన విజయం సాధించారు. ఈ రెండింటిలో ఏదో ఒక స్థానాన్ని రాహుల్ గాంధీ వదులు కోవాల్సి ఉంటుంది. 2019, 2024 ఎన్నికల్లో రాహుల్ వయనాడ్ నుంచి ఎంపీగా విజయం సాధించారు. ఉత్తర ప్రదేశ్ లోని రాయ్ బరేలీ కాంగ్రెస్ కంచుకోటగా ఉంది. 1952లో ఈ సెగ్మెంట్ ఆవిర్భవించింది. మొదటి ఎంపీగా రాహుల్ గాంధీ తాతయ్య ఫిరోజ్ గాంధీ పనిచేశారు. ఇక్కడి నుంచి 1952, 1957లో విజయం సాధించారు. మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ కూడా ఈ సెగ్మెంట్ నుంచి మూడు పర్యాయాలు ఎంపీగా కొనసాగారు. 2004 నుంచి 2019 వరకు రాహుల్ గాంధీ తల్లి, ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ ఇక్కడి నుంచి ఎంపీగా వరుస విజయాలు సాధిస్తూ వచ్చారు. ఇటీవల ఆమె రాజ్యసభకు  వెళ్లడంతో రాహుల్ గాంధీ ఆ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. కాంగ్రెస్ కంచుకోటగా విరాజిల్లుతున్న ఈ స్థానం నుంచే ఎంపీగా కొనసాగాలని రాహుల్ గాంధీ భావిస్తున్నట్టు సమాచారం.

సంతోషపర్చే నిర్ణయం ఇదేనా?

రెండు చోట్ల గెలిచిన రాహుల్ గాంధీ ఏ స్థానాన్ని వదులుకోవాలనే డైలమాలో ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై ఆయన నిర్ణయం తీసుకోలేదు. తన తుది నిర్ణయం రెండు నియోజకవర్గాల ప్రజలను సంతోషపరుస్తుందని ఇటీవల వయనాడ్ లో పర్యటనల సందర్భంగా రాహుల్ చెప్పారు. జాతీయ రాజకీయాల్లో యూపీకి ఉన్న ప్రాధాన్యత కారణంగా రాయబరేలీలోనే కొనసాగడం దాదాపు ఖాయమని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. దీనికి తోడు దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన యూపీలో ఇండియా కూటమి బలం పెరగడంతో కాంగ్రెస్ అధినాయకత్వం ఆ రాష్ట్రంపై ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. అదే సమయంలో కేరళలో ఎల్డీఎఫ్​ ఓట్ల శాతం గణనీయంగా పడిపోవడం.. యూడీఎఫ్​ పుంజుకోవడంతో అక్కడ ప్రియాంక ఉంటే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రావచ్చని ఏఐసీసీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నిర్ణయం ద్వారా రెండు రాష్ట్రాల్లో పాగా వేయొచ్చని కాంగ్రెస్ భావిస్తోంది. 

కేపీసీసీ చీఫ్ సుధాకరన్ ఏమన్నారంటే..?

‘దేశానికి నాయకత్వం వహించాల్సిన రాహుల్ గాంధీ వయనాడ్‌లో ఉంటారని ఊహించలేం.. కాబట్టి మనం బాధపడాల్సిన అవసరం లేదు. మనం బాధపడకూడదు. ప్రతి ఒక్కరూ దానిని అర్థం చేసుకోవాలి.. ఆయనకు మద్దతుగా నిలవాలి’అంటూ కేపీసీ చీఫ్ నేత సుధాకరన్ పేర్కొనడం రాహుల్ వయనాడ్ ను వదులుకుంటారనే వ్యాఖ్యలకు ఊతమిస్తోంది. దీంతో రాహుల్ చెప్పిన సంతోషకరమైన నిర్ణయం ప్రియాంక ఎంట్రీ ఇవ్వడమేననే టాక్ మొదలైంది. ఆమె వయనాడ్ ఎంపీగా పోటీ చేసే అవకాశాలు ఉన్నట్టు అర్థమవుతోంది.