లోక్‌సభ బడ్జెట్ సమావేశాల్లో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. 2024 ఎన్నికల్లో బీజేపీ స్వతహాగా 370, తన మిత్రపక్షాలతో కలిసి 400 మంది ఎంపీలను గెలవబోతున్నదని ప్రకటించారు. 2019లో బీజేపీతో పాటు మిత్రపక్షాలు 353 స్థానాలను గెలుచుకున్నాయి. అంటే 543 మంది ఎంపీల్లో బీజేపీ ఈసారి100 మంది ఎంపీలు అధికంగా గెలవనుందని పరోక్షంగా తెలిపారు. గత చరిత్రను పరిశీలిస్తే 1984లో ఇందిరా గాంధీ హత్య కారణంగా కాంగ్రెస్‌పార్టీ రాజకీయ చరిత్రలో అసాధారణంగా 400 మంది ఎంపీలను గెలుచుకుంది. మొదటిసారి జరిగిన 1952 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ 489 ఎంపీలకుగానూ
369 మంది మాత్రమే గెలిచింది.
కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు నరేంద్ర మోదీకి లోక్‌సభలో 272 మంది ఎంపీలు మాత్రమే కావాలి. అయితే బహుశా బీజేపీని ఉత్సాహపరిచి, ప్రత్యర్థుల నైతికతను తగ్గించినందుకు నరేంద్ర మోదీ బీజేపీ 400 మంది ఎంపీలను గెలుస్తుందని చెప్పి ఉండవచ్చు. రాజకీయ యుద్ధంలో గొప్ప ఆయుధాలలో అత్యాధునిక అస్త్రాలు తుపాకులు లేదా బాంబులు కాదు.. పదాలు.
మీరు మీ ప్రధాన శత్రువును నైతికంగా తగ్గించగలిగితే, మీరు ఇప్పటికే యుద్ధంలో గెలిచినట్లు అని చెప్పవచ్చు. ఎందుకంటే శత్రువులు తన శక్తియుక్తులను పూర్తిగా ఉపయోగించి సరిగ్గా పోరాడలేరు. 1979లో వియత్నాం యుద్ధం జరిగినప్పటి నుంచి చైనా గత 44 సంవత్సరాలుగా యుద్ధం చేయలేదు. అయితే శత్రువులను భయపెట్టడానికి క్రమం తప్పకుండా చైనా తన రాకెట్లు, విమానాలు, ఆధునిక ఆయుధ సామగ్రిని తరచుగా ప్రదర్శిస్తోంది. ప్రధాన మంతి నరేంద్ర మోదీ బాగా పనిచేస్తున్నారు. కానీ, 400 మంది ఎంపీలను గెలవడానికి ఆయన ప్రస్తుత పనితీరు సరిపోదు.
2019 పార్లమెంట్ ఎన్నికల చిత్రం
ఉత్తరప్రదేశ్, బిహార్, అస్సాం, కర్నాటక, రాజస్థాన్, హర్యానా, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్, చత్తీస్‌గఢ్, మహారాష్ట్రలలో బీజేపీ అత్యధికంగా ఎంపీ నియోజకవర్గాల్లో గెలిచి ఎంపీలను కైవసం చేసుకుంది. పశ్చిమ బెంగాల్, ఒడిశా, ఢిల్లీ, తెలంగాణ రాష్ట్రాల్లో శక్తిమంతమైన ప్రాంతీయ ప్రతిపక్షాలకు చెందిన ముఖ్యమంత్రులు ఉన్నప్పటికీబీజేపీ గణనీయంగా ఎంపీ స్థానాలను గెలుచుకుంది. అయితే, తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ఒక్క ఎంపీ స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయింది. తెలంగాణలో బీజేపీ కేవలం 4 మంది ఎంపీలను మాత్రమే గెలుచుకుంది.
బలహీనతలను సరిదిద్దుకున్న బీజేపీ
మహారాష్ట్ర, బిహార్‌లలో 88 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి. 2019లో 88 లోక్‌సభ స్థానాలకుగాను 81 మంది ఎంపీలను బీజేపీ కూటమి గెలుచుకుంది. కానీ, హఠాత్తుగా మహారాష్ట్ర, బిహార్ రెండింటిలోనూ ప్రతిపక్ష ముఖ్యమంత్రులు పదవులు కైవసం చేసుకోవడంతో ఈ రెండు రాష్ట్రాలు బీజేపీకి ప్రమాదకరంగా మారాయి. మహారాష్ట్రలో ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం, బిహార్‌లో నితీశ్ కుమార్,- లాలూ ప్రసాద్ ప్రభుత్వం అధికారంలోకిరాగా ఈ రెండు ప్రభుత్వాలను బీజేపీ పతనం చేసింది. ఇప్పుడు బిహార్, మహారాష్ట్ర ఈ రెండు రాష్ట్రాలు బీజేపీకి సురక్షితంగా మారాయి. 2019లో ఈ రాష్ట్రాల్లోని 88 మంది ఎంపీలకుగాను 81 మంది ఎంపీలను బీజేపీ తమ ఖాతాలో వేసుకున్నా.. ఇప్పుడు బిహార్, మహారాష్ట్రలో బీజేపీ విజయం సాధించే ఎంపీ స్థానాలు తక్కువగా ఉండొచ్చు.
మోదీ లక్ష్యంలో బలహీనతలు
ఏదో ఒక అద్భుతం సాధించడం ద్వారా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళలో బీజేపీ గణనీయమైన సంఖ్యలో ఎంపీలను గెలుస్తుందని ప్రధాని మోదీ భావిస్తున్నారు. అయితే అలాంటి అవకాశం ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలు లేవు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని ధీమా వ్యక్తం చేసినా రాష్ట్రంలో 119 మంది ఎమ్మెల్యేలకుగానూ కేవలం 8 మంది ఎమ్మెల్యేలతోనే సరిపెట్టుకుంది. బీజేపీ మాటలు ప్రగల్భాలుగానే మిగిలిపోయిన సంగతి మీకు గుర్తుండే ఉంటుంది. అదేవిధంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ ఈ మూడు రాష్ట్రాలపై బీజేపీ చాలా విశ్వాసంగా ఉంది.
కానీ, క్షేత్రస్థాయిలో మాత్రం బీజేపీ ఎంపీలను గెలిపించుకునేందుకు తగినంత పాపులారిటీ పెంచుకుందనడానికి ఎలాంటి ఆధారాలు లేవు. 2004లో అటల్ బిహారీ వాజ్‌పేయి కూడా 543 లోక్‌సభ స్థానాల్లో 300 మంది ఎంపీలను గెలుచుకుంటారనే నమ్మకంతో ఉన్నారు. బీజేపీ తన దీర్ఘకాల మిత్రపక్షాలను విస్మరించి ఆ స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసింది. 2004లో బీజేపీ ఏజీపీ (అస్సాం), డీఎంకే, జార్ఖండ్ ముక్తి మోర్చా, చౌతాలాకు చెందిన హర్యానా లోక్‌దళ్ మొదలైన అనేక చిన్న పార్టీలను పక్కనపెట్టింది.
దీంతో ఫలితాలు వెలువడిన తరువాత దిగ్భ్రాంతికరమైన ఓటమిని కాషాయం పార్టీ చవిచూసింది. ఆ ఎన్నికల్లో బీజేపీ 138 ఎంపీలను మాత్రమే గెలుచుకుంది. 2004లో వాజ్‌పేయి హయాంలో ఘోర పరాజయం గురించి నరేంద్ర మోదీకి పూర్తిగా తెలుసు. ప్రస్తుతం నరేంద్ర మోదీ 2004లో వాజ్‌పేయి కంటే మెరుగైన స్థితిలో ఉన్నారనడంలో సందేహం లేదు.
2024 లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో కచ్చితంగా ప్రతిపక్షాలు ఏకతాటిపైకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న మిత్రపక్షాలకు పెద్దపీట వేసేందుకు కాంగ్రెస్ త్యాగాలకు సిద్ధపడుతున్నది. గతంలో పార్లమెంటుకు 450 మంది ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ పోటీ చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ 300 మంది ఎంపీలతోనే ఎన్నికల రణరంగానికి సిద్ధమవుతున్నది. ఇది ఇంతకు ముందెన్నడూ జరగని పెద్ద మార్పును సూచిస్తోంది.
సన్ త్జు యుద్ధ వ్యూహాలను అనుసరిస్తున్న మోదీ
2500 సంవత్సరాల క్రితం యుద్ధంపై ప్రముఖ చైనా తత్వవేత్త సన్ త్జు ఇచ్చిన సలహాను నరేంద్ర మోదీకి తెలుసో, లేదా తెలియకుండానే పాటిస్తున్నారో తెలియదు. విజయవంతమైన యోధులు మొదట గెలిచి, ఆపై యుద్ధానికి వెళతారు, ఓడిపోయిన యోధులు యుద్ధానికి వెళ్లి ఆపై పోరాడుతారు’ అని చైనా తత్వవేత్త సన్ త్జు అన్నారు. దీని అర్థం ఏమిటంటే,, మీరు పోరాడకుండా కూడా ‘ఇతర మార్గాల ద్వారా’ యుద్ధాలను గెలవాలి.
బీజేపీ 400 మంది ఎంపీలను గెలుస్తుందని చెప్పి ప్రతిపక్షంలో నిరాశావాదం సృష్టించి, ఎన్నికలు ఇంకా ప్రారంభం కాకముందే మోదీ గెలుస్తున్నారనే వాతావరణం తెస్తున్నారు. సన్ త్జు చెప్పిన మరో విషయం..‘ మీ ప్రణాళికలు రాత్రిలా రహస్యంగా అభేద్యంగా ఉండనివ్వండి, ఆపై మెరుపులా దాడిచేయండి’. మోదీ ఈ సలహాను పూర్తిగా పాటిస్తున్నారు. బిహార్, మహారాష్ట్ర ప్రభుత్వాలను అకస్మాత్తుగా బీజేపీ ఎలా పడగొట్టిందో చూస్తే ఆయన వ్యూహం మనకు అవగతమవుతోంది.
ప్రచారం తక్షణ అవసరాలకు ఉపయోగపడుతుంది. అయితే ఇది చాలా తక్కువ జీవితాన్ని కలిగి ఉంది. ఎన్నికలు అనూహ్యమైనవి. కచ్చితమైన ఫలితాలను ముందుగానే ఊహించడం అసాధ్యం. కానీ, మోదీ మాత్రం ప్రస్తుతం సాధారణ మెజారిటీ సాధించేంత బలంగా కనిపిస్తున్నారు. అయితే, 400 మంది ఎంపీల లక్ష్యం ప్రస్తుతం అసాధ్యంగా కనిపిస్తోంది.
బీజేపీ గెలవగలదా?
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా చాలా ప్రజాదరణ పొందారు. ఆయన వంశపారంపర్య రాజకీయవేత్త కాదు. వ్యక్తిగతంగా అవినీతిపరుడు కాదని అభిప్రాయం సాధారణ ప్రజల్లో నెలకొంది. ఏప్రిల్ 2020 నుంచి చైనా దూకుడును అడ్డుకున్నందుకు, ప్రపంచవ్యాప్తంగా భారతదేశ ప్రతిష్టను పెంచినందుకు విస్తృత ప్రశంసలు అందుకున్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో మోదీ సారథ్యంలో బీజేపీ భారీ విజయం సాధించింది. ఈ గెలుపు 2024 ఎన్నికలకు బీజేపీకి పెద్ద ఊపునిచ్చింది. కాబట్టి 2024 ఎన్నికలకు బీజేపీ చాలా పటిష్టమైన స్థితిలో ఉన్నట్లు కనిపిస్తోంది.
డా. పెంటపాటి పుల్లారావు,పొలిటికల్ ఎనలిస్ట్